Gold Demand Trends
-
పసిడికి పెరిగిన డిమాండ్
ముంబై: దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 248.3 టన్నులుగా నమోదైంది. ముఖ్యంగా సుంకం తగ్గింపు ఆభరణాల కొనుగోళ్లను పెంచినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ‘2024 క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదిక తెలిపింది. ‘‘బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరడంతో.. ధరలు తగ్గే వరకు కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించొచ్చు. దీంతో పూర్తి ఏడాదికి (2024) బంగారం డిమాండ్ 700–750 టన్నుల మేర ఉంటుంది. గతేడాదితో పోలి్చతే కొంత తక్కువ. 2024 చివరి త్రైమాసికంలో ధనత్రయోదశి, వివాహాల సీజన్ మొత్తం మీద బంగారం డిమాండ్‌కు ఊతంగా నిలుస్తాయి’’అని ఈ నివేదిక తెలిపింది. 2023లో బంగారం డిమాండ్ 761 టన్నులుగా ఉంది. ధనత్రయోదశి సందర్భంగా డిమాండ్ పెరగడంతో మంగళవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.81,400కు చేరడం గమనార్హం. ఇక విలువ పరంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 53 శాతం పెరిగి రూ.1,65,380 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,07,700 కోట్లుగా ఉంది. బంగారం, వెండి దిగుమతులపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి బడ్జెట్లో తగ్గించడం తెలిసిందే. బంగారం దిగుమతులు 22% జంప్ పస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో 22 శాతం అధికంగా 27 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బంగారం దిగుమతులు 22 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్ దిగుమతులు పెరగడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అత్యధికంగా స్విట్జర్లాండ్ 40 శాతం మేర మన దేశానికి బంగారం ఎగుమతి చేయగా, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా ఆక్రమించాయి. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం దిగుమతుల వాటా 5 శాతంగా ఉంటుంది. బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మొదటి ఆరు నెలల్లో (సెప్టెంబర్ చివరికి) 137.44 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్య లోటు 119.24 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. బంగారానికి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారుగా భారత్ ఉంటోంది. వెండి దిగుమతులు సైతం 376 శాతం పెరిగి 2.3 బిలియన్ డాలర్లుగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి నమోదయ్యాయి. కరెంటు ఖాతా లోటు ఒక శాతం ఎగసి 9.7 బిలియన్ డాలర్లకు చేరింది. -
పసిడి డిమాండ్‌కు ధరల చెక్
ముంబై: భారత్‌లో పసిడి పరిమాణం డిమాండ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతానికిపైగా పతనమైంది. 2023 ఇదే కాలంతో పోలి్చతే డిమాండ్ పరిమాణం 158.1 టన్నుల నుంచి 149.7 టన్నులకు పడిపోయింది. అధిక ధరలు, దీనితో కొనుగోళ్లు త్గగడం దీనికి కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) జూన్ త్రైమాసిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. ఈ నెల 23వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కస్టమ్స్ సుంకాలను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధరలు భారీగా పడిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి డిమాండ్‌కు ఏమాత్రం దోహదపడిందన్న అంశం ఆగస్టు త్రైమాసికంలో తెలియనుంది. తాజా డబ్ల్యూజీసీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... → జూన్ త్రైమాసికం డిమాండ్ పరిమాణంలో తగ్గినా.. విలువలో మాత్రం 17 శాతం పెరిగి రూ.82,530 కోట్ల నుంచి రూ.93,850 కోట్లకు ఎగసింది. → 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.74,000 దాటితే, సగటు ధర ఇదే కాలంలో రూ.52,191.60 నుంచి రూ.62,700.50కు ఎగసింది. (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా). అంతర్జాతీయంగా చూస్తే, ఔన్స్ (31.1గ్రాములు) ధర ఇదే కాలంలో 1,975.9 డాలర్ల నుంచి 2,338.2 డాలర్లకు ఎగసింది. (అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయర్క్ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో జూలై 16వ తేదీన ఔన్స్ ధర ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన సంగతి తెలిసిందే) → ఇక జూన్ త్రైమాసికంలో ఆభరణాలకు పరిమాణ డిమాండ్ 17 శాతం పడిపోయి 128.6 టన్నుల నుంచి 106.5 టన్నులకు చేరింది. → ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మాత్రం ఇదే కాలంలోలో 46 శాతం పెరిగి 29.5 టన్నుల నుంచి 43.1 టన్నులకు ఎగసింది. → రీసైకిల్డ్ గోల్డ్ పరిమాణం 39 శాతం తగ్గి 37.6 టన్నుల నుంచి 23 టన్నులకు పడింది. → దిగుమతులు 8 శాతం పెరిగి 182.3 టన్నుల నుంచి 196.9 టన్నులకు ఎగసింది.గ్లోబల్ డిమాండ్ 4 శాతం అప్మరోవైపు అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ జూన్ త్రైమాసికంలో 4 శాతం పెరిగి 1,207.9 టన్నుల నుంచి 1,258.2 టన్నులకు ఎగసింది. హోల్‌సేల్, స్పాట్‌సహా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, ఈటీఎఫ్ అవుట్ఫోస్లో మందగమనం దీనికి కారణం. గోల్డ్ సరఫరా 4 శాతం పెరిగి 929 టన్నులుగా ఉంది.ఎదురుగాలిలోనూ ముందుకే.. బంగారానికి ఎదురుగాలి వీసే అవకాశం ఉంది. అయినప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి, ఇవి బంగారం డిమాండ్‌కు మద్దతునిస్తాయి. డిమాండ్‌ను మరింత పెంచుతాయి. – లూయిస్ స్ట్రీట్, డబ్ల్యూజీసీ సీనియర్ మార్కెట్స్ విశ్లేషకురాలు -
World Gold Council 2023: పడినా... పసిడిది పైచేయే..!
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2023లో 3 శాతం క్షీణించి 747.5 టన్నులకు చేరుకుంది. అయితే ధరలు తగ్గుముఖం పట్టి, అస్థిర పరిస్థితులు తొలగిపోయిన పక్షంలో డిమాండ్ రానున్న కాలంలో 800–900 టన్నుల మధ్య ఉండవచ్చు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన 2023 ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. 2022లో భారత్ మొత్తం పసిడి డిమాండ్ 774.1 టన్నులు. నివేదికలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే... ► పెరుగుతున్న బంగారం ధరలకు తోడు ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు 2023 డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. కొనుగోళ్లపట్ల వినియోగదారుల ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాణిజ్య సెంటిమెంట్ బలహీనంగా ఉంది. 2023 మే 4వ తేదీన దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర కొత్త గరిష్టం రూ.61,845కు చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఔన్స్ 2,083 డాలర్లకు ఎగసింది. ఇక దేశీయ మార్కెట్లో ధర నవంబర్ 16న మరో కొత్త గరిష్టం రూ.61,914కు చేరింది. ► 2019 నుండి బంగారం డిమాండ్ 700–800 టన్నుల శ్రేణిలోనే ఉంటోంది. తగ్గిన డిమాండ్, నిరంతర ధరలు అలాగే సుంకాల పెరుగుదల, స్టాక్ మార్కెట్ పనితీరు, సమీప కాల ఎన్నికల ఖర్చు ప్రభావం దీనికి కారణం. అయితే భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ధరలు అధిక స్థాయిలోనే ఉంటాయన్న విషయాన్ని మార్కెట్ జీరి్ణంచుకుంటుండడం ఈ సానుకూల అంచనాలకు కారణం. ► ఇక మొత్తం ఆభరణాల డిమాండ్ 6 శాతం తగ్గి 562.3 టన్నులకు పడింది. 2022లో ఈ పరిమాణం 600.6 టన్నులు. ► పెట్టుబడుల డిమాండ్ మాత్రం 7 శాతం పెరిగి 173.6 టన్నుల నుంచి 185.2 టన్నులకు ఎగసింది. దిగుమతులు 20 శాతం అప్ కాగా మొత్తం పసిడి దిగుమతులు 2023లో 20 శాతం పెరిగి 650.7 టన్నుల నుంచి 780.7 టన్నులకు ఎగశాయి. 2024లో డిమాండ్‌కన్నా పసిడి దిగుమతులు అధికంగా ఉండే అవకాశం ఉందని అవుట్‌లుక్ ఆవిష్కరణ సందర్భంగా డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) పీఆర్ సోమశేఖర్ పేర్కొన్నారు. భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) దీనికి కారణం అవుతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో 26.7 శాతం పెరిగి 35.95 బిలియన్ డాలర్లకు పసిడి దిగుమతులు చేరుకున్నట్లు నివేదిక వివరించింది. భారీ డిమాండ్ దీనికి కారణం. ప్రపంచ డిమాండ్ కూడా 5 శాతం డౌన్ ఇదిలావుండగా, 2023లో ప్రపంచ పసిడి డిమాండ్ 5 శాతం తగ్గి 4,448.4 టన్నులకు పడినట్లు నివేదిక పేర్కొంది. ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) భారీ ఉపసంహరణలు దీనికి కారణం. నివేదిక ప్రకారం ఇలాంటి పరిస్థితి వరుసగా ఇది మూడవ సంవత్సరం. ఈటీఎఫ్‌ల ఉపసంహరణల పరిమాణం 2022లో 109.5 టన్నులు. అయితే 2023లో ఈ పరిమాణం ఏకంగా 244.4 టన్నులకు ఎగసింది. కాగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 2022లో 1,082 టన్నులు అయితే 2023లో ఈ పరిమాణం 45 టన్నులు తగ్గి 1,037 టన్నులకు పడింది. అయితే సెంట్రల్ బ్యాంకుల అత్యధిక కొనుగోళ్లకు సంబంధించి ఈ రెండు సంవత్సరాలూ రికార్డుగా నిలిచాయి. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ తన పసిడి నిల్వలను 2022లో 32 టన్నులు పెంచుకుంటే, 2023లో 16.2 టన్నులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత్ దాదాపు 600 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ మారకపు ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా 48 బిలియన్ డాలర్లు. -
బంగారం డిమాండ్ పదిలం!
ముంబై: బంగారం డిమాండ్ మళ్లీ పుంజుకుంటోంది. 2021 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పసిడి డిమాండ్ 47 శాతం పెరిగింది. పరిమాణంలో 139.1 టన్నులుగా నమోదయ్యింది. మహమ్మారి సవాళ్ల తగ్గి, ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారానికి తిరిగి వినియోగ డిమాండ్ ఏర్పడుతున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. డబ్ల్యూజీసీ ఆవిష్కరించిన క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2021 నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం డిమాండ్ 94.6 టన్నులు. అప్పటితో పోల్చితే 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరింది. విలువ పరంగా, భారతదేశం మూడవ త్రైమాసిక బంగారం డిమాండ్ 37 శాతం పెరిగి రూ. 59,330 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.43,160 కోట్లు. ► ఇది తక్కువ బేస్ ఎఫెక్ట్ అలాగే సానుకూల వాణిజ్యం, వినియోగదారుల మనోభావాల మేళవింపును ఇది ప్రతిబింబిస్తుంది. వ్యాక్సినేషన్ విస్తృతి, ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన పురోగతి బంగారం కొనుగోళ్లు భారీగా పెరగడానికి కారణం. ► దేశవ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నందున, రిటైల్ డిమాండ్ కోవిడ్–పూర్వ స్థాయికి పుంజుకుంది. రాబోయే పండుగలు, వివాహాల సీజన్‌తో బంగారం డిమాండ్ మరింత పెరిగే వీలుంది. బంగారానికి ఇంతటి డిమాండ్ నెలకొనడం కోవిడ్ మహమ్మారి సవాళ్లు విసరడం ప్రారంభించిన తర్వాత ఇదే మొదటిసారి. ► డిజిటల్ బంగారానికి డిమాండ్ పలు రెట్లు పెరిగింది. వినూత్న సాంకేతిక చొరవలు, ప్రముఖ ఆభరణాల యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల వంటి అంశాలు ఆన్లైన్ కొనుగోళ్లను ఇష్టపడే కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సంఖ్యను పెంచడానికి గణనీయంగా దోహదపడుతుండడం గమనార్హం. ► రాబోయే నెలల్లో కమోడిటీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రావాణా వ్యయాలు భారం పెరుగుతుంది. ఆయా అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది దీర్ఘకాలంలో బంగారం డిమాండ్ మరింత పటిష్టం కావడానికి కలిసివచ్చే అంశం. ► సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం ఆభరణాల డిమాండ్ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది. 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ పరిమాణం 60.8 టన్నులు. విలువలో ఆభరణాల డిమాండ్ 48 శాతం పెరిగి రూ.41,030 కోట్లకు చేరింది, ఇది ఏడాది క్రితం రూ.27,750 కోట్లు. ► మూడవ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడి డిమాండ్ 27 శాతం పెరిగి 42.9 టన్నులకు చేరుకుంది. 2020 అదే త్రైమాసికంలో ఈ డిమాండ్ 33.8 టన్నులు. విలువ పరంగా, జూలై–సెప్టెంబర్‌లో బంగారం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 19 శాతం పెరిగి రూ.18,300 కోట్లకు చేరుకుంది.ఇది ఏడాది క్రితం రూ.15,410 కోట్లు. ► సమీక్షా కాలంలో భారతదేశంలో రీసైకిల్ చేసిన మొత్తం బంగారం 50 శాతం క్షీణించి 20.7 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 41.5 టన్నులు. బంగారం రీసైక్లింగ్‌లో 50 శాతం తగ్గుదలను పరిశీలిస్తే, బంగారాన్ని విక్రయించడం కంటే బంగారాన్ని కలిగి ఉండాలనే బలమైన వినియోగదారు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ► బలమైన సంస్థాగత మార్కెట్ల దన్నుతో బంగారంపై రుణాల మార్కెట్ కూడా భారీగా పెరుగుతుండడం గమనార్హం. ► పన్నులు లేకుండా మొత్తం నికర బులియన్ దిగుమతులు మూడవ త్రైమాసికంలో 187 శాతం పెరిగి 255.6 టన్నులకు చేరింది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ పరిమాణం 89 టన్నులు. ► మూడో త్రైమాసికంలో బంగారం ధర సగటున 10 గ్రాములకు రూ.42,635గా ఉంది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ ధర రూ.45,640. 2021 ఏప్రిల్–జూన్‌లో సగటు ధర రూ.43,076. ► వివిధ కొనుగోలుదారు–విక్రేతల సమావేశాల సందర్భంలో వచ్చిన అభిప్రాయాలను, పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలనూ పరిశీలిస్తే నాల్గవ త్రైమాసికం పండుగ సీజన్లో పసిడి డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. దిగుమతులూ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా డౌన్ మరోవైపు అంతర్జాతీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 7 శాతం తగ్గింది. డిమాండ్ 831 టన్నులకు తగ్గినట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. గోల్డ్ ఎక్ఛ్సేంజ్ ట్రేడెట్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) నుంచి భారీగా డబ్బు వెనక్కు వెళ్లినట్లు గణాంకాలు వెల్లడించాయి. మూడవ త్రైమాసికంలో సగటున ఔన్స్ (31.1గ్రాములు) ధర 6 శాతం తగ్గి, 1,790 డాలర్లకు చేరింది. 2020 ఇదే కాలంలో ఈ ధర 1,900 డాలర్లు. ఆభరణాలకు డిమాండ్ 33 శాతం పెరిగి 443 టన్నులకు చేరింది. టెక్నాలజీలో పసిడి వినియోగం 9 శాతం పెరిగి 83.8 టన్నులకు ఎగసింది. సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను మొత్తంగా 69 టన్నులు పెంచుకున్నాయి. 2020 ఇదే కాలంలో 10 టన్నుల విక్రయాలు జరిపాయి. కాగా సరఫరాలు మాత్రం మూడు శాతం తగ్గి 1,279 డాలర్ల నుంచి 1,239 డాలర్లకు పడింది. -
భారత్-2022.. బంగారానికి భారీ డిమాండ్!
ముంబై: భారత్‌లో పసిడికి 2022లో భారీ డిమాండ్ నెలకొనే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి(వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) పేర్కొంది. అయితే కోవిడ్–19 సంబంధ సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో 2021 మాత్రం బంగారం డిమాండ్ తగ్గిపోతోందని నివేదిక అభిప్రాయపడింది. ‘భారత్‌లో బంగారం డిమాండ్‌కు చోదకాలు’(డబ్ల్యూజీసీ నివేదిక) శీర్షికన విడుదలైన నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► కోవిడ్–19తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో 2021 ముగిసేలోపు పసిడి డిమాండ్ ఊహించినదానికన్నా ఎక్కువగా పడిపోయే వీలుంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు క్రమంగా సడలిపోతున్న నేపథ్యంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడే వీలుంది. 2022 నాటికి డిమాండ్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► అయితే కరోనా మూడవ వేవ్ సవాళ్లు తలెత్తితే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ► భారత్ పసిడి పరిశ్రమల మరింత పారదర్శకత, ప్రమాణాల దిశగా అడుగులు వేయాలి. ఈ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించాలి. తద్వారా దేశంలోని యువత, సామాజిక మార్పుల వల్ల ఈ పరిశ్రమ మరెంతగానో పురోగమించే అవకాశం ఉంది. ► భారత్‌లో బంగారం డిమాండ్‌కు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. గృహ పొదుపురేట్లు పడిపోతుండడం, వ్యవసాయ వేతనాలపై కోవిడ్–19 ప్రభావం వంటివి ఇందులో ఉన్నాయి. ► అయితే ఈ సవాళ్లు స్వల్పకాలికమైనవేనని భావిస్తున్నాం. కోవిడ్ సవాళ్లు కొనసాగుతున్నా.. పసిడి దిగుమతులు భారీగా పెరుగుతుండడం గమనార్హం. రిటైల్ డిమాండ్ క్రమంగా ఊపందుకునే అవకాశం ఉంది.. అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన నివేదికలో పేర్కొంది. ఇక బంగారం ధర, రుతుపవనాలు, పన్నుల్లో మార్పులు, ద్రవ్యోల్బణం వంటివి బంగారం డిమాండ్‌పై స్వల్పకాలంలో ప్రభావితం చూపే అంశాలు. అయితే, గృహ ఆదాయం, పసిడిపై పన్నులు దీర్ఘకాలిక డిమాండ్‌ని నడిపిస్తాయి. చదవండి: బంగారం మీద ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా? -
డిమాండ్ బంగారమే..!
ముంబై: భారత్‌లో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. దిగుమతి సుంకాలు తగ్గించకపోయినా, పుత్తడి డిమాండ్ తగ్గడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక పేర్కొంది. అయితే పెట్టుబడి పరంగా పుత్తడి ఆకర్షణ తగ్గుతోందని వివరించింది. భారత్‌లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి బంగారం డిమాండ్ 39 శాతం వృద్ధి చెందిందని తెలిపింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 161.6 టన్నులుగా ఉన్న భారత్‌లో పుత్తడి డిమాండ్ ఆభరణాల అమ్మకాలు పెరగడం వల్ల ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు 39 శాతం వృద్ధితో 225.1 టన్నులకు పెరిగిందని వివరించింది. విలువ పరంగా చూస్తే ఈ డిమాండ్ 31 శాతం వృద్ధితో 42,830 కోట్ల నుంచి రూ.56,219 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డబ్ల్యూజీసీ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ పేరుతో వెలువడిన ఈ నివేదిక ప్రకారం..., ఆభరణాలకు డిమాండ్ 115 టన్నుల నుంచి 60 శాతం వృద్ధితో 183 టన్నులకు పెరిగింది. విలువ పరంగా చూస్తే రూ.30,347 కోట్ల నుంచి 51 శాతం వృద్ధితో రూ.45,682 కోట్లకు చేరింది. అయితే పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ మాత్రం 10% తగ్గింది. ఈ డిమాండ్ 47 టన్నుల నుంచి 42 టన్నులకు తగ్గింది. విలువ పరంగా చూస్తే ఇది రూ.12,483 కోట్ల నుంచి రూ.10,538 కోట్లకు తగ్గింది. పుత్తడి దిగుమతులపై ఆంక్షలు, సుంకాల పెంపు వంటి అంశాల కారణంగా గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి బంగారం ఆభరణాలకు డిమాండ్ బాగా తగ్గింది. దీపావళి పండుగ సందర్భంగా డిమాండ్ పెరగడం, దేశంలో బంగారంపై ఉన్న సాధారణ మమకారాన్ని ప్రతిఫలిస్తోంది. కొత్త ప్రభుత్వం సుంకాలను తగ్గిస్తుందని, విధానాలను సరళీకరిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగకపోయినప్పటికీ పుత్తడి డిమాండ్ పెరిగింది. పుత్తడి డిమాండ్‌పై దిగుమతి ఆంక్షల ప్రభావం స్వల్పమేనని పెరుగుతున్న ఈ డిమాండ్ సూచిస్తోంది. పైగా ఈ ఆంక్షల కారణంగా అక్రమ పద్ధతుల్లో బంగారం దేశంలోకి రావడం అధికమైంది. ఈ పూర్తి ఏడాదికి భారత్‌లో పుత్తడి డిమాండ్ 850-950 టన్నుల రేంజ్లో ఉండొచ్చు. సాధారణంగా అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ సంప్రదాయకంగా పుత్తడికి కీలకమైన క్వార్టర్ అని చెప్పవచ్చు. దీంతో క్యూ3లో కంటే క్యూ4లో డిమాండ్ మరింతగా పెరగవచ్చు. దాదాపు సంవత్సర కాలం నుంచి తగ్గుతున్న ధరల కారణంగా డిమాండ్ మరింతగా పెరగవచ్చు. ధరల తగ్గుల ఇలాగే కొనసాగితే, పుత్తడి పెట్టుబడులు కూడా మరింతగా పెరుగుతాయి. క్యూ3లో అంతర్జాతీయంగా మాత్రం పుత్తడికి డిమాండ్ 953 కోట్ల టన్నుల నుంచి 2 శాతం క్షీణతతో 929 టన్నులకు తగ్గింది. చైనాలో ఆభరణాలకు డిమాండ్ తగ్గడమే దీనికి కారణం. ఆభరణాలకు డిమాండ్ 556 టన్నుల నుంచి 4 శాతం తగ్గి 534 టన్నులకు చేరింది. ఆర్థిక రికవరీ కారణంగా అమెరికా, ఇంగ్లాండ్‌ల్లో డిమాండ్ పటిష్టంగా ఉంది. చైనాలో ఈ డిమాండ్ 39 శాతం తగ్గింది. గత క్యూ3లో 102 టన్నులుగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల పుత్తడి కొనుగోళ్లు ఈ క్యూ3లో 93 టన్నులకు తగ్గాయి. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం ఇది వరుసగా 15వ క్వార్టర్ కావడం విశేషం. బంగారం రీసైక్లింగ్ ఏడేళ్ల కనిష్టానికి చేరింది.