దావోస్‌లో సీఐఐ రౌండ్ టేబుల్ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో ప్రపంచ అత్యుత్తమ రవాణా మొబిలిటీని కల్పిస్తాం
ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మారుస్తాం
కొత్తగా 100 కిలోమీటర్ల పొడవైన మెట్రోలైన్ నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి
ఫడ్నవిస్, చంద్రబాబులతో వేదిక పంచుకున్న రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రూపురేఖలు మార్చేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరాన్ని నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడంతో పాటు తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు.
ప్రజలు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ లేని నగరాల్లోనే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో భాగంగా భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
నగరాల అభివృద్ధికి అర్బన్ మొబిలిటీయే పునాది
‘నగరాల అభివృద్ధి, వాటి భవిష్యత్తులో అర్బన్ మొబిలిటీ పునాదిగా పనిచేస్తుంది. ప్రజలు తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో వేగంగా గమ్యాన్ని చేరుకునేలా రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయి. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేశాం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా తెలంగాణలోనే అమ్ముడవుతున్నాయి..’అని సీఎం చెప్పారు.
మచిలీపట్నం పోర్టుతో అనుసంధానిస్తాం
‘ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నాం. డ్రైపోర్టు నిర్మాణంతో తెలంగాణను వేర్‌హౌస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తాం.
1.2 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న మెట్రోతో పోలిస్తే రెండింతలుగా వంద కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ నిర్మిస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు ఉండగా, కొత్తగా ఓఆర్‌ఆర్ వెలుపల 360 కిలోమీటర్ల పొడవైన ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మిస్తాం.
ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్‌ను అనుసంధానం చేసేలా రేడియల్ రింగు రోడ్లు నిర్మిస్తాం. రింగు రోడ్లకు అనుబంధంగా రైల్వే లైన్లు నిర్మించే ఆలోచన ఉంది..’అని రేవంత్ తెలిపారు.
పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉంటాం
పొరుగు రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా కొనసాగుతూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని సీఎం రేవంత్ చెప్పారు. దావోస్‌లో ‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులతో కలిసి రేవంత్ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘మేము సరిహద్దులతో పాటు కృష్ణా, గోదావరి నదుల నీటిని కూడా పంచుకుంటున్నాం. ఈ నదులు మహారాష్ట్ర నుండి ప్రారంభమై, తెలంగాణలోకి ప్రవేశించి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తాయి. అందువల్ల మేం అభివృద్ధి సాధించడమే మా మొదటి ప్రాధాన్యత. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తీరు అసాధారణం. ఇప్పుడు, తెలంగాణ ప్రపంచ స్థాయి నగరాలతో, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడుతోంది.
మా అత్యంత పెద్ద బలం హైదరాబాద్, అలాగే యువత. మా ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటాయి. మాపై నమ్మకం ఉంచండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..’అని పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి కోరారు. భారతదేశం–రాష్ట్రాల అభివృద్ధి దృక్పథం సంక్షేమం, సాంకేతికత, ఉద్యోగాల కల్పన – భవిష్యత్తు.. వంటి పలు అంశాలపై ముగ్గురు సీఎంలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
‘లక్ష కోట్ల మొక్కల్లో..’భాగస్వాములమవుతాం
భూమండలంపై లక్ష కోట్ల మొక్కలు నాటే సంకల్పంలో తాము భాగస్వాములు అవుతామని డబ్ల్యూఈఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నికోల్ శ్వాబ్ సమక్షంలో రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబులు ప్రమాణం చేశారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కల పెంపకానికి చేపడుతున్న కార్యక్రమాలను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment