సిమెంటు రంగంలో ఈ ఏడాది 4% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ సిమెంటు పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.5 నుంచి 4 శాతం వృద్ధి చెందుతుందని నిపుణులు అంటున్నారు. గతేడాది సిమెంటు పరిశ్రమ 3 శాతం వృద్ధి నమోదు చేసింది. 2014-15లో నిర్మాణ రంగంలో కదలిక వస్తుందన్న సంకేతాలు ఉన్నాయని బిర్లా కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ జి.జయరామన్ అన్నారు. సీఐఐ, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన గ్రీన్ సిమెంటెక్ 2014 కార్యక్రమంలో సదస్సు చైర్మన్ హోదాలో ఆయన మాట్లాడారు.
దేశంలో సిమెంటు ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం మొత్తం 36 కోట్ల టన్నులు. ఉత్పత్తి మాత్రం 26 కోట్ల టన్నులకు పరిమితమైందని చెప్పారు. 2020 నాటికి స్థాపిత సామర్థ్యం 50 కోట్ల టన్నులకు చేరుతుందని పేర్కొన్నారు. చైనా తర్వాత అధికంగా సిమెంటును ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్. ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 7 శాతం. ఇక సరాసరి సిమెంటు వినియోగం 202 కిలోలుంది. ప్రపంచ సరాసరి 543 కిలోలు.
ఉష్ణమూ ఉపయోగమే..
సిమెంటు ప్లాంట్లలో వెలువడే ఉష్ణం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు (వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్) అపార అవకాశాలున్నాయి. దేశంలో ఎంత కాదన్నా 500-600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని జయరామన్ అన్నారు. ఈ విధానంలో ఏర్పాటవుతున్న విద్యుత్ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 2014లో 200 మెగావాట్లు దాటొచ్చని చెప్పారు. అయితే ఈ విధానం విస్తృతం అవ్వాలంటే పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వాలని సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎన్.ఏ.విశ్వనాథ న్ డిమాండ్ చేశారు. ఇదే జరిగితే చిన్న సిమెంటు కంపెనీలకూ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. హోల్సిమ్, లఫార్జ్‌ల విలీన ప్రభావం సామాన్య వినియోగదారునిపై ఏమాత్రం ఉండబోదని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయం అతిస్వల్పం..
ఇంధనం కోసం సిమెంటు కంపెనీలు పూర్తిగా బొగ్గుపైనే ఆధారపడ్డాయి. ప్రత్యామ్నాయ ఇంధనం కేవలం 1 శాతం లోపే ఉందని మధ్యప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎన్.పి.శుక్లా చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం స్విట్జర్లాండ్‌లో 47 శాతం, జర్మనీలో 42 శాతం ఉందని వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సద్వినియోగం చేసుకోవాలని, బొగ్గుతో పోలిస్తే మూడు రెట్లు ఉష్ణం అధికంగా విడుదల చేస్తాయని తెలిపారు. వ్యయం కూడా తగ్గుతుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నలో ఓ సిమెంటు ప్లాంటు ప్లాస్టిక్ వ్యర్థాలతో 14 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోందని వివరించారు. మధ్యప్రదేశ్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి సిమెంటు ప్లాంట్లకు సరఫరా చేస్తోందని, రవాణా వ్యయాలను మున్సిపల్ కార్పొరేషన్ భరిస్తోందని చెప్పారు.