ముంబై: భారత్ పసిడి డిమాండ్ తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో వార్షికంగా 19 శాతం పెరిగి 76 టన్నులుగా నమోదయినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. అయితే శాతాల్లో భారీ పెరుగుదలకు గత ఏడాది ఇదే కాలంలో తక్కువ డిమాండ్ నమోదు (లో బేస్) ప్రధాన కారణం. 2020 ఏప్రిల్–జూన్ మధ్య పసిడి డిమాండ్ 63.8 టన్నులుగా ఉంది. కరోనా ప్రభావంతో అప్పట్లో కఠిన లాక్‌డౌన్ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 2021 క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్‌పై డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► ఏప్రిల్–జూన్ మధ్య పసిడి డిమాండ్ విలవ రూపంలో 23 శాతం పెరిగి రూ.26,600 కోట్ల నుంచి రూ.32,810 కోట్లకు చేరింది.
► ఇక మొత్తం ఆభరణాల డిమాండ్ రెండవ త్రైమాసికంలో వార్షికంగా 25 శాతం పెరిగి 44 టన్నుల నుంచి 55.1 టన్నులకు చేరింది. విలువలో 29 శాతం ఎగసి రూ.18,350 కోట్ల నుంచి రూ.23,750 కోట్లకు ఎగసింది.
► పెట్టుబడుల డిమాండ్ 6 శాతం పెరిగి 19.8 టన్నుల నుంచి 21 టన్నులకు ఎగసింది. విలువలో ఈ విలువ 10 శాతం పెరిగి రూ.8,250 కోట్ల నుంచి రూ.9,060 కోట్లకు ఎగసింది.
► గోల్డ్ రీసైక్లింగ్ 43 శాతం ఎగసి 13.8 టన్నుల నుంచి 19.7 టన్నులకు చేరింది.
► పసిడి దిగుమతులు 10.9 టన్నుల నుంచి భారీగా 120.4 టన్నులకు పెరిగాయి.
ఆరు నెలల్లో ఇలా...
త్రైమాసికం పరంగా చూస్తే, (2021 జనవరి–మార్చితో పోల్చి) పసిడి డిమాండ్ 46 శాతం పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ పసిడి డిమాండ్ 140 టన్నులు. కోవిడ్–19 సెకండ్‌వేవ్ ప్రభావం ఏప్రిల్–జూన్ త్రైమాసికం డిమాండ్‌పై కనబడింది. సెకండ్ వేవ్ కారణంగా అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌లో పసిడికి అంత డిమాండ్ రాలేదని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) సోమసుందరం తెలిపారు. 2021 తొలి ఆరు నెలల్లో పసిడి డిమాండ్ 30 శాతం పెరిగి 216.1 టన్నులకు ఎగసింది.
పెరిగిన సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు...
డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం, ప్రపంచ పసిడి డిమాండ్ 2021 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో దాదాపు స్థిరంగా 955.1 టన్నులుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 960.5 టన్నులు. ఆభరణాలకు సంబంధించి వినియోగదారు పసిడి డిమాండ్ 60 శాతం పెరిగి 244.5 టన్నుల నుంచి 390.7 టన్నులకు చేరింది. కడ్డీలు, నాణేల కొనుగోళ్లు వరుసగా నాల్గవ త్రైమాసికంలోనూ పెరిగాయి. వార్షికంగా 157 టన్నుల నుంచి 244 టన్నులకు చేరాయి. కాగా ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్ల పరిమాణం నుంచి 90 శాతం పడిపోయి 427.5 టన్నుల నుంచి 40.7 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగాయి. ఈ పరిమాణం 63.7 టన్నుల నుంచి భారీగా 199.9 టన్నులకు ఎగసింది. థాయ్‌లాండ్, హంగరీ, బ్రె జిల్ సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోలు చేశాయి. సంవత్సరం మొత్తంగా డిమాండ్ 1,600 టన్నుల నుంచి 1,800 టన్నుల శ్రేణిలో ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా. ఒక్క ఇన్వెస్ట్‌మెండ్ డిమాండ్ 1,250 నుంచి 1,400 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తోంది. అలాగే సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లూ కొనసాగుతాయని విశ్వసిస్తోంది.
భారత్ బంగారం డిమాండ్ పటిష్టం
Published Fri, Jul 30 2021 5:34 AM | Last Updated on Fri, Jul 30 2021 5:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment