డిమాండ్ బంగారమే..!
ముంబై: భారత్‌లో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. దిగుమతి సుంకాలు తగ్గించకపోయినా, పుత్తడి డిమాండ్ తగ్గడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక పేర్కొంది. అయితే పెట్టుబడి పరంగా పుత్తడి ఆకర్షణ తగ్గుతోందని వివరించింది. భారత్‌లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి బంగారం డిమాండ్ 39 శాతం వృద్ధి చెందిందని తెలిపింది.
గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 161.6 టన్నులుగా ఉన్న భారత్‌లో పుత్తడి డిమాండ్ ఆభరణాల అమ్మకాలు పెరగడం వల్ల ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు 39 శాతం వృద్ధితో 225.1 టన్నులకు పెరిగిందని వివరించింది. విలువ పరంగా చూస్తే ఈ డిమాండ్ 31 శాతం వృద్ధితో 42,830 కోట్ల నుంచి రూ.56,219 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
డబ్ల్యూజీసీ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ పేరుతో వెలువడిన ఈ నివేదిక ప్రకారం...,
ఆభరణాలకు డిమాండ్ 115 టన్నుల నుంచి 60 శాతం వృద్ధితో 183 టన్నులకు పెరిగింది. విలువ పరంగా చూస్తే రూ.30,347 కోట్ల నుంచి 51 శాతం వృద్ధితో రూ.45,682 కోట్లకు చేరింది.
అయితే పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ మాత్రం 10% తగ్గింది. ఈ డిమాండ్ 47 టన్నుల నుంచి 42 టన్నులకు తగ్గింది. విలువ పరంగా చూస్తే ఇది రూ.12,483 కోట్ల నుంచి రూ.10,538 కోట్లకు తగ్గింది.
పుత్తడి దిగుమతులపై ఆంక్షలు, సుంకాల పెంపు వంటి అంశాల కారణంగా గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి బంగారం ఆభరణాలకు డిమాండ్ బాగా తగ్గింది.
దీపావళి పండుగ సందర్భంగా డిమాండ్ పెరగడం, దేశంలో బంగారంపై ఉన్న సాధారణ మమకారాన్ని ప్రతిఫలిస్తోంది.
కొత్త ప్రభుత్వం సుంకాలను తగ్గిస్తుందని, విధానాలను సరళీకరిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగకపోయినప్పటికీ పుత్తడి డిమాండ్ పెరిగింది. పుత్తడి డిమాండ్‌పై దిగుమతి ఆంక్షల ప్రభావం స్వల్పమేనని పెరుగుతున్న ఈ డిమాండ్ సూచిస్తోంది. పైగా ఈ ఆంక్షల కారణంగా అక్రమ పద్ధతుల్లో బంగారం దేశంలోకి రావడం అధికమైంది.
ఈ పూర్తి ఏడాదికి భారత్‌లో పుత్తడి డిమాండ్ 850-950 టన్నుల రేంజ్‌లో ఉండొచ్చు.
సాధారణంగా అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ సంప్రదాయకంగా పుత్తడికి కీలకమైన క్వార్టర్ అని చెప్పవచ్చు. దీంతో క్యూ3లో కంటే క్యూ4లో డిమాండ్ మరింతగా పెరగవచ్చు.
దాదాపు సంవత్సర కాలం నుంచి తగ్గుతున్న ధరల కారణంగా డిమాండ్ మరింతగా పెరగవచ్చు. ధరల తగ్గుల ఇలాగే కొనసాగితే, పుత్తడి పెట్టుబడులు కూడా మరింతగా పెరుగుతాయి.
క్యూ3లో అంతర్జాతీయంగా మాత్రం పుత్తడికి డిమాండ్ 953 కోట్ల టన్నుల నుంచి 2 శాతం క్షీణతతో 929 టన్నులకు తగ్గింది. చైనాలో ఆభరణాలకు డిమాండ్ తగ్గడమే దీనికి కారణం. ఆభరణాలకు డిమాండ్ 556 టన్నుల నుంచి 4 శాతం తగ్గి 534 టన్నులకు చేరింది. ఆర్థిక రికవరీ కారణంగా అమెరికా, ఇంగ్లాండ్‌ల్లో డిమాండ్ పటిష్టంగా ఉంది. చైనాలో ఈ డిమాండ్ 39 శాతం తగ్గింది.
గత క్యూ3లో 102 టన్నులుగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల పుత్తడి కొనుగోళ్లు ఈ క్యూ3లో 93 టన్నులకు తగ్గాయి. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం ఇది వరుసగా 15వ క్వార్టర్ కావడం విశేషం. బంగారం రీసైక్లింగ్ ఏడేళ్ల కనిష్టానికి చేరింది.