బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్‌.. ధరల తగ్గుముఖం, పండుగలతో ఊపు! | Gold demand in India rises 10% in July-September on lower prices | Sakshi
Sakshi News home page

బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్‌.. ధరల తగ్గుముఖం, పండుగలతో ఊపు!

Published Wed, Nov 1 2023 7:32 AM | Last Updated on Wed, Nov 1 2023 8:53 AM

Gold demand in india rises 10pc in September on softer prices - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ పసిడి డిమాండ్‌ 2023 క్యాలెండర్‌ ఇయర్‌ మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 10 శాతం పెరిగి 191.7 టన్నుల నుంచి 210.2 టన్నులకు ఎగసింది.  పసిడి కొనుగోళ్లకు పవిత్రమైనదిగా భావించే ధన్‌తేరాస్‌ కొనుగోళ్లు భారీగా జరుగుతాయన్న విశ్వాసాన్ని పరిశ్రమ వ్యక్తం చేస్తోంది. ధరలు కొంత తగ్గడం, పండుగల డిమాండ్‌ దీనికి కారణం.  చైనా తర్వాత పసిడి కొనుగోళ్లకు రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌ సెప్టెంబర్‌ త్రైమాసికం డిమాండ్‌పై ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. 

  • వాణిజ్య వర్గాల అభిప్రాయం ప్రకారం, 10 గ్రాముల ధర రూ.60,000 వరకూ కొంత ఆమోదయోగ్యమైనదిగా వినియోగదారులు భావిస్తున్నారు. అంతకన్నా తక్కువ ధరలో పసిడి భారీ కొనుగోళ్లు జరగొచ్చని అంచనా.  
  • సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్‌ 7 శాతం పెరిగి 146.2 టన్నుల నుంచి 155.7 టన్నులకు చేరింది. ఇదే కాలంలో కడ్డీలు, నాణేల డిమాండ్‌ 20 శాతం ఎగిసి 45.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు ఎగసింది. కడ్డీలు, నాణేల విభాగంలో డిమాండ్‌ 2015 గరిష్ట స్థాయిని చూసింది.  
  • మూడవ త్రైమాసికంలో పసిడి దిగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 184.5 టన్నుల నుంచి 220 టన్నులకు ఎగసింది.  

తొమ్మిది నెలల్లో 481.2 టన్నుల డిమాండ్‌.. 

2023 మొదటి 9 నెలల్లో బంగారం డిమాండ్‌ 481.2 టన్నులు. సంవత్సరం మొత్తంలో డిమాండ్‌ 700–750 టన్నులు ఉంటుందని అంచనా. 2022 డిమాండ్‌ 774 టన్నులతో పోల్చితే  తగ్గడం గమనార్హం.  అయితే దిగుమతులు మాత్రం పెరుగుతాయని అంచనా. 2022లో యల్లో మెటల్‌ దిగుమతులు 650.7 టన్నులు కాగా, 2023 సెప్టెంబర్‌ వరకూ జరిగిన దిగుమతుల విలువ 563 టన్నులు.  

అంతర్జాతీయంగా డిమాండ్‌ 6 శాతం డౌన్‌ 

ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా మూడవ త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ 6 శాతం పడిపోయి 1,147.5 టన్నులకు చేరింది. సెంట్రల్‌ బ్యాంకుల నుంచి తగ్గిన కొనుగోళ్లు, కడ్డీలు, నాణేల డిమాండ్‌ తగ్గడం దీనికి కారణమని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. చైనా డిమాండ్‌ మూడవ త్రైమాసికంలో 242.7 టన్నుల నుంచి స్వల్పంగా 247 టన్నులకు ఎగసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement