సెక్యూరిటీ సిబ్బంది దాడిలో గాయపడిన శ్రీనివాసరావు
దాచేపల్లి (గురజాల): సిమెంట్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కర్పూరపు వెంకటకోటయ్యపై సెక్యూరిటీ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదగార్లపాడు గ్రామ సమీపంలోని చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమ వద్ద బుధవారం జరిగింది. బాధితుడు వెంకటకోటయ్య, స్థానికుల కథనం ప్రకారం.. చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న తమకు యాజమాన్యం జీతాలు చెల్లించడంలేదని, లాక్‌డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పలువురు కార్మికులు పెదగార్లపాడు వైఎస్సార్‌సీపీ నేత వెంకటకోటయ్యతో చెప్పుకున్నారు. సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు వెంకటకోటయ్య, అతని కుమారుడు శ్రీనివాసరావు బుధవారం పరిశ్రమ ప్రధానగేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న టీడీపీ నాయకుడిని సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేయకుండా, విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకం చేయించకుండా లోపలికి పంపించారు.
వెంకటకోటయ్యను మాత్రం సంతకం చేసి సెల్‌ఫోన్ తమకు అప్పగించిన తరువాతే లోపలికి వెళ్లాలని చెప్పారు. టీడీపీ నాయకుడిని పంపించి తననెందుకు పంపించరని అడుగుతున్న వెంకటకోటయ్యపై సెక్యూరిటీ సిబ్బంది, పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధికారి శివశంకర్ దుర్భాషలాడుతూ పిడిగుద్దులు, లాఠీకర్రలతో దాడికి తెగబడ్డారు. వెంకటకోటయ్య స్పృహతప్పి పడిపోయాడు.
వెంకటకోటయ్య కుమారుడు శ్రీనివాసరావుపై కూడా సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పరిశ్రమ వద్దకు చేరుకుని వెంకటకోటయ్యపై దాడిచేసిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని వెంకటకోటయ్యపై దాడికి పాల్పడిన శివశంకర్‌తో పాటుగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వెంకటకోటయ్య, శ్రీనివాసరావును పిడుగురాళ్లలోని వేట్ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment