ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఐటీ సేవల సంస్థ రామ్‌కో సిస్టమ్స్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క క్లిక్స్ క్యాపిటల్‌తో నాన్‌బైండింగ్ ఒప్పందం(ఎల్‌వోఐ) కుదుర్చుకున్నట్లు వెల్లడికావడంతో ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
రామ్‌కో సిస్టమ్స్
ప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కేడియా కంపెనీలో 1 శాతం వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యాక జోరందుకున్న సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 13 పెరిగి రూ. 147 సమీపంలో ఫ్రీజయ్యింది. వెరసి వరుసగా ఐదో రోజు అప్పర్ సర్క్యూట్‌కు చేరింది. ఫలితంగా గత వారం రోజుల్లో ఈ కౌంటర్ ఏకంగా 90 శాతం దూసుకెళ్లింది. ఈ నెల 9న రామ్‌కో సిస్టమ్స్ షేరు రూ. 77 సమీపంలో ముగిసింది. కాగా.. గత వారం విజయ్ కేడియా ఓపెన్ మార్కెట్ ద్వారా రామ్‌కో సిస్టమ్స్‌లో షేరుకి రూ. 87.8 ధరలో 1.1 శాతం ఈక్విటీని కొనుగోలు చేశారు. 3.4 లక్షల షేర్ల కొనుగోలుకి రూ. 3 కోట్లు వెచ్చించారు. కంపెనీ శుక్రవారం(19న) క్యూ4 ఫలితాలు ప్రకటించనుంది.
లక్ష్మీ విలాస్ బ్యాంక్
క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్, క్లిక్ ఫైనాన్స్ ఇండియాలతో ప్రాథమిక నాన్‌బైండింగ్ ఒప్పందాన్ని(ఎల్‌వోఐ) కుదుర్చుకున్నట్లు లక్ష్మీ విలాస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. బ్యాంకులో క్లిక్స్ గ్రూప్ విలీనానికి సంబంధించి ఎల్‌వోఐపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. తద్వారా 45 రోజుల్లోగా ఇందుకు సంబంధించి నియంత్రణ సంస్థల అనుమతి తదితర సన్నాహాలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. పీఈ సంస్థ అయాన్ క్యాపిటల్ పార్టనర్స్‌కు చెందినదే క్లిక్స్ క్యాపిటల్. అయాన్ క్యాపిటల్ పార్టనర్స్‌లో న్యూయార్క్ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్, దేశీ సంస్థ ఐసీఐసీఐ వెంచర్ భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 16 వద్ద ఫ్రీజయ్యింది. ఇంతక్రితం నియంత్రణ సంస్థలు అనుమతించకపోవడంతో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌తో విలీనానికి లక్ష్మీ విలాస్ బ్యాంక్ చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment