Cement demand falls
-
సిమెంట్ పరిశ్రమలో తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ పరిశ్రమలో వృద్ధి నిదానించొచ్చని, 7–8 శాతం మేర నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 475 మిలియన్ టన్నుల మేర డిమాండ్ ఉండొచ్చని పేర్కొంది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో సిమెంట్ రంగంలో డిమాండ్ ఏటా 11 శాతం చొప్పున వృద్ధి చెందడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) సిమెంట్ డిమాండ్ కేవలం 3 శాతం వృద్ధినే నమోదు చేయడం గమనార్హం. వేసవిలో అధిక వేడి వాతావరణానికి తోడు, సాధారణ ఎన్నికల సమయంలో కార్మికుల కొరత డిమాండ్ మందగించడానికి కారణాలుగా క్రిసిల్ తెలిపింది. రెండో త్రైమాసికంలోనూ (జూలై–సెపె్టంబర్) సిమెంట్ డిమాండ్ మొదటి క్వార్టర్లో మాదిరే నమోదై ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ద్వితీయ ఆరు నెలల కాలం (2024–25)లో సిమెంట్ పరిశ్రమలో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు మార్జిన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని తెలిపింది. నిర్వహణ లాభం టన్నుకు రూ.975–1,000 మధ్య ఉండొచ్చని, ఇది దశాబ్ద సగటు రూ.963 కంటే ఎక్కువని పేర్కొంది. దేశ విక్రయాల్లో 85% వాటా కలిగిన 18 సిమెంట్ తయారీ సంస్థలను విశ్లేశించి క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. హౌసింగ్ నుంచి డిమాండ్.. ఇళ్ల నిర్మాణ రంగం నుంచి సిమెంట్ డిమాండ్ పుంజుకోవచ్చని, మెరుగైన వర్షాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడాన్ని క్రిసిల్ నివేదిక ప్రస్తావించింది. మొత్తం సిమెంట్ వినియోగంలో ఇళ్ల నిర్మాణ రంగం 55–60% వాటా ఆక్రమిస్తుండడం గమనార్హం. దీనికి తోడు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు సైతం సిమెంట్ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని.. సిమెంట్ డిమాండ్‌లో మౌలిక రంగం వాటా 30 శాతంగా ఉంటుందని తెలిపింది. వాస్తవానికి మౌలిక రంగం నుంచి సిమెంట్‌కు డిమాండ్ జూలై వరకు స్తబ్దుగానే ఉన్నప్పటికీ.. అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి సిమెంట్‌కు డిమాండ్‌ను పెంచుతుందని వివరించింది. 2024–25 బడ్జెట్లో మూలధన వ్యయాలకు కేటాయింపులను కేంద్రం 6% పెంచడంతో మౌలిక రంగ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయని తెలిపింది. కంపెనీల వద్ద నగదు నిల్వలు మెరుగైన స్థితిలో ఉండడం వాటి రుణ పరపతిని స్థిరంగా ఉంచేలా చేస్తుందని పేర్కొంది. ఇక నిర్మాణ రంగ కార్యకలాపాలు మందగించడం లేదా మౌలిక ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయాలు బలహీనంగా ఉంటే కనుక అది సిమెంట్ డిమాండ్‌ను దెబ్బతీయవచ్చని రిస్‌్కలను ప్రస్తావించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు లేదా కంపెనీలు సిమెంట్ విక్రయ ధరలను పెంచలేకపోవడం కంపెనీల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చని హెచ్చరించింది. -
రాష్ట్రంలో తగ్గిన సిమెంట్ డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సిమెంట్ ధరల్లో పెరుగుదల కనిపిస్తున్నా, రాష్ట్రంలో ఆ మేరకు పెరగడం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సిమెంట్ వినియోగమూ తగ్గిపోయింది. గతేడాది ఇదే కాలంలో నెలకు సుమారు 20 లక్షల టన్నుల సిమెంట్‌ను వినియోగిస్తే ఇప్పుడది 11-12 లక్షల టన్నులకు పడిపోయిందని సిమెంట్ కంపెనీ ప్రతినిధులు వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్రాండెడ్ సిమెంట్ బస్తా ధర రూ.290 పలుకుతోంది. కానీ గతేడాది ఇదే కాలానికి ధర రూ.300పైన పలికేది. కనిష్ట స్థాయిల నుంచి ధరలు కొద్దిగా పెరిగినా గతేడాదితో పోలిస్తే ఇప్పటికీ తక్కువ ధరలోనే ఉన్నాయని భారతీ సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీంద్ర రెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా దీపావళి పండుగ తర్వాత సిమెంట్‌కి డిమాండ్ పెరుగుతుందని, కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదని పేరు రాయడానికి ఇష్టపడని ఇంకొక కంపెనీ ప్రతినిధి తెలిపారు. రాష్ట్ర విభజనకు తోడు, తుపాన్లు, వర్షాలు కూడా ఈ సారి సిమెంట్ డిమాండ్‌ను దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం 60% కూడా వినియోగించకపోవడం పరిస్థితికి నిదర్శనం. కానీ దీనికి భిన్నంగా ఉత్తర, పశ్చిమ భారత దేశంలో సిమెంట్ ధరలు రెండు నెలల్లో బస్తాకి రూ.40-60 వరకు పెరిగాయి. సాధారణంగా హైదరాబాద్ ధర కంటే తక్కువ రేట్లు ఉండేవని, కానీ ఇప్పుడు ముంబైలో బస్తా రూ.320 వరకు పలుకుతోందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇక్కడ కంపెనీలు 80-90% వరకు సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి 4 లక్షల టన్నులకు ఆర్డర్లు ఇవ్వడంతో డిసెంబర్ తర్వాత డిమాండ్ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. రూ. 325 దాటితేనే లాభాలు పెరిగిన విద్యుత్ టారిఫ్‌లు, ముడిసరుకుల ధరలతో సిమెంట్ కంపెనీల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో సిమెంట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాది క్యూ2 లో రూ.49 కోట్లు లాభాలు ప్రకటించిన ఇండియా సిమెంట్స్ ఈ ఏడాది రూ.22 కోట్ల నష్టాల్లోకి జారింది. రామ్‌కో సిమెంట్స్ లాభాలు 86% క్షీణించి రూ.18.3 కోట్లకు పడిపోయాయి. విద్యుత్ టారిఫ్‌లు పెరగడం, పెరిగిన వడ్డీరేట్లు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బస్తా సిమెంట్ ధర కనీసం రూ.325 దాటితే కానీ లాభాలు వచ్చే పరిస్థితి లేదని సిమెంట్ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ధర పలకడం కష్టంగా ఉండటంతో ఈ ఏడాదీ సిమెంట్ కంపెనీలకు నష్టాలు తప్పవని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.