బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తనను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్(KTR) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడవచ్చని అనుకునేవాళ్లకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి జీవనోపాధిని పొందుతున్నారు.
ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు సలాం. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి. మీ విద్యార్హతలు, నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్లు ప్రవేశపట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. నా విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment