అఫ్లే ఇండియా అప్‌- ఐనాక్స్‌ లీజర్‌ డౌన్‌ | Affle india up- Inox leisure down | Sakshi
Sakshi News home page

అఫ్లే ఇండియా అప్‌- ఐనాక్స్‌ లీజర్‌ డౌన్‌

Published Tue, Jun 9 2020 12:31 PM | Last Updated on Tue, Jun 9 2020 12:31 PM

Affle india up- Inox leisure down - Sakshi

ముందురోజు అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకోవడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 373 పాయింట్లు జంప్‌చేసి 34,744కు చేరగా.. నిఫ్టీ 112 పాయింట్లు ఎగసి 10,279 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కంపెనీ అఫ్లే ఇండియా కౌంటర్‌ జోరందుకోగా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌ అమ్మకాలతో డీలాపడింది. వెరసి అఫ్లే ఇండియా షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. ఐనాక్స్‌ లీజర్‌ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

అఫ్లే ఇండియా
సొంత అనుబంధ సంస్థ ద్వారా సింగపూర్‌లో యాప్‌నెక్ట్స్‌ పీటీఈను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అఫ్లే ఇండియా కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అఫ్లే ఇండియా షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 1539 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1555ను అధిగమించింది. యాప్‌నెక్ట్స్‌ పీటీఈలో 66.67 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు అఫ్లే సింగపూర్‌ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అఫ్లే ఇండియా పేర్కొంది. మూడేళ్లలోగా యాప్‌నెక్ట్స్‌లో మిగిలిన 28.33 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సైతం ఒప్పందం కుదిరినట్లు తెలియజేసింది.

ఐనాక్స్‌ లీజర్‌
మల్టీప్లెక్స్‌ కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌ గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐనాక్స్‌ లీజర్‌ రూ. 82 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 48 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 22 శాతం క్షీణించి రూ. 372 కోట్లకు పరిమితమైంది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐనాక్స్‌ లీజర్‌ షేరు 6 శాతం పతనమై రూ. 266 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 262 వరకూ జారింది. కాగా.. లాక్‌డవున్‌ ఎత్తివేత అంచనాలతో గత ఐదు రోజుల్లో ఈ షేరు 21 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement