World Gold Council Soma Sundaram
-
బంగారాన్ని కొనడమే మానేశారు.. అందుకు ఇదే కారణం!
న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్‌పై ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రికార్డు స్థాయి ధరల ప్రతికూల ప్రభావం పడింది. సమీక్షా కాలంలో దేశ పసిడి డిమాండ్ 7 శాతంపైగా పతనమై(2022 ఇదే కాలంతో పోల్చి) 158.1 టన్నులకు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. పసిడికి సంబంధించి భారత్ రెండవ అతిపెద్ద వినియోగ దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్ తగ్గినప్పటికీ, దిగుమతులు మాత్రం 16 శాతం పెరిగి 209 టన్నులుగా నమోదయినట్లు మండలి పేర్కొంది. 2023 మొదటి ఆరు నెలలూ చూస్తే, భారత్ పసిడి డిమాండ్ 271 టన్నులు. క్యాలెండర్ ఇయర్లో 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉంటుందని అంచనా. మండలి భారత్ ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సోమసుందరం పీఆర్ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. ► సమీక్షాకాలంలో 10 గ్రాముల పసిడి ధర భారీగా రూ.64,000కు చేరింది. పన్నుల ప్రభావం కూడా దీనికి తోడయ్యింది. వెరసి డిమాండ్ భారీగా పడిపోయింది. ► డిమాండ్ 7 శాతం పతనం ఎలా అంటే... 2022 ఏప్రిల్–జూన్ మధ్య దేశ పసిడి డిమాండ్ 170.7 టన్నులు. 2023 ఇదే కాలంలో ఈ పరిమాణం 158.1 టన్నులకు పడిపోయింది. ► ధరల పెరుగుదల వల్ల విలువల్లో చూస్తే మాత్రం క్యూ2లో పసిడి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య పసిడి దిగుమతుల విలువ రూ.79,270 కోట్లయితే, 2023 ఇదే కాలంలో ఈ విలువ రూ.82,530 కోట్లకు చేరింది. ► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, పసిడి డిమాండ్ 8 శాతం పడిపోయి 140.3 టన్నుల నుంచి 128.6 టన్నులకు తగ్గింది. ► 18 క్యారెట్ల పసిడి ఆభరణాలకు మాత్రం డిమాండ్ పెరగడం గమనార్హం. ధరలు కొంత అందుబాటులో ఉండడం దీనికి కారణం. ► కడ్డీలు, నాణేల డిమాండ్ 3 శాతం పడిపోయి 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు తగ్గింది. ► పసిడి డిమాండ్‌లో రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం కూడా కొంత కనబడింది. ► పసిడి డిమాండ్ భారీగా పెరగడంతో రీసైక్లింగ్ డిమాండ్ ఏకంగా 61 శాతం పెరిగి 37.6 టన్నులకు ఎగసింది. ► పసిడి ధర భారీ పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి చరిత్రాత్మక ధర వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ ధోరణి! ఓవర్–ది–కౌంటర్ లావాదేవీలు (ఓటీసీ– ఎక్సే్చంజీల్లో లిస్టెడ్కు సంబంధించిన కొనుగోళ్లు కాకుండా) మినహా గ్లోబల్ గోల్డ్ డిమాండ్ జూన్ త్రైమాసికంలో 2 శాతం పడిపోయి 921 టన్నులకు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో సగటు కొనుగోళ్లతో పోలిస్తే సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు సైతం తగ్గినట్లు మండలి పేర్కొంది. ఓటీసీ, స్టాక్ ఫ్లోలతో సహా, క్యూ2లో మొత్తం గ్లోబల్ డిమాండ్ మాత్రం 7 శాతం బలపడి 1,255 టన్నులకు చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పటిష్టమైన బంగారం మార్కెట్‌ను సూచిస్తోందని మండలి వివరించింది. సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ 103 టన్నులు తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. టర్కీలో కొన్ని కీలక ఆర్థిక, రాజకీయ పరిమాణల నేపథ్యంలో జరిగిన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. అయితే మొదటి ఆరు నెలల కాలాన్నీ చూస్తే మాత్రం సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో 387 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. దీర్ఘకాల సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని మండలి సీనియర్ మార్కెట్స్ విశ్లేషకులు లూయీస్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, టక్కీలుసహా కీలక మార్కెట్లలో వృద్ధి కారణంగా కడ్డీలు, నాణేల డిమాండ్ క్యూ2లో 6 శాతం పెరిగి 277 టన్నులుగా ఉంటే, మొదటి ఆరు నెలలోల 582 టన్నులుగా ఉంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) అవుట్‌ఫ్లోస్ క్యూ2లో 21 టన్నులయితే, మొదటి ఆరు నెలల్లో 50 టన్నులు. ఆభరణాల వినియోగ డిమాండ్ క్యూ2లో 3 శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఈ పరిమాణం 951 టన్నులు. పసిడి సరఫరా క్యూ2లో 7 శాతం పెరిగి 1,255 టన్నులుగా ఉంది. గోల్డ్ మైన్స్ ఉత్పత్తి మొదటి ఆరు నెలల్లో 1,781 టన్నుల రికార్డు స్థాయికి చేరింది. అటు–ఇటు అంచనాలు... పెరిగిన స్థానిక ధరలు, విచక్షణతో కూడిన వ్యయంలో మందగమనం కారణంగా బంగారం అనిశి్చతిని ఎదుర్కొంటున్నందున, మేము బంగారం 2023 డిమాండ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి కొంత నిరాశగా ఉన్నప్పటికీ తగిన వర్షపాతంతో పంటలు, గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. దీపావళి సీజన్లో సెంటిమెంట్ మెరుగుపడుతుందని, సానుకూల ఆశ్చర్య ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నాం. ప్రస్తుత స్థాయిలోనే ధరలు కొనసాగితే 2023లో భారత్‌లో మొత్తం బంగారం డిమాండ్ 650–750 టన్నుల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ సీఈఓ -
బంగారం డిమాండ్‌కు ధర సెగ
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు. ► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి. ► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి. ► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి. ► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది. ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే.. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది. రూపాయి ఎఫెక్ట్... పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు. – సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ -
World Gold Council: కరోనా పూర్వపు స్థాయికి బంగారం డిమాండ్
ముంబై: బంగారం డిమాండ్ భారత్‌లో కరోనా ముందు నాటి స్థాయికి చేరుకుందుని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం పెరిగి 191.7 టన్నులుగా నమోదైనట్టు ప్రకటించింది. ‘బంగారం డిమాండ్ తీరు క్యూ3, 2022’ పేరుతో మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 168 టన్నులుగా ఉంది. విలువ పరంగా చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 19 శాతం పెరిగి రూ.85,010 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.71,630 కోట్లు కావడం గమనార్హం. ఆభరణాల డిమాండ్ తీరు.. బంగారం ఆభరణాల డిమాండ్ మూడో క్వార్టర్లో 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 125 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.53,300 కోట్ల డిమాండ్‌తో పోలిస్తే 22 శాతం పెరిగి రూ.64,800 కోట్లుగా ఉంది. ‘‘రుణ సదుపాయాలు విస్తరించడం ఈ డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. బ్యాంకు రుణ వితరణలో వృద్ధి తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరింది. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో వృద్ధి బలంగా ఉంది. దీంతో ఆభరణాలకు డిమాండ్ 17 శాతం పెరిగింది’’అని డబ్ల్యూజీసీ భారత్ హెడ్ పీఆర్ సోమసుందరం తెలిపారు. వర్షాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్‌పై ప్రభావం ఉన్నట్టు చెప్పారు. పెరిగిన పెట్టుబడులు.. ఇక బార్, కాయిన్ల డిమాండ్ సెప్టెంబర్ క్వార్టర్లో 6 శాతం పెరిగి 45.4 టన్నులుగా (విలువ పరంగా రూ.20,150 కోట్లు) ఉంది. ‘‘బంగారం ధరలు తగ్గడం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, పండుగలతో ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల వాతావరణం, రూపాయి బలహీనత వంటి అంశాలతో సురక్షిత సాధనమైన బంగారంలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయి. ఈ ఏడాది మిగిలిన కాలంపై ఆశావహ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వివాహాలు, దీపావళి డిమాండ్ నాలుగో త్రైమాసికం గణాంకాల్లో ప్రతిఫలిస్తుంది. అయితే గతేడాది ఇదే కాలంలో కనిపించిన రికార్డు స్థాయి పనితీరు సాధ్యపడకపోవచ్చు. ఈ ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 750–800 టన్నులుగా ఉంటుంది’’అని సోమసుందరం వివరించారు. 2021లో బంగారం దిగుమతులు 1,003 టన్నులుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్‌ను పరిశీలిస్తే గతేడాది గణాంకాలను మించదని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో (సెప్టెంబర్ వరకు) 559 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు చెప్పారు. రెండు, మూడో త్రైమాసికంలో బంగారం ధరలు 4 శాతం తగ్గినట్టు.. సెప్టెంబర్ క్వార్టర్లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.44,351గా ఉన్నట్టు చెప్పారు. -
పసిడి డిమాండ్‌కు ధర దడ
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) 18 శాతం పడిపోయింది. 135.5 టన్నులుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ డిమాండ్ 165.8 టన్నులు. బంగారం ధరలు భారీగా పెరగడమే డిమాండ్ తగ్గడానికి కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2022 క్యూ1’ పేరుతో విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► విలువ పరంగా జనవరి–మార్చి కాలంలో బంగారం డిమాండ్ 12 శాతం తగ్గి రూ.61,550 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది కాలంలో ఈ విలువ రూ.69,720 కోట్లు. ► జనవరిలో బంగారం ధరలు పెరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10 గ్రాముల ధర (పన్నులు లేకుండా) 8 శాతం పెరిగి రూ. 45,434కు చేరుకుంది. ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం. 2021 జనవరి– మార్చి మధ్య ధర రూ.42,045గా ఉంది. ► మార్చి త్రైమాసికంలో దేశంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 26 శాతం తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఇది 126.5 టన్నులు. ► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విలువ పరంగా ఆభరణాల డిమాండ్ 20 శాతం క్షీణించి రూ.42,800 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.53,200 కోట్లు. ► 2021 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–నవంబర్–డిసెంబర్) ధర రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత, భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 26 శాతం తగ్గి 94 టన్నులకు పడిపోయింది. 2010 నుండి (మహమ్మారి కాలాలను మినహాయించి) భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ 100 ట న్నుల దిగువకు పడిపోవడం ఇది మూడవసారి. ► శుభ దినాల సందర్భాల్లో నెలకొన్న మహమ్మారి భయాలు, బంగారం ధరలు గణనీయంగా పెరగడం వంటి అంశాలు రిటైల్ డిమాండ్ తగ్గడానికి కారణం. ఆయా కారణాలతో కుటుంబాలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకున్నాయి. ► ఈ ఏడాది మొత్తంగా బంగారానికి డిమాండ్ 800–850 టన్నులు ఉండవచ్చు. ► కాగా, మార్చి త్రైమాసికంలో బంగారం విషయంలో పెట్టుబడి డిమాండ్ 5 శాతం పెరిగి 41.3 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 39.3 టన్నులు. ► విలువ పరంగా బంగారం పెట్టుబడి డిమాండ్ 13 శాతం పెరిగి రూ.18,750 కోట్లకు చేరుకుంది. ఇది 2021 అదే త్రైమాసికంలో రూ.16,520 కోట్లు. ► పెట్టుబడుల్లో ప్రధానంగా బంగారు కడ్డీలు, నాణేలు ఉన్నాయి. వీటి డిమాండ్ 5 శాతం పెరిగి 41 టన్నులకు చేరింది. ధరలు పెరగడం, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా బంగారాన్ని ఎంచుకోవడం, ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలు పసిడి పెట్టుబడుల డిమాండ్‌కు మద్దతునిచ్చాయి. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. ఈ కాలంలో సెంట్రల్ బ్యాంక్ 8 టన్నులను కొనుగోలు చేసింది. సెంట్రల్ బ్యాంక్ 2017 చివరి నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి 200 టన్నులను కొనుగోలు చేసింది. ► 2022 మొదటి త్రైమాసికంలో దేశంలో రీసైకిల్ అయిన మొత్తం బంగారం 88 శాతం పెరిగి 27.8 టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 14.8 టన్నులు. ► మార్చి త్రైమాసికంలో మొత్తం నికర బులియన్ దిగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 313.9 టన్నుల నుంచి 58 శాతం తగ్గి 132.2 టన్నులకు పడిపోయాయి. అంతర్జాతీయంగా మెరుపులు... కాగా, మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 34 శాతం పెరిగి 1,234 టన్నులకు చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం, వంటి అంశాలు దీనికి కారణం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి డిమాండ్ భారీగా వచ్చిందని నివేదిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1, 2022 నివేదిక పేర్కొంది. 