Inox Leisure
-
పీవీఆర్ ఐనాక్స్ భారీ విస్తరణ
లక్నో: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో భారీ విస్తరణపై కన్నేసింది. టికెట్ ధరలు, ఆహారం, పానీయాలు, ప్రకటనలు, నిర్వహణ వ్యయాలు తదితర అంశాలలో రెండు కంపెనీల మధ్య ఏకీకరణను చేపట్టినట్లు కంపెనీ ఎండీ అజయ్ బిజిలీ తెలియజేశారు. 2023 ఫిబ్రవరి 6 నుంచి పీవీఆర్, ఐనాక్స్ విలీనం అమల్లోకి వచ్చింది. విలీనం తదుపరి వ్యయాలను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు అజయ్ తెలియజేశారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో రెండంకెల వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తాజాగా అంచనా వేశారు. విలీన కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ ఇకపై ప్రతీ ఏడాది 200 స్క్రీన్ల చొప్పున జత చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. చిన్న మార్కెట్లలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్లు అజయ్ వెల్లడించారు. పీవీఆర్ ఐనాక్స్కు ఎండీగా అజయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: దేశంలోని టాప్–2 మల్టీప్లెక్స్ దిగ్గజాల విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంయుక్త సంస్థగా ఆవిర్భవించేందుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రతిపాదిత విలీనానికి ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఈ నెల 12న అనుమతించినట్లు పీవీఆర్ వెల్లడించింది. 2022 అక్టోబర్‌లో ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్తో విలీనానికి పీవీఆర్ వాటాదారులు ఆమోదముద్ర వేశారు. అంతకుముందు జూన్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఇందుకు ఓకే చెప్పాయి. తొలుత గతేడాది మార్చిలో రెండు కంపెనీలూ విలీనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్సీఎల్టీ అనుమతి నేపథ్యంలో పీవీఆర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 1,745 వద్ద, ఐనాక్స్ లీజర్ 0.7 శాతం నష్టంతో రూ. 515 వద్ద ముగిశాయి. -
ఐనాక్స్ లీజర్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మల్టీప్లెక్స్ చైన్ నిర్వాహక కంపెనీ ఐనాక్స్ లీజర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం సగానికిపైగా తగ్గి రూ. 40.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 88 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 47.44 కోట్ల నుంచి రూ. 374 కోట్లకు దూసుకెళ్లింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా గత క్యూ2లో స్వల్ప టర్నోవర్ నమోదైంది. అయితే ప్రస్తుత క్యూ2లో మొత్తం వ్యయాలు సైతం రెండు రెట్లు ఎగసి రూ. 434 కోట్లను దాటాయి. ఈ కాలంలో 11.6 మిలియన్లమంది సినిమాలను వీక్షించగా.. సగటు టికెట్ ధర రూ. 215కు చేరింది. ఒక్కో వ్యక్తి సగటు వ్యయం రికార్డు నెలకొల్పుతూ రూ. 102ను తాకింది. కొత్తగా 13 తెరలను ఏర్పాటు చేసింది. దీంతో కంపెనీ 165 మల్టీప్లెక్స్‌ల ద్వారా 74 పట్టణాలలో 705 స్క్రీన్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఐనాక్స్ లీజర్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 514 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
విలీనానికి పీవీఆర్ వాటాదారుల ఆమోదం
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ సేవల్లోని ఐనాక్స్ లీజర్తో విలీనానికి తమ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పీవీఆర్ ప్రకటించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పీవీఆర్ మంగళవారం తన వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి ఆమోదాన్ని కోరింది. 99 శాతం విలీనానికి అనుకూలంగా ఓటు వేసినట్టు పీవీఆర్ బుధవారం ప్రకటించింది. విలీనానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అనుమతులను పీవీఆర్–ఐనాక్స్ లీజర్ జూన్‌లోనే పొందాయి. ఈ ఏడాది మార్చి 27న ఈ సంస్థలు తమ విలీన ఒప్పందాన్ని ప్రకటించాయి. తద్వారా 1,500 స్క్రీన్లతో దేశంలోనే అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించనున్నట్టు తెలిపాయి. -
పీవీఆర్ కొత్త స్క్రీన్ల ఏర్పాటు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 100 స్క్రీన్లు(తెరలు) ఏర్పాటు చేయనున్నట్లు మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. మల్టీప్లెక్స్ రంగంలోని మరో కంపెనీ ఐనాక్స్ లీజర్తో విలీనం 2023 ఫిబ్రవరికల్లా పూర్తికావచ్చని అంచనా వేస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్‌గా సంయుక్త బిజినెస్‌ను నిర్వహించనున్నట్లు పీవీఆర్ సీఈవో గౌతమ్ దత్తా పేర్కొన్నారు. వీక్షకులు తిరిగి సినిమా థియేటర్లకు వచ్చేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆహారం, పానీయాల విభాగం అమ్మకాలు సైతం పుంజుకున్నట్లు ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలపై స్పందిస్తూ వివరించారు. వెరసి తెరల విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది బాటలోనే వచ్చే రెండు, మూడేళ్లలో కూడా విస్తరణను కొనసాగించే వీలున్నట్లు తెలియజేశారు. 60 శాతం తెరలను నగరాలలో ఏర్పాటు చేయనుండగా.. మిగిలిన వాటిని కొత్త ప్రాంతాలలో నెలకొల్పనున్నట్లు వివరించారు. రూర్కెలా, డెహ్రాడూన్, వాపి, చెన్నై, కోయంబత్తూర్, తిరువనంతపురం, అహ్మదాబాద్‌లో విస్తరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిధులను నగదు నిల్వలు, అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ మధ్య విలీనానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. రెండు ఎక్సే్ఛంజీలూ ఇందుకు నో అబ్జక్షన్ ప్రకటించినట్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ఇతర నియంత్రణ సంస్థల నుంచి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీనానికి తొలుత స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు అనుమతించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది మార్చి 27న రెండు సంస్థలూ విలీన అంశాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. విలీన కంపెనీ 1,500కుపైగా తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా ఆవిర్భవించనుంది. సంయుక్త సంస్థను పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,788 వద్ద నిలవగా.. ఐనాక్స్ లీజర్ 5.3 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది. -
ఆర్ఆర్ఆర్ ఎంట్రీ..పీవీఆర్‌తో కొత్త దోస్తీ..ఊహించని లాభాలు సొంతం...!
కోవిడ్-19 రాకతో గత రెండేళ్లుగా మల్టీప్లెక్స్ థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. దిగ్గజ మల్టీప్లెక్స్ సంస్థలు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. దీంతో నష్టాలనుంచి బయటపడేందుకుగాను పీవీఆర్, ఐనాక్స్ లీజర్ మల్టీప్లెక్స్ సంస్థలు విలీనానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ పీవీఆర్, ఐనాక్స్ లీజర్ కంపెనీలకు భారీగా కలిసొచ్చింది. కలిసొచ్చిన విలీనం..! పీవీఆర్, ఐనాక్స్ లీజర్ కంపెనీలు వీలినమవుతున్నట్లు ఆదివారం రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొన్నాయి. దీంతో సోమవారం రోజున ఇరు కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ షేర్లు దూసుకుపోయాయి. ఐనాక్స్ షేర్లు 20 శాతం పెరిగి రూ.563 కి చేరుకోగా..ప్రీ కోవిడ్ గరిష్టాలను అధిగమించడం గమనార్హం. ఇక పీవీఆర్ షేర్లు 10 శాతం లాభపడి రూ. 2010. 34 మేర పెరిగాయి. వీలిన ప్రక్రియలో భాగంగా ఐనాక్స్ షేర్ హోల్డర్స్ పది ఐనాక్స్ షేర్లకు పీవీఆర్ మూడు షేర్లు దక్కనున్నాయి. ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మల్టీప్లెక్స్ థియేటర్లకు బాగా కలిసొచ్చింది. పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ షేర్లు రెండేళ్ల గరిష్టాలకు చేరాయి. ఆర్ఆర్ఆర్ మూవీ మల్టీప్లెక్స్ సంస్థలకు ఫుల్ జోష్‌ను నింపింది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో విదేశీ కంపెనీ..! -
ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..!
భారత్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్ బ్రాండ్స్ పీవీఆర్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ సంస్థలు పూర్తిగా వీలినమయ్యాయి. కంపెనీల వీలినాన్ని డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పీవీఆర్ లిమిటెడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐనాక్స్ బోర్డు కూడా విలీనాన్ని ఆమోదించింది. మల్టీప్లెక్స్ సంస్థల్లో ఇరు కంపెనీల వీలినం అతి పెద్ద డీల్‌గా నిలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఎగ్జిబిషన్ కంపెనీగా పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ అవతరించనుంది. విలీనానంతర సంస్థకు పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లీ ఎండీగా కొనసాగనున్నారు. ఇదే సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఐనాక్స్ గ్రూప్ ఛైర్మన్ పవన్ కుమార్ జైన్ బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, సిద్థార్థ్ జైన్ నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఎక్సేంజీలకు ఇరు సంస్థలు వెల్లడించాయి. వీలినంలో భాగంగా ఐనాక్స్ షేర్ హోల్డర్లందరికీ పీవీఆర్ షేర్లు లభించనున్నాయి. కాగా ఈ వీలినానికి ఎక్సేచేంజ్లు, సెబీ, సీసీఐ నుంచి అనుమతి రావాల్సి ఉంది. కొత్తగా ఏర్పడే సంస్థలో పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం వాటా, ఐనాక్స్ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభించనుంది. దేశవ్యాప్తంగా పీవీఆర్‌కు 73 పట్టణాల్లోని 181 ప్రాంతాల్లో 871 స్క్రీన్స్ ఉన్నాయి. ఐనాక్స్కు 72 పట్టణాల్లోని 160 ప్రాంతాల్లో 675 తెరలున్నాయి. ఓటీటీ కారణం.. కోవిడ్-19 రాకతో థియేటర్లు భారీ నష్టాలను చవిచూశాయి. థియేటర్లు పూర్తిగా మూసివేయడంతో సినీ నిర్మాతలు అమెజాన్ ప్రైం, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హట్‌స్టార్ వంటి ఓటీటీ సంస్థల తలుపులను తట్టారు. అదే స్థాయిలో ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు భారీ మొత్తంలోనే డబ్బులను చెల్లించాయి. దీంతో థియేటర్ల మనుగడకు భారంగా మారింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. నష్టాలను పూడ్చుకోవడానికి థియేటర్ల యాజమాన్యం ఫంక్షన్ హాల్స్గా మార్చేశారు. ఓటీటీ సంస్థల నుంచి వీపరితమైన పోటీ రావడంతో ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్లు పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి దారి తీసినట్లు తెలుస్తోంది. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్..! -
క్రికెట్ ప్రియులకు ఇక పండగే.. మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్ లైవ్ మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో క్రికెట్ లైవ్ మ్యాచ్ చూస్తే ఎలా ఉంటుదో ఒకసారి ఊహించుకోండి! బొమ్మ అదుర్స్ కదూ. అలా వింటుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అనిపిస్తుందా?. అయితే, కొంచెం ఓపిక పట్టండి మీ కల కొద్ది రోజుల్లో నిజం కాబోతుంది. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు మల్టీప్లెక్స్ చైన్ ఇనాక్స్ లీజర్ లిమిటెడ్ తెలిపింది. యూఏఈ, ఒమన్లలో బీసీసీఐ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 7వ ఎడిషన్ అక్టోబర్ 17న ప్రారంభం కాబోతోంది. ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో ఈ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది. మార్క్యూ లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శించనున్నట్లు ఇనాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రధాన నగరాల్లోని ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. పెద్ద థియేటర్ స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. క్రికెట్ మైదానంలోనే మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలగజేయాలన్నదే దీని వెనక ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. (చదవండి: AICF: చెస్‌కు ‘ఎంపీఎల్’ అండ.. కోటితో మొదలుపెట్టి..) క్రికెట్ మ్యాచ్‌ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపింది. ఐనాక్స్కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌లు, 658 థియేటర్లు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే టికెట్ విక్రయించనునట్లు సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఇటీవల లక్నోలోని పలాసియో మాల్లో, ముంబైలోని మలాడ్ లోని ఇనార్బిట్ మాల్లో భారీ మెగాప్లెక్స్ ప్రారంభించింది. పీవీఆర్ సినిమాస్ ఇండియాలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ కూడా ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్‌ల్లో సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. దేశంలోని 35కి పైగా నగరాల్లో 75కు పైగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ మ్యాచ్‌లు ప్రసారం చేయనున్నారు. ఇందులో న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్ వంటి టైర్-1, టైర్-2 నగరాలు ఉన్నాయి.(చదవండి: బైక్ కొనేవారికి రివోల్ట్ మోటార్స్ శుభవార్త!) -
మల్టీప్లెక్స్ షేర్ల లాభాల షో
నేటి నుంచి మహారాష్ట్రలో అన్ని సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రారంభంకానున్న నేపథ్యంలో లిస్టెడ్ మల్టీప్టెక్స్ కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల గల అన్ని సినిమా హాళ్లు, థియేటర్లను ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నేటి(5) నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే థియేటర్ల సీట్ల సామర్థ్యంలో 50 శాతం వరకూ మాత్రమే అనుమతించింది. అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లను తెరిచేందుకు మార్గదర్శకాలను జారీ చేసిన విషయం విదితమే. సమాచార, ప్రసార శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా థియేటర్లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డవున్ తదుపరి మార్చి నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు తదితరాలు మూత పడిన సంగతి తెలిసిందే. షేర్ల జోరు సినిమా హాళ్ల పున:ప్రారంభం నేపథ్యంలో మల్టీప్లెక్స్ రంగ లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీవీఆర్ షేరు దాదాపు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 1,212 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఐనాక్స్ లీజర్ సైతం 4.5 శాతం జంప్ చేసి రూ. 276 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 280 వరకూ ఎగసింది. -
పీవీఆర్, ఐనాక్స్ లీజర్.. లాభాల షో
కంటెయిన్మెంట్ జోన్లలో మినహాయించి ఈ నెల 15 నుంచీ సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా అనుమతించింది. దీంతో దేశవ్యాప్తంగా సినిమాల ప్రదర్శనకు వీలు కలగనుండటంతో మల్టీప్లెక్స్ నిర్వాహక కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హుషారుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీవీఆర్ 9 శాతం జంప్‌చేసి రూ. 1,319 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతం దూసుకెళ్లింది. గరిష్టంగా రూ. 1,395ను తాకింది. ఇక ఐనాక్స్ లీజర్ సైతం ఇంట్రాడేలో 17 శాతం దూసుకెళ్లింది. రూ. 318కు చేరింది. ప్రస్తుతం 7.2 శాతం లాభపడి రూ. 290 వద్ద ట్రేడవుతోంది. సినిమా థియేటర్ల ప్రారంభానికి కేంద్రం అనుమతించినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. మహారాష్ట్ర, తమిళనాడులలో సినిమా హాళ్లు అక్టోబర్ నెలలోనూ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించకపోవడం గమనార్హం! -
మళ్లీ మల్టీప్లెక్స్‌ల జోరు- పీవీఆర్, ఐనాక్స్ హవా
కరోనా వైరస్ కట్టడికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్డవున్లు ప్రకటించాక డీలాపడిన మల్టీప్లెక్స్ కౌంటర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ జోరందుకున్నాయి. నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. అన్‌లాక్-3లో భాగంగా కొన్ని సినిమా థియేటర్లను ఆగస్ట్ 1 నుంచి తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించనుందన్న వార్తలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జోరుగా.. దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌ల చైన్ కలిగిన పీవీఆర్ లిమిటెడ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,147 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6.3 శాతం ఎగసి రూ. 1,172ను తాకింది. ఇక ఐనాక్స్ లీజర్ మరింత అధికంగా 8 శాతం దూసుకెళ్లి రూ. 259 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం పురోగమించి రూ. 268కు చేరింది. అన్‌లాక్-3లో దేశవ్యాప్తంగా పలు సినిమా థియేటర్లను తిరిగి ఆగస్ట్ 1 నుంచి ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించనుందన్న వార్తలతో ఐనాక్స్ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. మధ్యాహ్నానికల్లా బీఎస్ఈలో 2.6 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 35,000 షేర్లు మాత్రమేకావడం గమనార్హం! -
అఫ్లే ఇండియా అప్- ఐనాక్స్ లీజర్ డౌన్
ముందురోజు అమెరికా స్టాక్ ఇండెక్స్ నాస్డాక్ సరికొత్త గరిష్టాన్ని అందుకోవడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 373 పాయింట్లు జంప్‌చేసి 34,744కు చేరగా.. నిఫ్టీ 112 పాయింట్లు ఎగసి 10,279 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ అఫ్లే ఇండియా కౌంటర్ జోరందుకోగా.. ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఐనాక్స్ లీజర్ అమ్మకాలతో డీలాపడింది. వెరసి అఫ్లే ఇండియా షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. ఐనాక్స్ లీజర్ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం.. అఫ్లే ఇండియా సొంత అనుబంధ సంస్థ ద్వారా సింగపూర్‌లో యాప్నెక్ట్స్ పీటీఈను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అఫ్లే ఇండియా కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అఫ్లే ఇండియా షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 1539 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1555ను అధిగమించింది. యాప్నెక్ట్స్ పీటీఈలో 66.67 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు అఫ్లే సింగపూర్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అఫ్లే ఇండియా పేర్కొంది. మూడేళ్లలోగా యాప్నెక్ట్స్లో మిగిలిన 28.33 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సైతం ఒప్పందం కుదిరినట్లు తెలియజేసింది. ఐనాక్స్ లీజర్ మల్టీప్లెక్స్ కంపెనీ ఐనాక్స్ లీజర్ గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐనాక్స్ లీజర్ రూ. 82 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 48 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 22 శాతం క్షీణించి రూ. 372 కోట్లకు పరిమితమైంది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐనాక్స్ లీజర్ షేరు 6 శాతం పతనమై రూ. 266 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 262 వరకూ జారింది. కాగా.. లాక్‌డవున్ ఎత్తివేత అంచనాలతో గత ఐదు రోజుల్లో ఈ షేరు 21 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
ఎయిర్‌లైన్స్, మల్టీప్లెక్స్ షేర్ల జోరు
గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లో ఎయిర్‌లైన్స్, మల్టీప్లెక్స్ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. లాక్డౌన్లో కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు ఇస్తుండడంతో సాధారణ పరిస్థితులు నెలకొని, త్వరలో ప్రయాణాలు పుంజుకుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తుండడంతో నేడు ఎయిర్‌లైన్స్ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్(ఇండిగో) షేరు 9.2 శాతం లాభపడి రూ.1,117.90 వద్ద ముగిసింది. ఉదయం రూ.1,025 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో రూ.1,125 వద్ద గరిష్టాన్ని తాకింది. మరో ఎయిర్‌లైన్ సంస్థ స్పైస్‌జెట్ 5 శాతం లాభంతో రూ.46.85 వద్ద ముగిసింది. జూన్ తర్వాత సినిమా హళ్లు తెరుచుకునే అవకాశం ఉండడంతో నేడు ఎన్ఎస్ఈలో మల్టీ ప్లెక్స్ షేర్లు సైతం ర్యాలీ చేశాయి. వీటిలో ముఖ్యంగా పీవీఆర్ షేరు 7 శాతం లాభపడి రూ.1,074 వద్ద ముగిసింది. ఉదయం సెషన్లో రూ.990 వద్ద ప్రారంభమైన పీవీఆర్ షేరు ఒక దశలో రూ.1,103వద్ద గరిష్టాన్ని తాకింది. మరో కంపెనీ ఐనాక్స్ లీజర్ షేరు 16 శాతం లాభపడి రూ.270 వద్ద ముగిసింది. ఉదయం సెషన్లో రూ.236 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో రూ.279 వద్ద గరిష్టాన్ని చేరింది. కాగా లాక్‌డౌన్‌తో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడం, సినిమాహాళ్లు మూతపడడంతో గత రెండు నెలలుగా ఈ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
మల్టీప్లెక్స్ షేర్ల పతనం- పీవీఆర్ నుంచి రైట్స్!
దేశీయ మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్.. నిధుల సమీకరణ బాటపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రైట్స్ ఇష్యూని చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. పీవీఆర్ సినిమాస్ పేరుతో దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ నిర్వహిస్తున్న కంపెనీ లాక్‌డవున్ కారణంగా ఇటీవల సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించేందుకు పీవీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే యాక్సిస్ కేపిటల్‌ను మర్చంట్ బ్యాంకర్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. 845 తెరలతో పీవీఆర్ లిమిటెడ్ చేపట్టదలచిన రైట్స్ ఇష్యూలో ప్రమోటర్లతోపాటు ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పీఈ దిగ్గజాలు వార్బర్గ్ పింకస్, మల్టీపుల్స్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ సైతం పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి డేటాబేస్ ప్రకారం పీవీఆర్ లిమిటెడ్‌లో ప్రమోటర్ల వాటా 18.54 శాతంకాగా.. వార్బర్గ్ పింకస్ 12.74 శాతం, మల్టిపుల్స్ ఏఏఎం 11.17 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా పీవీఆర్ 176 ఆస్తులను కలిగి ఉంది. తద్వారా 845 తెరల(స్ర్కీన్స్)ను నిర్వహిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో కంపెనీ క్విప్ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. లాక్‌డవున్ కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు, మాల్స్ మార్చి నుంచి తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో మల్టీప్లెక్స్ రంగంలో ఆదాయాలకు గండి పడింది. మరోపక్క మూవీ నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సినిమాలను విడుదల చేసే ప్రణాళికలు వేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓటీటీ ద్వారా కాకుండా నేరుగా థియేటర్లలో తొలిసారి విడుదల చేసే సినిమాలను మాత్రమే ప్రదర్శించాలని పీవీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. షేర్లు డీలా కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇటీవల స్టాక్ మార్కెట్లలో లిస్టయిన మల్టీప్లెక్స్ కంపెనీలు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వెరసి గత మూడు నెలల్లో పీవీఆర్ షేరు 57 శాతం పతనంకాగా.. ప్రత్యర్ధి కంపెనీ ఐనాక్స్ లీజర్ షేరు సైతం 55 శాతం దిగజారింది. కాగా.. జులైకల్లా తిరిగి మల్టీప్లెక్స్‌ల కార్యకలాపాలు ప్రారంభంకాగలవని పీవీఆర్ భావిస్తోంది. ఆగస్ట్ రెండో వారం నుంచీ బిజినెస్ పుంజుకోగలదని ఆశిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీవీఆర్ షేరు 2 శాతం క్షీణించి రూ. 864 వద్ద ట్రేడవుతోంది. ఈ ఫిబ్రవరి 25న రూ. 2125 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇక రూ. 512 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన ఐనాక్స్ లీజర్ ప్రస్తుతం 2 శాతం నీరసించి రూ. 212 వద్ద ట్రేడవుతోంది. -
సినిమారంగ షేర్లకు జీఎస్టీ షాక్
ముంబై: ఎన్డీఏ సర్కారు ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్టీలో వివిధ పన్నులు దాదాపు ఖరారయ్యాయి. దీంతో ఈ ప్రభావం స్టాక్‌మార్కెట్లలో వివిధ రంగాలపై బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ లాంటి సెక్టార్లు దూకుడును ప్రదర్శిస్తుండగా, సినిమాలపై అంచనాల కంటే అధికంగా పన్ను రేట్లు ఖరారు కావడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లలో సినిమాకు సంబంధించిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. పీవీఆర్, ఐనాక్స్ లీజర్ వంటి వినోద రంగ షేర్లు కుదేలయ్యాయి. జీఎస్టీ పరిధిల్లో పన్నుల శ్లాబులో 18 శాతం పన్ను ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ 28 శాతం పన్ను రేటును ఖరారు చేసినట్టు శుక్రవారం ఆర్థికమంత్రి అరుణ జైట్లీ ప్రకటించారు. దీంతో పీవీఆర్ షేర్ నెల రోజుల వ్యవధిలో 6 శాతం నష్టాన్ని నమోదు చేసింది. సోమవారం ఈ షేర్ ఇంట్రాడేలో రూ.1,400-రూ.1,513 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. ఎన్ఎస్ఈలో ఒక్కో షేర్ రూ.1,471 ధరకు రూ.6.83 కోట్ల బ్లాక్ డీల్ జరిగింది. ఈ షేర్ ఏడాది కనిష్ట, గరిష్ట స్థాయిలు రూ.820, 1,660గా ఉన్నాయి. మరో మల్టీప్లెక్స్ కంపెనీ ఐనాక్స్ లీజర్ కూడా ఇదే బాటలో పయనిస్తూ నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం 15శాతంపన్ను అమలవుతున్న సినిమారంగాన్ని హెయ్యస్ట్ కేటగిరీలైన జూదం, బెట్టింగ్ లాంటి లో సినిమా రంగాన్ని చేర్చడంపై పరిశ్రమంగా కొద్దిగా అసంతృప్తిగా వున్నారని ఏంజెల్ బ్రోకింగ్ అభిప్రాయపడింది. -
పీవీఆర్, ఐనాక్స్ లకు బాహుబలి జోష్
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా మారుమ్రోగించిన బాహుబలి-ది బిగినింగ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేసింది. బాహుబలి: ది బిగినింగ్ రీఎంట్రీ మల్టిప్లెక్స్ ఆపరేటర్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లకు భలే జోష్ నిచ్చింది. హిందీ వెర్షన్లలో 1000కి పైగా స్క్రీన్లపై ఈ సినిమాను మల్టిప్లెక్స్ లో ప్రదర్శిస్తున్నారు. బాహుబలి రీ-రిలీజ్ సందర్భంగా నేటి మార్కెట్లో పీవీఆర్ షేర్లు 3 శాతం పైగా పైకి దూసుకెళ్లగా.. ఐనాన్స్ 0.30 శాతం లాభపడ్డాయి. ఓ వైపు దేశీయ బెంచ్ మార్కు సూచీలు తీవ్ర నష్టాల దిశగా పయనిస్తున్న సమయంలోనే పీవీఆర్, ఐనాక్స్ షేర్లను బాహుబలి: ది బిగినింగ్ ఆదుకుంది. గత మూడు నెలల్లో ఈ మల్టిఫ్లెక్స్ ల షేర్లు 30 శాతానికంటే పైకి దూసుకెళ్లాయి. మల్టిప్లెక్స్ ఆపరేటర్లకు మార్చి క్వార్టర్ ఎంతో లాభదాయకమైన త్రైమాసికమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దంగాల్, రాయిస్, కబాలి, జోలీ ఎల్ఎల్బీ2, బద్రినాథ్ కి దుల్హానియా వసూళ్లు ఈ కంపెనీ షేర్లకు భారీగా కలిసివచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాహుబలి రీ-రిలీజ్ మరింత సెంటిమెంట్ ను బలపరుస్తుందన్నారు. ఏప్రిల్ 28 'బాహుబలి 2' విడుదల అవుతున్న సందర్భంగా మరోమారు 'బాహుబలి 1'ను విడుదల చేసేందుకు థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించాయి. తెలుగులో పరిమిత సంఖ్యలో విడుదలవుతున్నా.. హిందీలో మాత్రం మరోసారి ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఒక కొత్త సినిమా మాదిరిగానే హౌస్ ఫుల్ కావడం బాహుబలికున్న క్రేజ్ చాటిచెప్తోంది. ఈ రీ-రిలీజ్ సినిమాను 17వ తేదీ లోపున చూసిన వారికి, బాహుబలి 2 టిక్కెట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఐనాక్స్కు ఫలితాల దెబ్బ
న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్వహణ సంస్థ ఐనాక్స్ లీజర్‌కు ఫలితాల షాక్ తగిలింది. మల్టీప్లెక్స్ ఆపరేటర్ ఐనాక్స్ ఏకీకృత నికరలాభం భారీగా క్షీణించడంతో మార్కెట్ లో ఐనాక్స్ షేర్ దాదాపు 8.74 శాతం పతనమైంది. సెప్టెంబర్ ముగిసిన రెండవ త్రైమాసికంలో సంస్థ నికర లాభాలు 92. 56 శాతం క్షీణించాయి. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో రూ 1.58 కోట్లు ఏకీకృత నికరలాభం సాధించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో నివేదించింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్‌లో రూ 21.24 కోట్లగా ఉంది. నికర అమ్మకాలు 3.12 శాతం తగ్గి రూ 279 కోట్లుగా రిపోర్ట్ చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ 288 కోట్లుగా ఉంది. కాగా ఐనాక్స్ లీజర్ 57 నగరాల్లో మొత్తం 440 స్ర్కీన్స్ నిర్వహిస్తోంది.