
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో కల్లోలం సృష్టించింది. మార్చి 4నుంచి కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్‌లో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో మదుపర్లు ఇవాళ ఒక్కరోజే రూ.10లక్షల కోట్లు నష్టపోయారు.
అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో కొనసాగాయి. మార్కెట్‌లో చివరి రోజున శుక్రవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీ మొత్తంలో సంపద ఆవిరైంది. ఫలితంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేశాయి. ఈ వారంలో మదుపర్లు సుమారు రూ.30లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇక ట్రంప్ సుంకాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. 10 శాతం అధిక సుంకాలు విధిస్తామని చైనాను ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సుంకాల ప్రకటన అనంతరం బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
400 పాయింట్ల ప్రతికూల గ్యాప్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 73,141 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 1,414 పాయింట్లు లేదా 1.9 శాతం నష్టంతో 73,198 వద్ద ముగిసింది. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,113 పాయింట్లు (2.8 శాతం) నష్టంతో వారాన్ని ముగించింది. అలాగే ఫిబ్రవరి నెలలో 4,303 పాయింట్లు లేదా 5.6 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 85,978 నుంచి దాదాపు 15 శాతం నష్టపోయింది.
ఇక నిఫ్టీ 1.9 శాతం లేదా 420 పాయింట్ల నష్టంతో 22,125 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫిబ్రవరిలో 5.9 శాతం క్షీణించి, జీవితకాల గరిష్ట స్థాయి 26,277 నుంచి 16 శాతానికి చేరువైంది. నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతం వరకు పడిపోతే బేర్ మార్కెట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది.
ఐటీ, ఆటో షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా 4- 6 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 27 షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే 2 శాతం లాభంతో మెరిసింది.
విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ గత 5 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసింది. అన్ని రంగాల సూచీలు 1 శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఐటీ, ఆటో సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment