సిమెంట్‌పై జీఎస్‌టీని 18%కి తగ్గించాలి | First Construction Council said cement industry is the main partne | Sakshi
Sakshi News home page

సిమెంట్‌పై జీఎస్‌టీని 18%కి తగ్గించాలి

Published Fri, Dec 21 2018 12:50 AM | Last Updated on Fri, Jul 12 2019 6:06 PM

First Construction Council said cement industry is the main partne - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో సిమెంట్‌ పరిశ్రమ ప్రధాన భాగస్వామి అని ఫస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌సీసీ) తెలియజేసింది. ప్రస్తుతం సిమెంట్‌పై ఉన్న 28 శాతం జీఎస్‌టీని వెంటనే 18 శాతానికి తగ్గించాలనే అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని.. త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడుతుందని ఎఫ్‌సీసీ ఫౌండర్‌ అండ్‌ ప్రెసిడెంట్‌ ప్రతాప్‌ పడోడే తెలిపారు. గురువారమిక్కడ ప్రారంభమైన రెండు రోజుల 10వ సిమెంట్‌ ఎక్స్‌పో సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్‌టీ తగ్గింపుతో అందుబాటు గృహాలు, రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక రంగాల్లో సిమెంట్‌ వినియోగం పెరుగుతుందని చెప్పారు. దేశ వృద్ధి కంటే సిమెంట్‌ పరిశ్రమ వృద్ధి జోరుగా ఉందన్నారు. ప్రపంచ సిమెంట్‌ ఉత్పత్తిలో మన దేశానిది రెండో స్థానంలో ఉందని, థర్మల్‌ ప్రాసెస్‌ సామర్థ్యాల పరంగా సిమెంట్‌ ఉత్పత్తిని చేయడంలో మన దేశానిది స్థానం ఉందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో రహదారులు, పట్టణాభివృద్ధి, విద్యుత్‌ వంటి మౌలిక రంగాల్లో 454 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో అదనంగా10–15 మిలియన్‌ టన్నులు.. 
వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10–15 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ సామర్థ్యం జత అవుతుందని ప్రతాప్‌ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 50–60 సిమెంట్‌ కంపెనీలున్నాయని.. 75 మి.టన్నుల సామర్థ్యం ఉందన్నారు. ముడి పదార్థాల ధర, విద్యుత్, రవాణా చార్జీలపై  సిమెంట్‌ బ్యాగ్‌ ధర ఆధారపడి ఉంటుందన్నారు. 2 రోజుల సిమెంట్‌ ఎక్స్‌పో ప్రదర్శనకు భారతీ సిమెంట్‌ సిల్వర్‌ పార్టనర్‌ గా వ్యవహరించింది. ఎక్స్‌పోలో ఏబీబీ, ఏసీసీ, అం బుజా వంటి 80కి పైగా సిమెంట్‌ కంపెనీలు, 1,200 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సిమెంట్, కన్‌స్ట్రక్షన్, ఎక్విప్‌మెంట్, టెక్నాలజీ కంపెనీలు పాల్గొన్నాయి. రెండేళ్లకొకసారి ప్రాంతీయ మార్కెట్లలో సిమెంట్‌ ఎక్స్‌పో ప్రదర్శను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement