మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆరుషి ఢిల్లీ వాసి. కాలేజీ రోజుల నుంచే ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారాఫ్యాషన్ డ్రెస్సులు, జ్యువెలరీ అమ్మకాలు చేపట్టింది. ఏడేళ్ల క్రితం 30 వేల రూపాయతో విష్’ పేరుతో సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసి, విదేశాలకూ తన ఉత్పత్తులను సర ఫరా చేస్తోంది. ;పాతికమందికి పైగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించింది. దేశంలో గ్రామీణ మహిళా కళాకారులను గుర్తించి, వారితో నెట్‌వర్కింగ్ ఏర్పాటుచేసి, ఉపాల్పిస్తోంది. ‘అవకాశాలను వెతకడం కాదు, మనమే సృష్టించుకోవాలి’ అంటున్న ఆరుషి నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
‘‘నేను ఫ్యాషన్ డ్రెస్సులు, కస్టమైజ్డ్ జ్యువెలరీ, డెకరేటివ్ వస్తువులు, పిల్లల బట్టలు, ఇతర ఉపకరణాలను ఎగుమతి చేస్తుంటాను. నాకు మొదటి నుంచి బిజినెస్ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో అమ్మతో కలిసి అనేక ఈ–కామర్స్ సైట్‌లలో చీరలు, సూట్‌లు అమ్మేదానిని. కానీ, చాలా పోటీ అనిపించేది. ఏదైనా సరే భిన్నంగా చేయాలనే కోరిక ఉండేది. కానీ, సరైన మార్గం దొరికేది కాదు. కాలేజీలో చదువుతూనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాను. కానీ, నాకు నేనుగా నిరూపించుకునే పనిచేయాలనుకునేదాన్ని. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని వ్యా΄ారానికి కేటాయించాలనుకున్నాను. ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తంతో సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాను. 30 వేల రూ΄ాయలతో ‘లావిష్’ అనే పేరుతో కంపెనీని రిజిస్టర్ చేయించాను. అమెజాన్‌తో కలిసి చీరలు, ఫ్యాషన్ జ్యువెలరీ వంటివి అమ్మడం మొదలుపెట్టాను. రెండేళ్లు ఈ పనులు ఇలాగే కొనసాగాయి.
అంతర్జాతీయంగా..
అమ్మే ఉత్పత్తులకు నా సొంత ఆలోచనను జోడించాను. సొంతంగా డిజైన్లు చేయడంతో ΄పాటు కొనుగోలుదార్లు అడిగే డిజైన్లపైనా పనిచేయడం మొదలుపెట్టాను. కస్టమైజ్డ్ డిజైన్లు అవడంతో ఆర్డర్లు విరివిగా రావడం మొదలయ్యాయి. దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ కొనుగోలుదార్లు పెరిగారు. పాతికలక్షలకు పైగా టర్నోవర్ సాధిస్తున్నాను.
మహిళలు మాత్రమే
నా కంపెనీలో మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. దేశంలోని గ్రామాల నుండి కళాకారుల సమాచారం సేకరిస్తాను. వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాను. అక్కడ ఉత్పత్తులను తయారు చేయించి, వాటిని విక్రయిస్తాను. మహిళలు మాతో కనెక్ట్ అవడానికి ప్రత్యేక ప్రయోజనం కూడా ఉంది. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయనవసరం లేదు. అమ్ముకోవడం కోసం బయటికి వెళ్లనక్కరలేదు. ఇంట్లో కూర్చొని ఉపాధి ΄పోందవచ్చు. అంతేకాదు, వారి నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తుంది. దీనిద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మన హస్తకళలకు ముఖ్యంగా ఆభరణాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. విదేశీ మహిళలకు రాజస్థానీ వస్త్రధారణ, బంజారా నగలు అంటే పిచ్చి. వారు భారతీయ సంస్కృతిని చాలా ఇష్టపడతారు. దీని కారణంగానే వారు భారతీయ డ్రెస్సులు, ఆభరణాలవైపు ఆకర్షితులవుతారు.
ఒంటరి తల్లి
నా సక్సెస్ వెనక మా అమ్మ మద్దతు చాలా ఉంది. నేను ముందడుగు వేయడంలో అమ్మ ఎప్పుడూ ్రపోత్సహిస్తుంటుంది. మా చెల్లినీ, నన్ను అమ్మ ఒంటరిగా చాలా కష్టపడి పెంచింది. ఆ కష్టంలో... నేను నా మార్గం కనుక్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అందుకే ఈ రోజు వరకు 12 దేశాలకు ఒంటరిగా వెళ్లి, సందర్శించగలిగాను.
ఇంటి పేరుకు నో!
నా పేరుకు ఇంటిపేరు జోడించకూడదని నా సొంత నిర్ణయం. అందుకే, నా పేరుకు ముందు సర్‌నేమ్ ఉండదు. ఒక వ్యక్తి చేసే పనే వారి గుర్తింపు అవుతుంది. అందుకే, ఇంటి పేరును జత చేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావించాను. అందుకు మా అమ్మ కూడా మద్దతు తెలిపింది. కానీ, ముఖ్యమైన పేపర్లలో సర్‌నేమ్ లేకుండా ఇవ్వలేమనే నిబంధనలతో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్కూల్లో, కాలేజీలో ప్రతిచోటా ఈ సమస్య ఎదురైంది. కానీ, నా నిర్ణయాన్ని మార్చకోలేనని స్పష్టంగా చె΄్పాను. అందుకు, చట్టపరంగానూ, న్యాయసలహాలు తీసుకున్నాను. దీంతో నా సర్టిఫికెట్లన్నింటిలోనూ నా పేరు మాత్రమే ఉంటుంది.
ఒంటరి యాత్రికురాలిని
నాకు ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రకృతి అందమైన ప్రపంచాన్ని మన ముందుంచింది. దానిని ఆస్వాదించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అనుకుంటాను. స్వదేశంలో లేదా విదేశంలో ఎక్కడ సందర్శనకు వెళ్లినా ప్రతిచోటా వారి సంస్కృతి, కళల గురించి తెలుసుకుంటాను. గ్రామాల్లో దాగి ఉన్న సాంస్కృతిక, కళాత్మక ప్రతిభను తెలుసుకొని, నైపుణ్యాలను మెరుగుపరిచి, ప్రపంచం ముందుకు తీసుకువస్తుంటాను’’ అని తన విజయపథాన్ని వివరించింది ఆరుషి.
Comments
Please login to add a commentAdd a comment