కంటెయిన్‌మెంట్ జోన్లలో మినహాయించి ఈ నెల 15 నుంచీ సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా అనుమతించింది. దీంతో దేశవ్యాప్తంగా సినిమాల ప్రదర్శనకు వీలు కలగనుండటంతో మల్టీప్లెక్స్ నిర్వాహక కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లిస్టెడ్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
హుషారుగా..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీవీఆర్ 9 శాతం జంప్‌చేసి రూ. 1,319 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతం దూసుకెళ్లింది. గరిష్టంగా రూ. 1,395ను తాకింది. ఇక ఐనాక్స్ లీజర్ సైతం ఇంట్రాడేలో 17 శాతం దూసుకెళ్లింది. రూ. 318కు చేరింది. ప్రస్తుతం 7.2 శాతం లాభపడి రూ. 290 వద్ద ట్రేడవుతోంది. సినిమా థియేటర్ల ప్రారంభానికి కేంద్రం అనుమతించినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. మహారాష్ట్ర, తమిళనాడులలో సినిమా హాళ్లు అక్టోబర్ నెలలోనూ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించకపోవడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment