కొత్త రాజధానితో సిమెంటుకు డిమాండ్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణ రంగం పుంజుకునేంతవరకు సిమెంట్ పరిశ్రమలో ఒడుదుడుకులు తప్పవని సాగర్ సిమెంట్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్. ఆనంద్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, రియల్ ఎస్టేట్ సంస్థలు దూకుడు తగ్గించటం వంటి అంశాలు సిమెంట్ విక్రయాలపై ప్రభావం చూపుతోందన్నారు.
ప్రభుత్వ రంగంలో నిర్వహించే గృహ, రోడ్డు, ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం కాకపోవడం, మందగించిన డిమాండ్, స్థిర వ్యయాల భారం, పెరుగుతున్న రవాణా ఛార్జీలు తయారీ సంస్థల లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సాక్షి ప్రతినిధికి ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి మౌలిక వసతుల కల్పన సిమెంట్ పరిశ్రమకు ఎంతో కలిసివచ్చే అంశమని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పరిస్థితుల్లో మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.
బీఎంఎం విలీనం పూర్తికావచ్చింది...: తాడిపత్రిలో ఇటీవల తాము కొనుగోలు చేసిన బీఎంఎం విలీనం ప్రక్రియ పూర్తికావచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా బీఎంఎం పూర్తిగా సాగర్ గ్రూప్ కంపెనీ అవుతుందని ఆనంద రెడ్డి వివరించారు. విలీనం తర్వాత సాగర్ సిమెంట్స్ స్థాపక సామర్థ్యం 37.5 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. బీఎంఎం ప్లాంటువల్ల సాగర్ బ్రాండ్ సిమెంట్ కర్నాటక, కేరళ, సీమంధ్ర ప్రాంతాల మార్కెట్‌కు అందుబాటులో ఉంటుందన్నారు.
సిమెంట్ మార్కెట్లో కన్సాలిడేషన్: దేశంలో దక్షినాదిన మొత్తం వ్యవస్థాపక సామర్థ్యం 125 మిలియన్ టన్నులు కాగా అందులో 50%(56మిలియన్ టన్నులు) మాత్రమే ఉత్పత్తి అవుతోందని ఆయన చెప్పారు. సిమెంట్ కంపెనీల వ్యవస్థాపక సామర్థ్యం పూర్తిగా వినియోగంలోకి రావాలంటే మరికొంత సమయం పట్టివచ్చన్నారు. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా సిమెంట్ ధరలు పెరగకపోవడంతో ఓ మోస్తరు కంపెనీలకు కూడా మార్కెట్లో నిలదొక్కుకోవడం సవాలుగా మారుతోందన్నారు. దీంతో ఈ రంగంలో మరిన్ని కొనుగోళ్లు, విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ పోకడలు సూచిస్తున్నాయన్నారు.
ఫార్మాలోకి వస్తున్నారా?
సిమెంట్ రంగ దిగ్గజం సాగర్ సిమెంట్స్ ఫార్మా వ్యాపారంలోకి అడుగిడనుందా? హైదరాబాద్‌లో 30 వేల కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఫార్మా సిటీలో యూనిట్ నెలకొల్పే యోచన చేస్తోందా? ఇటీవల ఫార్మా సిటీ స్థల ఎంపిక కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ఏరియల్ సర్వేలో ఫార్మా సంస్థల దిగ్గజాలతో కలిసి సాగర్ సిమెంట్స్ జేఎండీ ఆనంద రెడ్డి పాల్గొనటం పారిశ్రామికవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయమై ఆయనతో ప్రస్తావించగా...‘‘మా ప్రధాన వ్యాపారం సిమెంట్. అదే మా కోర్ కాంపిటెన్సీ.
ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు కాని, భవిష్యత్తులో పెట్టుబడికి ప్రతిఫలం అందించే పరిశ్రమల్లో ప్రవేశించాలన్నదే మా అభిలాష’’ అన్నారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పారు. వికాట్ సాగర్ సిమెంట్ జాయింట్ వెంచర్‌లో తన వాటా 47 శాతం ఫ్రెంచి సంస్థ వికాట్‌కు 2014లో రూ. 435 కోట్లకు సాగర్ విక్రయించింది. ఈ మొత్తాన్ని కొత్త వ్యాపారా అవకాశాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ఇంతకుముందే ప్రకటించింది. ప్రస్తుతం సిమెంట్ పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో అధికాదాయ మార్గాలపై సాగర్ సిమెంట్స్ దృష్టి పెడుతోన్న విషయం స్పష్టం అవుతోంది.