చార్జర్స్‌కు రూ. 4,800 కోట్లు చెల్లించండి...  | Mumbai High Court Arbitration Order BCCI Over Deccan Chargers Team | Sakshi
Sakshi News home page

చార్జర్స్‌కు రూ. 4,800 కోట్లు చెల్లించండి... 

Published Sat, Jul 18 2020 1:11 AM | Last Updated on Sat, Jul 18 2020 9:20 AM

Mumbai High Court Arbitration Order BCCI Over Deccan Chargers Team - Sakshi

ముంబై: ఐపీఎల్‌ నుంచి దక్కన్‌ చార్జర్స్‌ (డీసీ) జట్టును తొలగించడంపై ముంబై హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్‌ శుక్రవారం ఇచ్చిన తీర్పు బోర్డుకు ప్రతికూలంగా వెలువడింది. నష్టపరిహారంతో పాటు ఇతర ఖర్చుల కింద డీసీ యాజమాన్యానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ. 4,800 కోట్లు చెల్లించాలని హైకోర్టు మధ్యవర్తి రిటైర్డ్‌ జస్టిస్‌ సీకే ఠక్కర్‌ ఆదేశించారు. 2012 నుంచి సాగిన ఈ వివాదంలో చివరకు హైదరాబాద్‌ ఐపీఎల్‌ టీమ్‌ పైచేయి సాధించింది. ఈ ఉత్తర్వులను బీసీసీఐ హైకోర్టులో సవాల్‌ చేసే అవకాశముంది.  

నేపథ్యమిది... 
ఐపీఎల్‌లో 2008 నుంచి 2012 వరకు ఐదేళ్ల పాటు దక్కన్‌ చార్జర్స్‌ జట్టు కొనసాగింది.  2009లో టీమ్‌ చాంపియన్‌గా కూడా నిలిచింది. దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) కంపెనీ ఈ టీమ్‌ను ప్రమోట్‌ చేసింది. అయితే 2012లో రూ.100 కోట్ల బ్యాంకు గ్యారంటీని చూపించడంలో విఫలమైందంటూ బీసీసీఐ షోకాజ్‌ నోటీసు ఇవ్వడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాతి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. వివరణ కోసం చార్జర్స్‌కు 30 రోజుల గడువు ఇచ్చినా అది పూర్తి కాకముందే టీమ్‌ను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత ఇదే జట్టు స్థానంలో 2013 సీజన్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వచ్చింది.   

కోర్టుకెక్కిన చార్జర్స్‌...
తమ జట్టును రద్దు చేయడం అక్రమమని డీసీహెచ్‌ఎల్‌ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన జట్లను జరిమానావంటి స్వల్ప శిక్షలతో సరిపెట్టిన బోర్డు చిన్న తప్పుకే తమ జట్టును తొలగించడం అన్యాయమని వాదించింది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ  ఒప్పందం ప్రకారం బాంబే హైకోర్టు ఆదేశాలతో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీకే ఠక్కర్‌ మధ్యవర్తిగా వాదనలు మొదలయ్యాయి. నష్టపరిహారం, వడ్డీ, ఇతర ఖర్చుల కింద తమకు రూ. 8 వేల కోట్లు చెల్లించాలని దక్కన్‌ చార్జర్స్‌ కోరింది. అయితే ఫ్రాంచైజీ ఫీజు కింద మిగిలిన ఐదేళ్లకు కలిపి రూ. 214 కోట్లు డీసీ తమకు చెల్లించాలని బోర్డు కౌంటర్‌ వేసింది. చివరకు శుక్రవారం ఆర్బిట్రేటర్‌ తుది తీర్పు వినిపించారు. జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లతో పాటు ఆర్బిట్రేషన్‌ మొదలైన 2012నుంచి ఏడాదికి 10 శాతం వడ్డీ, ఖర్చులకు మరో రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. భారీ మొత్తం కాబట్టి బీసీసీఐ హైకోర్టుకు వెళ్లనుంది. తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సీఈఓ హేమంగ్‌ అమీన్‌ స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement