ప్రాధాన్యతా రంగాల రుణాలకు (పీఎస్‌ఎల్) సంబంధించిన విధానాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత ప్రాజెక్టులు, ఆరోగ్య సంరక్షణ, వినూత్న ఉత్పత్తుల తయారీ వంటి వర్ధమాన రంగాలు, అత్యధికంగా ప్రభావం చూపగలిగే పరిశ్రమలను కూడా ఈ విభాగంలో చేర్చాలని ప్రతిపాదించింది.
ఇందుకోసం కొత్తగా డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ల (డీఎఫ్‌ఐ) ఏర్పాటు చేసే అంశంపై దృష్టి పెట్టేందుకు అత్యున్నత స్థాయి కమిటీని వేసే అవకాశాలను పరిశీలించాలని సీఐఐ పేర్కొంది. ఇప్పటికే నిర్దిష్ట రంగాల అవసరాలను ప్రస్తుతం ఉన్న సిడ్బీ, నాబ్‌ఫిడ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్) మొదలైనవి తీరుస్తున్నాయని సీఐఐ వివరించింది. పీఎస్‌ఎల్ విధానం విజయవంతమైనప్పటికీ.. అది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా దానికి తగు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి: 36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’
ఉదాహరణకు స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 30 శాతం పైగా ఉన్నప్పుడు పీఎస్‌ఎల్ కేటాయింపు 18 శాతంగా ఉండేదని.. ప్రస్తుతం సాగు రంగం వాటా 14 శాతానికి తగ్గిపోయినప్పుడు కూడా అదే తీరు కొనసాగుతోందని సీఐఐ పేర్కొంది. ఆర్థిక వృద్ధికి భారీగా తోడ్పడగలిగే సత్తా ఉన్నప్పటికీ మౌలిక రంగం, వినూత్న ఉత్పత్తుల తయారీకి పీఎస్‌ఎల్ పరంగా తగినంత ప్రాధాన్యం లభించడం లేదని వివరించింది. ఈ నేపథ్యంలో కొత్త పరిస్థితులు, జీడీపీలో నిర్దిష్ట రంగాల వాటా, వాటి వృద్ధి అవకాశాల ఆధారంగా పీఎస్‌ఎల్ విధానాన్ని ప్రతి 3–4 సంవత్సరాలకు ఒకసారి సవరించాలని సీఐఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment