బంగారాన్ని కొనడమే మానేశారు.. అందుకు ఇదే కారణం! | Gold demand in April-June quarter falls 7percent due to high prices | Sakshi
Sakshi News home page

బంగారాన్ని కొనడమే మానేశారు.. అందుకు ఇదే కారణం!

Published Wed, Aug 2 2023 4:20 AM | Last Updated on Wed, Aug 2 2023 7:45 AM

Gold demand in April-June quarter falls 7percent due to high prices  - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ పసిడి డిమాండ్‌పై ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) రికార్డు స్థాయి ధరల ప్రతికూల ప్రభావం పడింది. సమీక్షా కాలంలో దేశ పసిడి డిమాండ్‌ 7 శాతంపైగా పతనమై(2022 ఇదే కాలంతో పోల్చి) 158.1 టన్నులకు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. పసిడికి సంబంధించి భారత్‌ రెండవ అతిపెద్ద వినియోగ దేశంగా ఉన్న సంగతి తెలిసిందే.

డిమాండ్‌ తగ్గినప్పటికీ, దిగుమతులు మాత్రం 16 శాతం పెరిగి 209 టన్నులుగా నమోదయినట్లు మండలి పేర్కొంది. 2023 మొదటి ఆరు నెలలూ చూస్తే, భారత్‌ పసిడి డిమాండ్‌ 271 టన్నులు. క్యాలెండర్‌ ఇయర్‌లో 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉంటుందని అంచనా. మండలి భారత్‌ ప్రాంతీయ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సోమసుందరం పీఆర్‌ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే..

► సమీక్షాకాలంలో 10 గ్రాముల పసిడి ధర భారీగా రూ.64,000కు చేరింది. పన్నుల ప్రభావం కూడా దీనికి తోడయ్యింది. వెరసి డిమాండ్‌ భారీగా పడిపోయింది.  

► డిమాండ్‌ 7 శాతం పతనం ఎలా అంటే... 2022 ఏప్రిల్‌–జూన్‌ మధ్య దేశ పసిడి డిమాండ్‌ 170.7 టన్నులు. 2023 ఇదే కాలంలో ఈ పరిమాణం 158.1 టన్నులకు పడిపోయింది.  

► ధరల పెరుగుదల వల్ల విలువల్లో చూస్తే మాత్రం క్యూ2లో పసిడి డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య పసిడి దిగుమతుల విలువ రూ.79,270 కోట్లయితే, 2023 ఇదే కాలంలో ఈ విలువ రూ.82,530 కోట్లకు చేరింది.  

► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, పసిడి డిమాండ్‌ 8 శాతం పడిపోయి 140.3 టన్నుల నుంచి 128.6 టన్నులకు తగ్గింది.  

► 18 క్యారెట్ల పసిడి ఆభరణాలకు మాత్రం డిమాండ్‌ పెరగడం గమనార్హం. ధరలు కొంత అందుబాటులో ఉండడం దీనికి కారణం.  

► కడ్డీలు, నాణేల డిమాండ్‌ 3 శాతం పడిపోయి 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు తగ్గింది.  

► పసిడి డిమాండ్‌లో రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం కూడా కొంత కనబడింది.  

► పసిడి డిమాండ్‌ భారీగా పెరగడంతో రీసైక్లింగ్‌ డిమాండ్‌ ఏకంగా 61 శాతం పెరిగి 37.6 టన్నులకు ఎగసింది.  

► పసిడి ధర భారీ పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి చరిత్రాత్మక ధర వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ ధోరణి!
ఓవర్‌–ది–కౌంటర్‌ లావాదేవీలు (ఓటీసీ– ఎక్సే్చంజీల్లో లిస్టెడ్‌కు సంబంధించిన కొనుగోళ్లు కాకుండా) మినహా గ్లోబల్‌ గోల్డ్‌ డిమాండ్‌ జూన్‌ త్రైమాసికంలో 2 శాతం పడిపోయి 921 టన్నులకు చేరింది.  క్రితం సంవత్సరం ఇదే కాలంలో సగటు  కొనుగోళ్లతో పోలిస్తే సెంట్రల్‌ బ్యాంక్‌ల కొనుగోళ్లు సైతం తగ్గినట్లు మండలి పేర్కొంది.  ఓటీసీ, స్టాక్‌ ఫ్లోలతో సహా, క్యూ2లో మొత్తం గ్లోబల్‌ డిమాండ్‌  మాత్రం 7 శాతం బలపడి 1,255 టన్నులకు చేరుకుంది.  ఇది ప్రపంచవ్యాప్తంగా పటిష్టమైన బంగారం మార్కెట్‌ను సూచిస్తోందని మండలి వివరించింది.

సెంట్రల్‌ బ్యాంకుల డిమాండ్‌ 103 టన్నులు తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. టర్కీలో కొన్ని కీలక ఆర్థిక, రాజకీయ పరిమాణల నేపథ్యంలో జరిగిన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. అయితే మొదటి ఆరు నెలల కాలాన్నీ చూస్తే మాత్రం సెంట్రల్‌ బ్యాంకులు రికార్డు స్థాయిలో 387 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. దీర్ఘకాల సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని మండలి సీనియర్‌ మార్కెట్స్‌ విశ్లేషకులు లూయీస్‌ స్ట్రీట్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అమెరికా, టక్కీలుసహా కీలక మార్కెట్లలో వృద్ధి కారణంగా కడ్డీలు, నాణేల డిమాండ్‌ క్యూ2లో 6 శాతం పెరిగి 277 టన్నులుగా ఉంటే, మొదటి ఆరు నెలలోల 582 టన్నులుగా ఉంది. గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) అవుట్‌ఫ్లోస్‌ క్యూ2లో 21 టన్నులయితే, మొదటి ఆరు నెలల్లో 50 టన్నులు. ఆభరణాల వినియోగ డిమాండ్‌ క్యూ2లో 3 శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఈ పరిమాణం 951 టన్నులు. పసిడి సరఫరా క్యూ2లో 7 శాతం పెరిగి 1,255 టన్నులుగా ఉంది. గోల్డ్‌ మైన్స్‌ ఉత్పత్తి మొదటి ఆరు నెలల్లో 1,781 టన్నుల రికార్డు స్థాయికి చేరింది.  

అటు–ఇటు అంచనాలు...
పెరిగిన స్థానిక ధరలు, విచక్షణతో కూడిన వ్యయంలో మందగమనం కారణంగా బంగారం అనిశి్చతిని ఎదుర్కొంటున్నందున, మేము బంగారం 2023 డిమాండ్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది.  ప్రస్తుతం పరిస్థితి కొంత నిరాశగా ఉన్నప్పటికీ తగిన వర్షపాతంతో పంటలు, గ్రామీణ డిమాండ్‌ పటిష్టంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం.  దీపావళి సీజన్‌లో సెంటిమెంట్‌  మెరుగుపడుతుందని, సానుకూల ఆశ్చర్య ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నాం. ప్రస్తుత స్థాయిలోనే ధరలు కొనసాగితే 2023లో భారత్‌లో మొత్తం బంగారం డిమాండ్‌ 650–750 టన్నుల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ సీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement