తగ్గిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: భారత్ వాణిజ్యలోటు డిసెంబర్‌లో 10 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసమే వాణిజ్యలోటు. డిసెం బర్‌లో ఈ లోటు 9.43 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గణనీయంగా పడిపోవడం లోటు తగ్గడానికి ప్రధాన కారణం. డిసెంబర్‌లో దేశం ఎగుమతులు అసలు వృద్ధిలేకపోగా 3.8 శాతం క్షీణించాయి. 25.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే దిగుమతుల బిల్లు 4.8 శాతం తగ్గి 34.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒక్క చమురు దిగుమతుల విలువ 28.6 శాతం పడిపోయి 9.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
బంగారం ఇలా: 2013 డిసెంబర్‌తో పోల్చితే 2014 డిసెంబర్‌లో బంగారం దిగుమతులు 7.4 శాతం పెరిగి 1.34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే 2014 నవంబర్‌తో పోల్చితే మాత్రం (5.61 బిలియన్ డాలర్లు) ఈ విలువ గణనీయంగా తగ్గడం గమనార్హం. తొమ్మిది నెలల్లో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య మొత్తం ఎగుమతులు 2013 ఇదే కాలంతో పోల్చితే 4.02 శాతం వృద్ధితో 241.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు ఇదే కాలంలో 3.63 శాతం పెరుగుదలతో 351.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 110 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 325 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు దేశం లక్ష్యం.