ఇలాంటి తీరును సహించేదే లేదు
కేసు తీవ్రత అర్థమవుతున్నట్లు లేదు
ఆరోపణలు నిజమని తేలితే తీవ్ర పర్యవసానాలు
పోలీసులపై నిప్పులు చెరిగిన హైకోర్టు
రవీంద్రరెడ్డి నిర్బంధంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం
విచారణ 28కి వాయిదా
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పోలీసుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చూపారు? ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వాలని పోలీసు లను ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారంటూ మండిపడింది. రవీంద్రరెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే కింది కోర్టు ముందు హాజరుపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి తీరును సహించేదే లేదని తేల్చి చెప్పింది. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా అంటూ పోలీసులను నిలదీసింది. ఎస్పీ తీరు చూస్తే అలాగే అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసు తీవ్రత అర్థమవుతున్నట్లు లేదని, ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులను హెచ్చరించింది. ఆరోపణ లున్నా స్పందించడంలేదంటే ఏమనుకోవాలంటూ నిలదీసింది. రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసులు కోర్టునూ తప్పుదోవ పట్టిస్తున్నారు
తన భర్తను అక్రమంగా నిర్బంధించారని వర్రా రవీంద్రరెడ్డి భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కళ్యాణి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల అన్యాయాలు, అక్రమ నిర్బంధాలకు అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. అవాస్తవాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. నవంబర్ 8న రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారా? లేదా? అన్న విషయంపై పోలీసులు మాట్లాడటంలేదన్నారు. చట్టం కన్నా, కోర్టుల కన్నా తామే ఎక్కువ అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు.
ముఖ్యంగా కడప ఎస్పీపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశామని, ఆయన ఇప్పటివరకు కౌంటర్ వేయలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. అన్నమయ్య జిల్లా ఎస్పీ కౌంటర్ దాఖలు చేశారని, ఆయనే ఇప్పుడు కడప జిల్లాకు ఇన్‌చార్జి ఎస్పీగా ఉన్నారని తెలిపారు. రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని నిరంజన్‌రెడ్డి కోరగా.. ఆ పని తాము చేయలేమని ధర్మాసనం చెప్పింది. అలా అయితే సంబంధిత జిల్లా జడ్జికి ఆ బాధ్యతలు అప్పగించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment