
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు...
► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు.
► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి.
► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి.
► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి.
► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది.
ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే..
ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది.
రూపాయి ఎఫెక్ట్...
పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు.
– సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment