
హైదరాబాద్, సాక్షి: సింగపూర్‌లో తన చిన్నకొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar Pawanovich) ప్రమాదానికి గురి కావడంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) స్పందించారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని.. తన కొడుకుకు గాయాలైన మాట వాస్తవమేనని ధృవీకరించారాయన. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
ఉదయం అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. సింగపూర్ హైకమిషనర్ సమాచారం అందించారు. నా కొడుకు మార్క్ శంకర్ స్కూల్‌లో ప్రమాదం జరిగింది. మొదట చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నా. కానీ, ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ పసిబిడ్డ చనిపోయింది. నా కుమారుడు మార్క్ శంకర్‌కు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లినట్లు తెలిసింది. ప్రధాని మోదీ ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. నా పెద్దకొడుకు అకీరా పుట్టినరోజే చిన్నకొడుక్కి ఇలా జరగడం బాధాకరం’’ అని పవన్ అన్నారు.
సింగపూర్‌లో నా కుమారుడి అగ్నిప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ(PM Modi)కి ధన్యవాదాలు. అలాగే సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ సహా అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు అని పవన్ అన్నారు.
ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో సింగపూర్(Singapore) రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. పవన్-అన్నాలెజినోవాలకు కూతురు పోలేనా అంజనా పవనోవా, కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సంతానం.