మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం
చెప్పినట్టు వినకపోతే భార్య, కుమార్తెను అథోగతి పాల్జేస్తామన్నారు
విజయమ్మ, షరి్మల, సునీతకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టించింది ఎంపీ అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి అని చెప్పమంటూ భయపెట్టారు
కడప అర్బన్: తాము చెప్పినట్టు వినకపోతే ఎన్‌కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి మేజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని రవీంద్రారెడ్డి తరఫు న్యాయవాదులు నాగిరెడ్డి, ఓబులరెడ్డి మీడియాకు మంగళవారం తెలిపారు. న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్రా రవీంద్రారెడ్డిని ఈ నెల 4న రాత్రి పోలీసులు కడప తాలూకా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి 41ఏ నోటీసు ఇచ్చారు. తరువాత తనతో వచి్చన న్యాయవాది హరినాథరెడ్డి, స్నేహితుడు మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీంద్రారెడ్డి హైదరాబాద్ వెళ్లారు.
కాగా.. ఈ కేసు విషయమై జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు, సీఐని సస్పెండ్ చేశారని తెలిసి అతడు స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు స్నేహితులైన వెంకటసుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిసి కారులో కడప వస్తుండగా.. ఈ నెల 8న కర్నూలు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఓ ఇంట్లోకి రవీంద్రారెడ్డిని తీసుకెళ్లి పోలీసులు విచారించారు. ఆ సమయంలో ఎన్‌కౌంటర్ చేసేందుకు వెనుకాడబోమని పోలీసులు అతడిని బెదిరించారు.
తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వకపోతే భార్యను, కుమార్తెను అథోగతి పాల్జేస్తామని రవీంద్రారెడ్డిని హెచ్చరించారు. ఎంపీ అవినాష్రెడ్డి, అతడి పీఏ రాఘవరెడ్డి ప్రోద్బలంతోనే వైఎస్ విజయమ్మ, వైఎస్ షరి్మల, వైఎస్ సునీతపై పోస్టింగ్‌లు చేశానని ఒప్పుకోవాలంటూ బలవంత పెట్టారు. తాము చెప్పినట్టు వినకపోతే ఎక్కువగా కేసులను పెట్టి జీవితాంతం జైలులో ఉండేలా చూస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించారు. థర్డ్ డిగ్రీ కారణంగా తన శరీరంపై అయిన గాయాలను మెజిస్ట్రేట్‌కు రవీంద్రారెడ్డి చూపించారు.
ఆలస్యంగా వైద్య పరీక్షలు
కాగా.. వర్రా రవీంద్రారెడ్డితో పాటు అరెస్టు చేసిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రిమ్స్‌కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అనంతరం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో కడపలోని పులివెందుల కోర్టు ఇన్‌చార్జ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.
మిగిలిన ఇద్దరు నిందితులకు 41ఏ నోటీసులు అందజేసి బెయిల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వర్రా రవీంద్రారెడ్డిని రిమాండ్ నిమిత్తం కడప కేంద్ర కారాగారంలోకి తీసుకెళ్లిన తరువాత రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కడప కేంద్ర కారాగారానికి వర్రాను తరలించారు. కాగా అధికారులు మంగళవారం సాయంత్రం వరకు అతడిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లకపోవడం గమనార్హం.
వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌లను అరెస్ట్ చేశాం
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలను అరెస్ట్ చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఈ ముగ్గురిలో రవీంద్రారెడ్డికి కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిందని తెలిపారు. మిగిలిన ఇద్దరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించిందన్నారు.
ఈ వివరాలను హైకోర్టు రికార్డ్ చేసింది. ఇదిలావుంటే.. వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారణ సందర్భంగా గాయపరిచిన విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై రాతపూర్వకంగా అఫిడవిట్ వేయాలని, దానిని పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
అలాగే రవీంద్రారెడ్డి నిర్బంధానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై అతని భార్య కళ్యాణి, సుబ్బారెడ్డి, ఉదయభాస్కర్‌రెడ్డి నిర్బంధంపై వారి సంబంధీకులు హైకోర్టులో వేర్వేరుగా హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment