సిమెంట్‌ పరిశ్రమలో తగ్గిన వృద్ధి వేగం | Cement demand growth to slow 7 to 8percent in FY25 says Crisil Ratings | Sakshi
Sakshi News home page

Crisil Ratings: సిమెంట్‌ పరిశ్రమలో తగ్గిన వృద్ధి వేగం

Published Thu, Oct 17 2024 1:07 AM | Last Updated on Thu, Oct 17 2024 8:16 AM

Cement demand growth to slow 7 to 8percent in FY25 says Crisil Ratings

2024–25లో 7–8 శాతం ఉండొచ్చు 

క్రిసిల్‌ నివేదిక అంచనా 

గత రెండు సంవత్సరాల్లో 11% వృద్ధి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌ పరిశ్రమలో వృద్ధి నిదానించొచ్చని, 7–8 శాతం మేర నమోదు కావొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. 475 మిలియన్‌ టన్నుల మేర డిమాండ్‌ ఉండొచ్చని పేర్కొంది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో సిమెంట్‌ రంగంలో డిమాండ్‌ ఏటా 11 శాతం చొప్పున వృద్ధి చెందడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) సిమెంట్‌ డిమాండ్‌ కేవలం 3 శాతం వృద్ధినే నమోదు చేయడం గమనార్హం. వేసవిలో అధిక వేడి వాతావరణానికి తోడు, సాధారణ ఎన్నికల సమయంలో కార్మికుల కొరత డిమాండ్‌ మందగించడానికి కారణాలుగా క్రిసిల్‌ తెలిపింది.

 రెండో త్రైమాసికంలోనూ (జూలై–సెపె్టంబర్‌) సిమెంట్‌ డిమాండ్‌ మొదటి క్వార్టర్‌లో మాదిరే నమోదై ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, అక్టోబర్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ద్వితీయ ఆరు నెలల కాలం (2024–25)లో సిమెంట్‌ పరిశ్రమలో డిమాండ్‌ మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు మార్జిన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని తెలిపింది. నిర్వహణ లాభం టన్నుకు రూ.975–1,000 మధ్య ఉండొచ్చని, ఇది దశాబ్ద సగటు రూ.963 కంటే ఎక్కువని పేర్కొంది. దేశ విక్రయాల్లో 85% వాటా కలిగిన 18 సిమెంట్‌ తయారీ సంస్థలను విశ్లేశించి క్రిసిల్‌ ఈ నివేదికను రూపొందించింది.  

హౌసింగ్‌ నుంచి డిమాండ్‌.. 
ఇళ్ల నిర్మాణ రంగం నుంచి సిమెంట్‌ డిమాండ్‌ పుంజుకోవచ్చని, మెరుగైన వర్షాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకోవడాన్ని క్రిసిల్‌ నివేదిక ప్రస్తావించింది. మొత్తం సిమెంట్‌ వినియోగంలో ఇళ్ల నిర్మాణ రంగం 55–60% వాటా ఆక్రమిస్తుండడం గమనార్హం. దీనికి తోడు మౌలిక వసతుల కల్పనపై  ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు సైతం సిమెంట్‌ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని.. సిమెంట్‌ డిమాండ్‌లో మౌలిక రంగం వాటా 30 శాతంగా ఉంటుందని తెలిపింది. వాస్తవానికి మౌలిక రంగం నుంచి సిమెంట్‌కు డిమాండ్‌ జూలై వరకు స్తబ్దుగానే ఉన్నప్పటికీ.. అక్టోబర్‌ నుంచి కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది.

 ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నుంచి సిమెంట్‌కు డిమాండ్‌ను పెంచుతుందని వివరించింది. 2024–25 బడ్జెట్‌లో మూలధన వ్యయాలకు కేటాయింపులను కేంద్రం 6% పెంచడంతో మౌలిక రంగ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయని తెలిపింది. కంపెనీల వద్ద నగదు నిల్వలు మెరుగైన స్థితిలో ఉండడం వాటి రుణ పరపతిని స్థిరంగా ఉంచేలా చేస్తుందని పేర్కొంది. ఇక నిర్మాణ రంగ కార్యకలాపాలు మందగించడం లేదా మౌలిక ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయాలు బలహీనంగా ఉంటే కనుక అది సిమెంట్‌ డిమాండ్‌ను దెబ్బతీయవచ్చని రిస్‌్కలను ప్రస్తావించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు లేదా కంపెనీలు సిమెంట్‌ విక్రయ ధరలను పెంచలేకపోవడం కంపెనీల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చని హెచ్చరించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement