
లక్నో: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో భారీ విస్తరణపై కన్నేసింది. టికెట్ ధరలు, ఆహారం, పానీయాలు, ప్రకటనలు, నిర్వహణ వ్యయాలు తదితర అంశాలలో రెండు కంపెనీల మధ్య ఏకీకరణను చేపట్టినట్లు కంపెనీ ఎండీ అజయ్ బిజిలీ తెలియజేశారు. 2023 ఫిబ్రవరి 6 నుంచి పీవీఆర్, ఐనాక్స్ విలీనం అమల్లోకి వచ్చింది.
విలీనం తదుపరి వ్యయాలను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు అజయ్ తెలియజేశారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో రెండంకెల వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తాజాగా అంచనా వేశారు. విలీన కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ ఇకపై ప్రతీ ఏడాది 200 స్క్రీన్ల చొప్పున జత చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. చిన్న మార్కెట్లలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్లు అజయ్ వెల్లడించారు. పీవీఆర్ ఐనాక్స్‌కు ఎండీగా అజయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.