Massive expansion
-
ప్రపంచ వ్యాప్తంగా జోస్ అలుక్కాస్ భారీ విస్తరణ
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ రిటైల్ చైన్ జోస్ అలుక్కాస్ రూ.5,500 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీ విస్తరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని ఒక జ్యువెల్లరీ రిటైల్ బ్రాండ్ రానున్న 8 సంవత్సరాల్లో చేపడుతున్న భారీ విస్తరణ కార్యక్రమం ఇదని వివరించింది. నిధులు, రియల్టీ సమకూరితే 4 సంవత్సరాల్లోనే తమ విస్తరణ కార్యక్రమం పూర్తవుతుందని వివరించింది. సంస్థ విస్తరణ ప్రణాళికకు సంబంధించి చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు జాన్ అలుక్కా, వర్గీస్ అలుక్కా, చైర్మన్ జోస్ అలుక్కా, నటుడు ఆర్ మాధవన్, కంపెనీ ఎండీ పాల్ అలుక్కా పాల్గొన్నారు. (చిత్రంలో ఎడమ నుంచి). ప్రస్తుతం 50 స్టోర్లను కలిగిన జ్యువెల్లరీ గ్రూప్ గ్లోబల్ అంబాసిడర్‌గా నటుడు మాధవన్ ఉన్నారు. నటి కీర్తి సురేశ్‌ను కూడా సంస్థ ప్రచారకర్తగా నియమించుకుంది. -
పీవీఆర్ ఐనాక్స్ భారీ విస్తరణ
లక్నో: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో భారీ విస్తరణపై కన్నేసింది. టికెట్ ధరలు, ఆహారం, పానీయాలు, ప్రకటనలు, నిర్వహణ వ్యయాలు తదితర అంశాలలో రెండు కంపెనీల మధ్య ఏకీకరణను చేపట్టినట్లు కంపెనీ ఎండీ అజయ్ బిజిలీ తెలియజేశారు. 2023 ఫిబ్రవరి 6 నుంచి పీవీఆర్, ఐనాక్స్ విలీనం అమల్లోకి వచ్చింది. విలీనం తదుపరి వ్యయాలను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు అజయ్ తెలియజేశారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో రెండంకెల వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తాజాగా అంచనా వేశారు. విలీన కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ ఇకపై ప్రతీ ఏడాది 200 స్క్రీన్ల చొప్పున జత చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. చిన్న మార్కెట్లలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్లు అజయ్ వెల్లడించారు. పీవీఆర్ ఐనాక్స్కు ఎండీగా అజయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఇండియా పోస్ట్ భారీ విస్తరణ
న్యూఢిల్లీ: ఇంటి వద్దకే సేవలను అందించడం లక్ష్యంగా ఇండియా పోస్ట్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 10,000 శాఖలను తెరవనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు అనుమతి లభించిందని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ సెక్రటరీ అమన్ శర్మ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నూతన శాఖలను తెరువనున్నట్టు చెప్పారు. వీటి చేరికతో మొత్తం శాఖల సంఖ్య సుమారు 1.7 లక్షలకు చేరుతుందని వెల్లడించారు. ‘పోస్టల్ శాఖను విస్తరించాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. అయిదు కిలోమీటర్ల పరిధిలోనే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు చేరువలో ఉండాలన్నది భావన. పోస్టాఫీసుల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.5,200 కోట్లు సమకూర్చింది. డ్రోన్ల ద్వారా డెలివరీలను ఇటీవల గుజరాత్లో విజయవంతంగా నిర్వహించాం. 2012లో ప్రారంభించిన ఐటీ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. సాంకేతికత ఆధారంగా పోస్టల్, ఇతర ప్రభుత్వ సేవలు త్వరలో ఇంటి వద్దకే అందనున్నాయి. ప్రజలు పోస్టాఫీసులకు రావాల్సిన అవసరం ఉండదు. మహమ్మారి కాలంలో ఆధార్ సహిత చెల్లింపుల వ్యవస్థ ఆధారంగా రూ.20,000 కోట్ల పైచిలుకు నగదును ప్రజల ఇంటి వద్దకే చేర్చాం’ అని వివరించారు. -
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ భారీ విస్తరణ
బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ (హోల్‌సేల్ వర్తకుల కొనుగోళ్ల వేదిక/బీటుబీ) భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంతోపాటు, లక్షలాది మంది చిన్న వ్యాపారస్థులు, కిరాణా స్టోర్ల యజమానుల శ్రేయస్సే లక్ష్యంగా ఈ ఏడాది చివరికి 2,700 పట్టణాలకు విస్తరించే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ వ్యాపారం 2020 సెప్టెంబర్‌లో మొదలు కాగా.. 2021 మొదటి ఆరు నెలల్లో వ్యాపార పరంగా మంచి వృద్ధిని చూసింది. కిరాణా స్టోర్లు, రిటైలర్లు ఈ కామర్స్ కొనుగోళ్ల వైపు అడుగులు వేయడం ఈ వృద్ధికి మద్దతునిచ్చింది. ఇక ఈ ఏడాది ద్వితీయ భాగంలో (జూలై–డిసెంబర్) 180% వరకు హోల్‌సేల్ వ్యాపారం వృద్ధి చెందుతుందని ఫ్లిప్‌కార్ట్ అంచనా వేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బీటుబీ వేదికపై సరఫరాదారుల సంఖ్య కూడా వృద్ధి చెందుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది సరఫరాదారులు 58% పెరగొచ్చని అంచనా వేసింది. ఇది స్థానిక వ్యాపార సంస్థల వృద్ధికి, జీవనోపాధికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. వాల్‌మార్ట్‌కు చెందిన ‘బెస్ట్‌ప్రైస్’ను 2020లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయడం తెలిసిందే. దీన్నే ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌గా పేరు మార్చుకుని విస్తరణపై దృష్టి సారించింది. కరోనా మహమ్మారి ఎన్నో సవాళ్లను తీసుకొచ్చినప్పటికీ కిరాణా సంస్థల నుంచి మంచి మంచి మద్దతును చూస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ పేర్కొన్నారు. డిజిటైజేషన్ ప్రయోజనాలను వారు చవి చూస్తున్నారని.. ఈ కామర్స్‌పై కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. టెక్నాలజీ సాయంతో స్థానిక సరఫరాదారుల వ్యవస్థ బలోపేతానికి, జీవనోపాధి పెంపునకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. -
రామ్‌కో సిమెంట్ భారీ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ రామ్‌కో సిమెంట్స్ భారీ విస్తరణ చేపట్టింది. ఇందుకోసం రూ.4,000 కోట్లు వ్యయం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 3.15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంటు ఉత్పత్తి కేంద్రాన్ని రూ.1,500 కోట్లతో నెలకొల్పుతోంది. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని రామ్‌కో మార్కెటింగ్ ఈడీ బాలాజీ కె మూర్తి గురువారం వెల్లడించారు. సూపర్‌క్రీట్ సిమెంట్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మార్కెటింగ్ ప్రెసిడెంట్ ఆర్.రామకృష్ణన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో 1.5 మిలియన్ టన్నుల క్లింకర్ యూనిట్, విశాఖపట్నం జిల్లాలో 1 మిలియన్ టన్నుల గ్రైండింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒడిశాలోని సిమెంటు తయారీ ప్లాంటులో 1.5 మిలియన్ టన్నులు, కోల్‌కతాలో 1 మిలియన్ టన్నుల సామర్థ్యం జోడిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా.. కంపెనీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు 2020 డిసెంబరుకల్లా పూర్తి కానున్నాయి. కర్నూలు ప్లాంటు రాకతో ఆంధ్రప్రదేశ్‌లో రామ్‌కో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్ టన్నులు నమోదు కానుంది. తద్వారా ఏపీలో అత్యధిక ఉత్పత్తి సామర్థ్యమున్న సంస్థగా నిలుస్తుంది. అన్ని తయారీ కేంద్రాలు కలిపి ప్రస్తుతం సంస్థ వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 12.5 మిలియన్ టన్నులు ఉంది. విస్తరణ పూర్తి అయితే ఇది 20 మిలియన్ టన్నులకు చేరుతుందని బాలాజీ వెల్లడించారు. 2018–19లో కంపెనీ టర్నోవరు రూ.5,146 కోట్లు. 2020–21లో ఇది రూ.7,500 కోట్లను తాకుతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర ప్రభుత్వం ఉంటే.. ‘ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. మీరేమో విస్తరణ చేపడుతున్నారు. ఫలితం ఎలా ఉండబోతోంది’ అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. ‘ఏ రాష్ట్రంలోనైనా ఒడిదుడుకులు తాత్కాలికం. మళ్లీ మార్కెట్ పుంజుకుంటుందన్న నమ్మకం మాకుంది. సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పుడు సిమెంటుకు డిమాండ్ ఉంటుంది. మా పెట్టుబడులు కొనసాగిస్తాం’ అని బాలాజీ స్పష్టం చేశారు. మందగమన ప్రభావం సిమెంటు రంగంపై ఉందా అన్న మరో ప్రశ్నకు వ్యక్తిగత గృహాల నిర్మాణాలు అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులు సాగుతున్నాయని చెప్పారు. సిమెంటు వినియోగం దేశంలో ఏప్రిల్–జూన్ కాలంలో 7–8 శాతం వృద్ధి నమోదైందన్నారు. -
ఉడాన్‌లోకి 325 మార్గాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగం భారీ విస్తరణకు ప్రభుత్వం మరో సానుకూల చర్య తీసుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలను మరింత పెంచేలా కొత్తగా 325 మార్గాలను ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కిందకు తీసుకొచ్చింది. ఉడాన్ రెండో విడతలో భాగంగా కొత్తగా 56 విమానాశ్రయాలు/హెలిప్యాడ్లను ప్రభు త్వం ఈ పథకం కిందకు చేర్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ అనుసంధాన పథకమైన ఉడాన్ కింద రెండో రౌండ్ బిడ్డింగ్ ముగిసిన అనంతరం విమానయాన సంస్థలకు కేటాయించిన మార్గాలను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం వెల్లడించారు. మొత్తం 15 సంస్థలకు ఈ మార్గాలను కేటాయించారు. కొత్త మార్గాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, తిరుపతి నగరాలకు కూడా వివిధ ప్రాంతాల నుంచి విమానాలు రానున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని యుద్ధభూమి కార్గిల్కూ ఉడాన్ రెండో విడతలో చోటు దక్కింది. అత్యధికంగా ఇండిగో సమర్పించిన 20 ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. స్పైస్‌జెట్ ప్రతిపాదనల్లో 17 ఆమోదం పొందాయి. రోడ్డు, రైలు మార్గాలు సరిగా లేని ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత నగరాలకు ప్రాధాన్యతనిస్తూ ఉడాన్ పథకం రెండో విడతలో వాటికే ఎక్కువ మార్గాలను కేటాయించారు. విమానయాన సంస్థలు 50 శాతం సీట్లను కచ్చితంగా ఉడాన్ పథకానికి కేటాయించాలి. ఆ సీట్లకు గంట ప్రయాణానికి రూ.2,500 కన్నా ఎక్కువ చార్జీలను వసూలు చేయకూడదు. అదే హెలికాప్టర్లు అయితే 13 సీట్లను కేటాయించి, అర్ధగంట ప్రయాణానికి గరిష్టంగా రూ.2,500 మాత్రమే వసూలు చేయాలి. రాయితీ కింద ప్రభుత్వం సంస్థలకు కొంత మొత్తం చెల్లిస్తుంది. మొత్తంగా రూ.620 కోట్లను ఇందుకోసం ప్రభుత్వం కేటాయించింది. రెండో విడత మార్గాలు ఆరు నెలల్లోపే అందుబాటులోకి వస్తాయని అశోక్ గజపతి రాజు చెప్పారు. గతేడాది మార్చిలో ఉడాన్ పథకం తొలిరౌండ్ బిడ్డింగ్ జరగ్గా మొత్తం 128 మార్గాలను అప్పట్లో ఈ పథకం కింద వివిధ విమానయాన సంస్థలకు కేటాయించడం విదితమే. తెలుగు రాష్ట్రాల నుంచి నూతన మార్గాలు మార్గం విమానయాన సంస్థ హైదరాబాద్–హుబ్లీ టర్బో ఏవియేషన్, అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్ హైదరాబాద్–కొల్హాపూర్ ఇండిగో, అలయన్స్ ఎయిర్ హైదరాబాద్–నాసిక్ అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్ హైదరాబాద్–షోలాపూర్ అలయన్స్ ఎయిర్ హైదరాబాద్–కొప్పళ్ టర్బో ఏవియేషన్ తిరుపతి–కొల్హాపూర్ ఇండిగో తిరుపతి–హుబ్లీ ఘొడావత్ (హెలికాప్టర్లు) వివిధ కొత్త మార్గాల్లో ముఖ్యమైనవి దర్భంగా–బెంగళూరు; దర్భంగా–ఢిల్లీ; దర్భంగా–ముంబై; కార్గిల్–శ్రీనగర్ హుబ్లీ – అహ్మదాబాద్, చెన్నై, కొచ్చిన్, గోవా, హిండన్, కన్నూర్ కన్నూర్ – బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, గోవా, హిండన్, ముంబై, తిరువనంతపురం బికనీర్ – జైపూర్ జైసల్మేర్ – అహ్మదాబాద్, సూరత్, ఉదయ్‌పూర్ పాక్యాంగ్(సిక్కిం) – ఢిల్లీ, గువాహటి, కోల్‌కతా వెల్లూరు – బెంగళూరు, చెన్నై హెలికాప్టర్ ద్వారా.. ముఖ్యమార్గాలు కులు–మనాలి సిమ్లా–మండి మండి–ధర్మశాల మండి–సిమ్లా హరిద్వార్–హల్ద్వని జోషిమఠ్–గౌచర్ మసోరి–డెహ్రాడూన్ -
భారీ విస్తరణపై యస్ బ్యాంక్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటురంగ యస్ బ్యాంక్ భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ (కార్పొరేట్ బ్యాంకింగ్) అమిత్ కుమార్ తెలిపారు. దేశావ్యాప్తంగా 2018 నాటికి శాఖల రెట్టింపు చేయడం ద్వారా 1,800కు తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యస్ బ్యాంక్ 660 శాఖలను కలిగి ఉంది. శుక్రవారం యస్‌బ్యాంక్ నేషనల్ సీఎఫ్‌వో ఫోరమ్ హైదరాబాద్ చాప్టర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు కలిసిన విలేకరుల సమావేశంలో అమిత్ మాట్లాడుతూ శాఖలన్నీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తుండటంతో సిబ్బంది నియామకాలు భారీ స్థాయిలో ఉండవన్నారు. అంతకుముందు ఈ ఫోరంని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. 600 మందికి పైగా పాల్గొన ఈ ఫోరంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తికి లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును ప్రధానం చేశారు. -
రామగుండం ఎన్టీపీసీ ‘మెగా’ విస్తరణ
-
రామగుండం ఎన్టీపీసీ ‘మెగా’ విస్తరణ
⇒ 4,000 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు లైన్ క్లియర్ ⇒ దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ కేంద్రంగా అభివృద్ధి ⇒ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీపీసీల మధ్య కుదిరిన అవగాహన ⇒ సీఎం కేసీఆర్‌తో సంస్థ సీఎండీ భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం భారీ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రంగా నిలవబోతోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా రామగుండంలోని ప్రస్తుత ఎన్టీపీసీ కేంద్రం ఆవరణలోనే నిర్మించాలని సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహనకు వచ్చాయి. ఎన్టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అరుప్‌రాయ్ చౌదరి, దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.వెంకటేశ్వరన్ సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ‘రామగుండం ఎన్టీపీసీ’ విస్తరణకు సంబందించిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఆయన ముందుంచారు. సీఎం సైతం సానుకూలంగా స్పందించారు. పంతం నెగ్గించుకున్న ఎన్టీపీసీ ఎన్టీపీసీకి రామగుండంలో 9,500 ఎకరాల స్థలం ఉంది. ఇప్పటికే అక్కడ 2,600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలను సంస్థ నిర్వహిస్తోంది. విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా తొలి విడతగా 1,600(2ఁ800) మెగావాట్ల అదనపు సామర్థ్యంతో రామగుండం ప్లాంట్ విస్తరణ పనులను ఇప్పటికే ఎన్టీపీసీ చేపట్టింది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్లకు స్థల కేటాయింపుల విషయంలో ఎన్టీపీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకురాగా, ఎన్టీపీసీ మాత్రం రామగుండంపైనే పూర్తి ఆసక్తిని ప్రదర్శిస్తూ వచ్చింది. మొత్తం 4,000 మెగావాట్ల ప్లాంట్లను రామగుండంలోనే నిర్మించాలనే ప్రతిపాదనను సంస్థ సీఎండీ అరుప్‌రాయ్ తాజాగా సీఎం కేసీఆర్ ముం దుంచారు. నాలుగేళ్లలో ఈ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు నీటితోపాటు కేంద్రం నుంచి బొగ్గు కేటాయింపుల అంశాన్ని స్వయంగా పరిశీలిస్తానని సీఎం కూడా హామీ ఇచ్చారు. దీంతో నాలుగేళ్లలో రామగుండం ఎన్టీపీసీ సామర్థ్యం 6,600 మెగావాట్లకు చేరనుంది. కాగా, రామగుండం మండల పరిధిలో బీపీఎల్ సంస్థకు గతంలో కేటాయించిన నిరుపయోగ భూములను తమకు కేటాయించాలని కేసీఆర్‌ను ఎన్టీపీసీ సీఎండీ కోరారు. అయితే ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉన్న ఈ భూములపై ఎలాంటి హామీ ఇవ్వలేమని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్టీపీసీ విస్తరణలో భాగంగా యాష్ పాండ్(బూడిద నిల్వ స్థలం) ఏర్పాటు కోసం 400 ఎకరాలు కావాలని ఎన్టీపీసీ కోరగా, ఇప్పడున్న యాష్ పాండ్తోనే ప్రస్తుతానికి పని కానివ్వాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. దామరచర్లలో సోలార్ ప్లాంట్లు నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్కో, ఎన్టీపీసీల ఆధ్వర్యంలో 6,400 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. జెన్కో ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ వైదొలగడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. జెన్కో నిర్మించే థర్మల్ కేంద్రాలతోపాటు అక్కడ ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.