రాష్ట్రంలో తగ్గిన సిమెంట్ డిమాండ్ | Cement demand falls, price shoots up | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో తగ్గిన సిమెంట్ డిమాండ్

Published Wed, Nov 27 2013 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

రాష్ట్రంలో తగ్గిన సిమెంట్ డిమాండ్

రాష్ట్రంలో తగ్గిన సిమెంట్ డిమాండ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సిమెంట్ ధరల్లో పెరుగుదల కనిపిస్తున్నా, రాష్ట్రంలో ఆ మేరకు పెరగడం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సిమెంట్ వినియోగమూ తగ్గిపోయింది. గతేడాది ఇదే కాలంలో నెలకు  సుమారు 20 లక్షల టన్నుల సిమెంట్‌ను వినియోగిస్తే ఇప్పుడది 11-12 లక్షల టన్నులకు పడిపోయిందని సిమెంట్ కంపెనీ ప్రతినిధులు వాపోతున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో బ్రాండెడ్ సిమెంట్ బస్తా ధర రూ.290 పలుకుతోంది. కానీ గతేడాది ఇదే కాలానికి ధర రూ.300పైన పలికేది.  కనిష్ట స్థాయిల నుంచి ధరలు కొద్దిగా పెరిగినా గతేడాదితో పోలిస్తే ఇప్పటికీ తక్కువ ధరలోనే ఉన్నాయని భారతీ సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీంద్ర రెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా దీపావళి పండుగ తర్వాత సిమెంట్‌కి డిమాండ్ పెరుగుతుందని, కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదని పేరు రాయడానికి ఇష్టపడని ఇంకొక కంపెనీ ప్రతినిధి తెలిపారు.
 
 రాష్ట్ర విభజనకు తోడు, తుపాన్లు, వర్షాలు కూడా ఈ సారి సిమెంట్ డిమాండ్‌ను దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం 60% కూడా వినియోగించకపోవడం పరిస్థితికి నిదర్శనం. కానీ దీనికి భిన్నంగా ఉత్తర, పశ్చిమ భారత దేశంలో సిమెంట్ ధరలు రెండు నెలల్లో బస్తాకి రూ.40-60 వరకు పెరిగాయి. సాధారణంగా హైదరాబాద్ ధర కంటే తక్కువ రేట్లు ఉండేవని, కానీ ఇప్పుడు ముంబైలో బస్తా  రూ.320 వరకు పలుకుతోందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇక్కడ కంపెనీలు 80-90% వరకు సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి 4 లక్షల టన్నులకు ఆర్డర్లు ఇవ్వడంతో డిసెంబర్ తర్వాత డిమాండ్ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
 
 రూ. 325 దాటితేనే లాభాలు
 పెరిగిన విద్యుత్ టారిఫ్‌లు, ముడిసరుకుల ధరలతో సిమెంట్ కంపెనీల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో సిమెంట్ కంపెనీల  ఆర్థిక ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాది క్యూ2 లో రూ.49 కోట్లు లాభాలు ప్రకటించిన ఇండియా సిమెంట్స్ ఈ ఏడాది రూ.22 కోట్ల నష్టాల్లోకి జారింది. రామ్‌కో సిమెంట్స్ లాభాలు 86% క్షీణించి రూ.18.3 కోట్లకు పడిపోయాయి. విద్యుత్ టారిఫ్‌లు  పెరగడం, పెరిగిన వడ్డీరేట్లు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బస్తా సిమెంట్ ధర కనీసం రూ.325 దాటితే కానీ లాభాలు వచ్చే పరిస్థితి లేదని సిమెంట్ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ధర పలకడం కష్టంగా ఉండటంతో ఈ ఏడాదీ సిమెంట్ కంపెనీలకు నష్టాలు తప్పవని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement