ముంబై: పర్యాటక రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మెరుగైన వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 30 శాతం వృద్ధిని చూడనుండగా, వచ్చే ఏడాది దీనితో పోలిస్తే 12–14 శాతం వరకు వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా 30 శాతం వృద్ధి అన్నది కరోనా ముందు నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే 18 శాతం అధికమని తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ కంపెనీలు ప్రచారంపై ఎక్కువగా ఖర్చు చేసినప్పటికీ, వాటి నిర్వహణ మార్జిన్ ఆరోగ్యంగా 6.5 శాతానికి పైనే ఉంటుందని తెలిపింది. వ్యయాల నియంత్రణ, ఆటోమేషన్ చర్యలు ఇందుకు సహకరిస్తాయని పేర్కొంది. థామస్ కుక్, మేక్ మై ట్రిప్, యాత్రా, ఈజ్ మైట్రిప్ కంపెనీల గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. ట్రావెల్ రంగంలో 60 శాతం ఆదాయం ఈ నాలుగు కంపెనీలకే చెందుతుండడం గమనార్హం.
విదేశీ ప్రయాణాలు పెరుగుతుండడం, చిన్న ప్రాంతాలకూ డిమాండ్‌లో వృద్ధి టూర్, ట్రావెల్ ఆపరేటర్ల వృద్ధికి సాయపడుతున్నట్టు క్రిసిల్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. ప్రభుత్వం టీసీఎస్ రేటు పెంచడం వల్ల పడే ప్రభావం స్వల్పమేనని, 80 శాతం ప్రయాణాల బిల్లు వ్యక్తిగతంగా రూ.7 లక్షల్లోపే ఉంటుందని ఆమె వెల్లడించారు. ఒక వ్యక్తి విదేశీ ప్రయాణాల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు మించి వ్యయం చేస్తే వసూలు చేసే టీసీఎస్ రేటును 5 శాతం నుంచి కేంద్రం 20 శాతానికి పెంచడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment