ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో దేశీ కార్పొరేట్లు ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలవని రేటింగ్ దిగ్గజం క్రిసిల్ రూపొందించిన నివేదిక అంచనా వేసింది. క్యూ4(జనవరి–మార్చి)లో ఆదాయం 15–17 శాతం స్థాయిలో పుంజుకోగలదని పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో 55–60 శాతం వాటాను ఆక్రమిస్తున్న ప్రధాన కంపెనీలపై క్రిసిల్ నివేదికను రూపొందించింది. క్యూ4లో వీటి ఆదాయం రూ. 6.9 లక్షల కోట్లకు చేరవచ్చని తెలియజేసింది.
గత 8 త్రైమాసికాలుగా క్షీణత లేదా స్వల్ప పురోగతి చూపుతున్న కంపెనీలు తిరిగి రెండంకెల వృద్ధిని అందుకునే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఇందుకు ప్రధానంగా అంతక్రితం(2019–20) క్యూ4లో తక్కువ వృద్ధి(లో బేస్) నమోదుకావడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ప్రొడక్టులకు మెరుగైన ధరలు లభించడం కూడా దోహదం చేయనున్నట్లు తెలియజేసింది. ఫైనాన్షియల్ సర్వీసులు, చమురు కంపెనీలను మినహాయించి ఎన్‌ఎస్‌ఈలోని టాప్– 300 కంపెనీల క్యూ4 ఫలితాలపై రేటింగ్ దిగ్గజం క్రిసిల్ రూపొందించిన నివేదికలోని ఇతర అంశాలు..
రికవరీ దన్ను..: గతేడాది ద్వితీయార్థంలో కనిపించిన రికవరీ కారణంగా అంతక్రితం ఏడాది(2020)లో నమోదైన ఆదాయంతో పోలిస్తే 2021లో 300 కంపెనీల టర్నోవర్ 0.5 శాతం మాత్రమే తక్కువగా నమోదయ్యే వీలుంది. అయితే నిర్వహణ లాభం 28–30 స్థాయిలో జంప్ చేయనుంది. 2020 క్యూ4లో మందగమనం కారణంగా లాభాల్లో అధిక వృద్ధికి అవకాశముంది. 2021 చివరి త్రైమాసికంలో కమోడిటీల ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ వ్యయాలు, ధరలు మెరుగుపడటం కంపెనీలకు లాభించనుంది. రికవరీలో ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసులు, నిర్మాణ రంగం 50 శాతం వాటాను ఆక్రమించనున్నట్లు క్రిసిల్ నివేదికను రూపొందించిన టీమ్ లీడ్ హెటల్ గాంధీ పేర్కొన్నారు. 2020–21లో 300 కంపెనీల ఆదాయం రూ. 23.8 లక్షల కోట్లను తాకవచ్చని అంచనా వేశారు.
స్టీల్, సిమెంట్ జోరు
నివేదిక ప్రకారం గతేడాది 17–18 శాతం ఆదాయ వృద్ధిలో నిర్మాణ రంగ సంబంధ స్టీల్, సిమెంట్ తదితరాలు 45–50 శాతం పురోగతిని సాధించనున్నాయి. అమ్మకాల పరిమాణం, ధరలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. దేశీయంగా ఫ్లాట్ స్టీల్, సిమెంట్ ధరలు వరుసగా 32 శాతం, 2 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే అన్ని విభాగాలలోనూ ఇదే తరహా జోరుకు ఆస్కారంలేదు. విచక్షణ ఆధార వినియోగ విభాగాలైన ఎయిర్‌లైన్స్ తదితర రంగాలు 30 శాతం క్షీణతను చవిచూడనున్నాయి. కోవిడ్–19తో సామాజిక దూరం, ప్రయాణాల రద్దు వంటి అంశాలు దెబ్బతీయనున్నాయి.
ఆటో స్పీడ్...
లో బేస్ కారణంగా ఆటోమొబైల్ అమ్మకాలు 45–47 శాతం జంప్‌చేయనున్నాయి. భారత్–6 నిబంధల అమలుతో ధరలు మెరుగుపడ్డాయి. దీంతో ఆటో విడిభాగాల కంపెనీల ఆదాయం 26–28 శాతం స్థాయిలో పుంజుకోనుంది. ఐటీ సర్వీసులు, ఫార్మా 6 శాతం పురోగతిని సాధించనుండగా.. నిర్మాణ రంగం 10 శాతం క్షీణతను చవిచూడనుంది. ప్రభుత్వ వ్యయాలు పెరిగినప్పటికీ తొలి అర్ధభాగంలో నమోదైన క్షీణత దెబ్బతీయనుంది. స్వచ్ఛంద వినియోగ ఆధారిత ప్రొడక్టులు, సర్వీసుల విభాగాలు సైతం 10–12 శాతం తిరోగమించనున్నాయి. టెలికం సర్వీసులు స్వల్పంగా 2 శాతం వెనకడుగు వేయవచ్చు. ముడిచమురు పెరుగుదలతో పెట్రోకెమికల్ కంపెనీల ఆదాయం 40–45 శాతం జంప్‌చేయనుంది. అల్యూమినియం రంగం 15 శాతం వృద్ధిని సాధించనుంది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, విద్యుదుత్పాదన 7–5 శాతం మధ్య బలపడే అవకాశముంది. అయితే కమోడిటీల ధరలు పెరగడంతో త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని కిసిల్ అసోసియేట్ డైరెక్టర్ మయూర్ పాటిల్ తెలియజేశారు. స్టీల్, సహజరబ్బర్, ముడిచమురు తదితరాల ధరలు 2020 మార్చితో పోలిస్తే రెండంకెల్లో పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment