న్యూఢిల్లీ: ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్ సే విశ్వాస్ 2 స్కీము ముసాయిదాను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, కాంట్రాక్టర్లు, ప్రజలు దీనిపై మార్చి 8లోగా తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. ముసాయిదా ప్రకారం వివాదంపై విచారణ దశను బట్టి కాంట్రాక్టర్లకు సెటిల్మెంట్ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు.
ఒకవేళ న్యాయస్థానం లేదా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసి ఉంటే .. క్లెయిమ్ అమౌంటులో 80 శాతం లేదా ఉత్తర్వుల్లో పేర్కొన్న దానిలో 60 శాతం మొత్తం ఆఫర్ చేయవచ్చు. ఇక పనులు నిలిపివేసినా లేదా రద్దయిన కాంట్రాక్టులకు సంబంధించి ఇది నికరంగా క్లెయిమ్ చేసిన దానిలో 30 శాతంగా ఉంటుంది. వివాదాస్పద కాంట్రాక్టుపై లిటిగేషన్, పనులు కొనసాగుతుంటే ఇది 20 శాతానికి పరిమితమవుతుంది. ఒకవేళ మొత్తం క్లెయిమ్ అమౌంటు రూ. 500 కోట్లు దాటిన పక్షంలో ఆర్డరు ఇచ్చిన సంస్థలకు కాంట్రాక్టరు ఇచ్చే సెటిల్మెంట్ ఆఫర్‌ను తిరస్కరించే ఆప్షను ఉంటుంది. కానీ, అందుకు తగిన కారణాన్ని చూపాలి. సంబంధిత శాఖ, విభాగం కార్యదర్శి లేదా కంపెనీ అయితే సీఈవో దీన్ని ఆమోదించాలి.
Comments
Please login to add a commentAdd a comment