2021 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ 919.1 టన్నులు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులలో బంగారం కోసం డిమాండ్ వంటి అంశాలు యరో మెటల్‌కు ఆకర్షణ తీసుకుని వస్తాయిన డబ్ల్యూజీసీ సీనియర్ విశ్లేషకులు లూయిస్ స్ట్రీట్ పేర్కొన్నారు. పలు అంశాల ప్రభావం ధరలపై మార్కెట్లో మిశ్రమ ధోరణి, చైనా నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో కోవిడ్‌పై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, భౌగోళిక సంఘర్షణలు వంటి అంశాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు గ్రామీణ మార్కెట్లలో డిమండ్ పునరుద్ధరణ, సాధారణ రుతుపవన అంశాలు కూడా యల్లో మెటల్ డిమాండ్‌పై ప్రభావం చూపుతాయి. – పీఆర్ సోమసుందరం, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
ధన్‌తేరాస్‌కు ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ/ముంబై: ఈసారి ధన్‌తేరాస్ రెండు రోజులు రావడం పసిడి అమ్మకాలకు కలిసి రానుంది. ప్రస్తుతం బంగారం ధర కాస్త తగ్గడం కూడా ఇందుకు తోడ్పడనుందని, దీనితో ధన్‌తేరాస్ సందర్భంగా కొనుగోళ్లు మెరుగ్గానే ఉండగలవని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. క్రమంగా అమ్మకాలు పుంజుకుంటున్నాయని వెల్లడించాయి. పసిడి, వెండి మొదలైన వాటి కొనుగోలుకు శుభకరమైన రోజుగా దీపావళికి ముందు వచ్చే ధన్‌తేరాస్ (ధన త్రయోదశి)ని పరిగణిస్తారు. ఈసారి ధన్‌తేరాస్ రెండు రోజులు (గురు, శుక్రవారం) వచ్చింది. ఇప్పటిదాకా పేరుకుపోయిన డిమాండ్ అంతా అమ్మకాల రూపం దాల్చగలదని, శుక్రవారం విక్రయాలు మరింత పుంజుకోగలవని ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. ‘కొనుగోలుదారులు నెమ్మదిగా ముందుకొస్తున్నారు. అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ గతేడాది స్థాయిలో మాత్రం ఈసారి ధన్‌తేరాస్ అమ్మకాలు ఉండకపోవచ్చు’ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ (ఇండియా) సోమసుందరం పీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పసిడి ధర తగ్గటమనేది డిమాండ్‌కు కొంత ఊతమివ్వగలదని పేర్కొన్నారు. అయితే పరిమాణంపరంగా అమ్మకాలు 15–20 శాతం తగ్గినా.. విలువపరంగా చూస్తే గతేడాది స్థాయిని అందుకునే అవకాశం ఉందని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సీఈవో సువంకర్ సేన్ చెప్పారు. కరోనా కేసుల కారణంగా చాలా మంది ఆన్లైన్ జ్యుయలరీ సంస్థల నుంచి కూడా కొనుగోళ్లు జరుపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
పసిడి.. డిమాండ్ ఢమాల్!
న్యూఢిల్లీ: ధరల తీవ్రతతో భారత్‌లో బంగారం డిమాండ్ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్ తగ్గడానికి దారితీసిందని మండలి పేర్కొంది. మండలి మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం తెలిపిన సమాచారం ప్రకారం– నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► 2018లో దేశంలో బంగారం డిమాండ్ 760 టన్నులు. 2019లో 690 టన్నులకు పడింది. ► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, డిమాండ్ 598 టన్నుల నుంచి 544 టన్నులకు దిగింది. ► కడ్డీలు, నాణేల డిమాండ్ 10 శాతం తగ్గి 162.4 టన్నుల నుంచి 146 టన్నులు చేరింది. ► 2019 అక్టోబర్ 25న వచ్చిన దంతేరాస్‌లో కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. దేశీయంగా పసిడి ధరల తీవ్రత, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు దీనికి కారణం. ► అయితే విలువ పరంగా మాత్రం భారత్ పసిడి డిమాండ్ రూ.2,11,860 కోట్ల నుంచి రూ.2,17,770 కోట్లకు పెరగడం గమనార్హం. ► చైనా తర్వాత పసిడి డిమాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో 2020లో ఈ మెటల్ డిమాండ్ 700 నుంచి 800 టన్నుల మధ్య ఉండవచ్చన్నది అంచనా. ప్రభుత్వం తీసుకునే పలు చర్యలతో ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండడం దీనికి కారణం. ► 2019 ప్రారంభంలో ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.32,190 ఉంటే, సంవత్సరం చివరకు వచ్చే సరికి రూ.39,000పైన ముగిసింది. ఒక దశలో రూ.40,000 మార్క్‌ను దాటడం కూడా గమనార్హం. ► బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్క్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం జనవరిలో నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయా అంశాలు పసిడిని దేశంలో మరింత విశ్వసనీయ మెటల్‌గా పెంపొందిస్తాయి. ► అయితే పసిడికి స్వల్పకాలంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పరిశ్రమలో లాభాలు తగ్గడం, పన్నుల అనిశ్చితి వంటివి ఇందులో ఉన్నాయి. ► 2019లో దేశ పసిడి దిగుమతులు స్మగ్లింగ్‌సహా 14% తగ్గి 756 టన్నుల నుంచి 647 టన్నులకు పడింది. స్మగ్లింగ్ 115–120 టన్నులు ఉంటుందని అంచనా. 2020లో డిమాండ్లు పెద్దగా పెరిగే అవకాశం లేదు. ► కస్టమ్స్ సుంకం ప్రస్తుతం 12.5 శాతం ఉంటే ఇది 10 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ► దేశ పసిడి డిమాండ్‌లో 60 శాతంపైగా గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం గమనార్హం. ఇక్కడ ఆభరణాలను సాంప్రదాయక సంపదగా భావిస్తుండడం దీనికి కారణం. ప్రస్తుతం దేశంలో రూ. 40వేల పైనే... పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముంౖ»ñ æసహా దేశంలోని పలు ప్రధాన మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.40,000పైనే కొనసాగుతోంది. గురువారం ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో ధర రూ.210 పెరిగి రూ.41,790కి చేరింది. న్యూఢిల్లీలో రూ.400 ఎగసి రూ.41,524కు చేరింది. అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా సమీప కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, చైనా కరోనా వైరస్ నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా పసిడివైపు ఇన్వెస్టర్లు చూస్తుండడం గమనార్హం. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు ఒకానొకదశలో 10 డాలర్లు పెరిగి 1,580 డాలర్లను తాకింది. -
క్యూ1లో వన్నె తగ్గిన బంగారం...
ముంబై: పసిడి రేటు మరింత తగ్గొచ్చన్న అంచనాల కారణంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) బంగారానికి డిమాండ్ గణనీయంగా క్షీణించింది. 39% తగ్గి 204.1 టన్నులకు పరిమితమైంది. గతేడాది క్యూ2లో ఇది 337 టన్నులు. విలువ పరంగా చూస్తే పసిడికి డిమాండు రూ. 85,533.8 కోట్ల నుంచి రూ. 50,564.3 కోట్లకు పడిపోయింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బంగారం ధర రూ. 25,000కు తగ్గిపోవచ్చన్న అంచనాలు, సార్వత్రిక ఎన్నికల వల్ల ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు బంగారం డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. అయితే, గడచిన అయిదేళ్ల దీర్ఘకాలిక సగటును చూస్తే ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో సైతం పసిడికి బాగానే డిమాండ్ ఉందని భావించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఏడాది ప్రథమార్ధంలో బంగారం దిగుమతులు 43% క్షీణించి 351 టన్నులకు పరిమితమయ్యాయి. దిగుమతి సుంకాల పెంపు ఇందుకు కారణమని సోమసుందరం వివరించారు. గతేడాది ప్రథమార్ధంలో దిగుమతులు 620 టన్నులు. అంతర్జాతీయంగా డిమాండ్ 16% డౌన్.. బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లలో సందిగ్ధం నెలకొనడంతో క్యూ2లో అంతర్జాతీయంగా కూడా పసిడికి డిమాండ్ తగ్గింది. 16 శాతం క్షీణించి 964 టన్నులుగా నమోదైంది. గతేడాది రెండో త్రైమాసికంలో ఇది 1,148 టన్నులు. విలువపరంగా చూస్తే 24 శాతం క్షీణించి 40 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 28 శాతం ఎగిసి 92 టన్నుల నుంచి 118 టన్నులకు పెరిగాయి. ఇరాక్, ఉక్రెయిన్‌లో రాజకీయ సంక్షోభాలు, అమెరికా డాలరుకు ప్రత్యామ్నాయ సాధనాలవైపు సెంట్రల్ బ్యాంకులు దృష్టి సారిస్తుండటం ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ ఎండీ మార్కస్ గ్రబ్ పేర్కొన్నారు. గతేడాది అసాధారణ పరిస్థితులు చూసిన మార్కెట్ ఇప్పుడిప్పుడే స్థిరపడుతోన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఇన్వెస్టర్లు ఎలక్ట్రానికల్లీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు మొగ్గు చూపడం రెండో త్రైమాసికంలో మరికాస్త పెరిగిందన్నారు. పెరిగిన పసిడి దిగుమతుల టారిఫ్ విలువ న్యూఢిల్లీ: బంగారం దిగుమతుల టారిఫ్ విలువను ప్రభుత్వం పెంచింది. ఈ విలువ (10గ్రా) 421 డాలర్ల నుంచి 426 డాలర్లకు చేరింది. వెండిపై (కేజీ)కి 650కు పెంచింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఒక ప్రకటన చేసింది. ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టారిఫ్ విలువలో మార్పులు చేస్తారు.