ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2020లో భారీగా 35 శాతం పడిపోయింది. 446.4 టన్నులుగా నమోదయ్యింది. 2019లో 690.4 టన్నులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కఠిన లాక్‌డౌన్ పరిస్థితులు, ఉపాధి అవకాశాలకు అవరోధాలు, ఆదాయాలు పడిపోవడం, అధిక ధరలు వంటి పలు అంశాలు దీనికి కారణం. అయితే పటిష్ట ఆర్థిక రికవరీ నేపథ్యంలో 2021లో తిరిగి బంగారం డిమాండ్ పుంజుకునే అవకాశం ఉంది. అధిక స్థాయికి చేరిన ఈక్విటీ మార్కెట్లు, తక్కువ స్థాయి వడ్డీరేట్లు కూడా ఇందుకు దోహదపడతాయి. ‘‘2020 పసిడి డిమాండ్ ధోరణులు’’ అన్న శీర్షికన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాలను తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
► 2020లో విలువ రూపంలో పసిడి డిమాండ్ 14 శాతం పడిపోయి రూ.1,88,280 కోట్లకు చేరింది. 2019లో ఈ విలువ రూ.2,17,770 కోట్లు.
► ఆభరణాల డిమాండ్ పరిమాణం రూపంలో 42 శాతం పడిపోయి 544.6 టన్నుల నుంచి 315.9 టన్నులకు చేరింది. ఇందుకు సంబంధించి విలువ 22.42 శాతం తగ్గి రూ.1,71,790 కోట్ల నుంచి రూ.1,33,260 కోట్లకు పడింది.
► పసిడి దిగుమతులు 47 శాతం పడిపోయి 646.8 టన్నుల నుంచి 344.2 టన్నులకు చేరాయి. అయితే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 19 శాతం పెరిగి (2019 ఇదే కాలంతో పోల్చి) చేరడం గమనార్హం. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు దీనికి కారణం.
► 2020 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ కేవలం 4శాతం పడిపోయి పరిమాణం 194.3 టన్నుల నుంచి 186.2 టన్నులకు చేరడం గమనార్హం. వినియోగ సెంటిమెంట్ మెరుగవుతుండడాన్ని ఇది సూచిస్తోంది. పండుగలు, పెండ్లి సీజన్ కూడా దీనికి కలిసి వచ్చింది.
11 సంవత్సరాల కనిష్టానికి గ్లోబల్ గోల్డ్ డిమాండ్
కాగా అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 2020లో 11 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిందని డబ్ల్యూజీసీ నివేదిక వివరించింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్ 3,759.6 టన్నులని పేర్కొంది. 2019లో ఈ పరిమాణం 4,386.4 టన్నులు. 2009లో 3,385.8 టన్నులు. కోవిడ్ 19 ప్రేరిత సవాళ్లే పసిడి డిమాండ్ భారీ పతనానికి కారణమని డబ్ల్యూజీసీ వివరించింది. ఒక్క నాల్గవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) చూస్తే, ఏకంగా పసిడి డిమాండ్ 28 శాతం పడిపోయి 1,082.9 టన్నుల నుంచి 783.4 టన్నులుకు పడింది.
ఒక్క ఆభరణాల డిమాండ్ నాల్గవ త్రైమాసికంలో 13 శాతం పడిపోయి 590.1 టన్నుల నుంచి 515.9 టన్నులకు చేరింది. ఏడాదిలో ఈ డిమాండ్ 34 శాతం పడిపోయి 2,122.7 టన్నుల నుంచి 1,411.6 టన్నులకు కుదేలయ్యింది. కాగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడుల డిమాండ్ 40 శాతం పెరిగి 1,269.2 టన్నుల నుంచి 1,773.2 టన్నులకు ఎగసింది. ఇందులో అధిక వాటా గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ది కావడం గమనార్హం. ఈటీఎఫ్‌ల డిమాండ్ ఏకంగా 120 శాతం పెరిగి 398.3 టన్నుల నుంచి 877.1 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 59 శాతం తగ్గి 668.5 టన్నుల నుంచి 273 టన్నులకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment