సిమెంటు రంగంలో ఈ ఏడాది 6% వృద్ధి
• విక్రయాలు 31.8 కోట్ల టన్నులకు
• ధరలు కొంత పెరిగే అవకాశం
• జేఎస్‌డబ్ల్యు సీఎంవో పుష్పరాజ్ సింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6 శాతం వృద్ధి నమోదు కానుందని జేఎస్‌డబ్ల్యు సిమెంట్ వెల్లడించింది. 2015-16లో దేశవ్యాప్తంగా 30 కోట్ల టన్నుల సిమెంటు అమ్ముడైంది. 2016-17లో ఇది 31.8 కోట్ల టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు సంస్థ సీఎంవో పుష్పరాజ్ సింగ్ చెప్పారు. 2015 అక్టోబరు-2016 మార్చి కాలంతో పోలిస్తే ఏప్రిల్-సెప్టెంబరులో 7-8 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు.
కాంక్రీల్ హెచ్‌డీ పేరుతో తయారు చేసిన నూతన రకం సిమెంటును విడుదల చేసిన సందర్భంగా కంపెనీ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ అక్కరతో కలిసి గురువారమిక్కడ మీడియాతో పుష్పరాజ్ మాట్లాడారు. హైవేలు, భారీ ప్రాజెక్టుల కారణంగా 2017-18లో విక్రయాలు 35 కోట్ల టన్నులకు చేరొచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తారు రోడ్లకు బదులుగా ఎక్కువ కాలం మన్నే సిమెంటు రోడ్ల వైపు మొగ్గు చూపుతున్నాయని వివరించారు.
పెరుగుతున్న వ్యయం..
రానున్న రోజుల్లో సిమెంటు ధరలు కొంత పెరిగే అవకాశం ఉందని, తయారీ వ్యయం అధికమవడమే ఇందుకు కారణమని పుష్పరాజ్ సింగ్ తెలిపారు. ‘సున్నపురాయి నిల్వలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, కర్నాటక, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. దీంతో సున్నపురాయి ధర నాలుగైదు రెట్లు పెరిగింది. రవాణా, ఇంధనం ఖర్చులూ అధికమవుతున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు కంపెనీల ప్లాంట్ల వినియోగం 60 శాతానికే పరిమితమైంది. తయారీ సామర్థ్యం ఎక్కువ ఉండడమే ఈ పరిస్థితికి కారణం. తూర్పు, మధ్య భారత్‌లో ప్లాంట్ల వినియోగం 80 శాతంగా ఉంది’ అని అన్నారు. జీఎస్టీ అమలైతే సిమెంటు పరిశ్రమకు ప్రయోజనమేనని చెప్పారు.
విస్తరణకు రూ.12,700 కోట్లు..
జేఎస్‌డబ్ల్యు సిమెంట్ 2020 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 కోట్ల టన్నులకు చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందుకుగాను రూ.12,700 కోట్లు వెచ్చించనున్నట్టు రాహుల్ అక్కర తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్లాంటుతోపాటు మహారాష్ట్ర, కర్నాటకలో ఉన్న ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 70 లక్షల టన్నులు. కొత్తగా పశ్చిమ బెంగాల్, ఒడిషా, కర్నాటక, మధ్యప్రాచ్య దేశంలోనూ ప్లాంటును నెలకొల్పుతోంది. కాంక్రీల్ హెచ్‌డీ ఉత్పాదనకై పేటెంటుకు దరఖాస్తు చేసుకున్నట్టు రాహుల్ వెల్లడించారు.