తయారీ సంస్థలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పగలిగే సత్తా తమలోనూ ఉందని గుర్తించి, ముందుకెళ్లాలని దేశీ తయారీ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. విభిన్న ఆవిష్కరణలతో సంస్థలు మెరుగైన ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి టాప్ అయిదు దేశాల జాబితాలో యూరప్ ఆధిపత్యమే కొనసాగుతుండగా, ఆ లిస్టులో భారత్ లేకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణమైనవి కాకపోయినప్పటికీ మిగతా దేశాలు నెలకొల్పిన ప్రమాణాలను మనం పాటించాల్సిన అవసరం వస్తోందని నిధి వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ విషయంలో భారత్‌లో గణనీయంగా ప్రతిభావంతులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడంలో వెనకబడినట్లు చెప్పారు. అయితే, ఆ అంశంలో ముందుకెళ్లాలంటే కొన్ని అవరోధాలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: ఓఎన్‌జీసీ నుంచి పవన్ హన్స్‌కు భారీ ఆర్డర్
గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను అనుసంధానం చేయడం సహా నాణ్యతా ప్రమాణాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచ స్థాయి సర్వీసులు అందించేందుకు టెస్టింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రైవేట్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం మొదలైన వాటిపై దృష్టి పెడుతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment