ర్యాన్‌బాక్సీకి షాక్! | US halts drug imports from Ranbaxy plant in India | Sakshi
Sakshi News home page

ర్యాన్‌బాక్సీకి షాక్!

Published Sat, Jan 25 2014 2:21 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

ర్యాన్‌బాక్సీకి షాక్! - Sakshi

ర్యాన్‌బాక్సీకి షాక్!

వాషింగ్టన్/న్యూఢిల్లీ: దేశీ ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీకి మరోసారి అమెరికా నుంచి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో కంపెనీకి చెందిన మరొక ప్లాంట్ నుంచి ఔషధాల దిగుమతిపై నియంత్రణ సంస్థ యూఎస్ ఆహార, ఔషధ యంత్రాంగం(యూఎస్‌ఎఫ్‌డీఏ) నిషేధం విధించింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ర్యాన్‌బాక్సీ సరఫరా చేస్తున్న మొత్తం ఔషధాల ఎగుమతులన్నీ నిలిచిపోనున్నాయి. పంజాబ్‌లోని తోన్సా ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న మందులతోపాటు అమెరికాలోని న్యూజెర్సీలో కంపెనీకి ఉన్న ఓహమ్ ల్యాబ్స్ ప్లాంట్‌లో ఔషధాలపైన కూడా నిషేధం విధిస్తూ యూఎస్‌ఎఫ్‌డీఏ ఆదేశాలు జారీ చేసింది. అమెరికా వినియోగదారులకు ఉత్పత్తులను అందిస్తున్న ర్యాన్‌బాక్సీ ఇతర తయారీ కేంద్రాలన్నింటికీ తోన్సా ప్లాంట్ నుంచి యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్(ఏపీఐ)ల తయారీ-సరఫరా చేయకూడదని కూడా ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇప్పటిదా కా నిషేధానికి గురైన ప్లాంట్‌లలో ఇది నాలుగోది కావడం గమనార్హం.
 
 ‘అమెరికాలోని కన్జ్యూమర్లకు నాసిరకమైన ఉత్పత్తులు చేరకుండా మేం కఠిన చర్యలను సాధ్యమైనంత వేగంగా చేపడుతున్నాం’ అని ఎఫ్‌డీఏకి చెందిన ఔషధాల మదింపు, పరిశోధన కేంద్రం యాక్టింగ్ డెరైక్టర్ కరోల్ బెన్నెట్ పేర్కొన్నారు. 2012 జనవరిలో జారీ చేసిన కన్సెంట్ డిక్రీలోని నిబంధనల ప్రకారమే ఈ చర్యలకు ఉపక్రమించినట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. తమ ఆహార, ఔషధ, కాస్మెటిక్ చట్టం; ఎఫ్‌డీఏ నిబంధనల విషయంలో ఉల్లంఘనలు జరిగినట్లు తనిఖీలో తేలితే ర్యాన్‌బాక్సీ సొంత, నిర్వహణలో ఉన్న ప్లాంట్‌లలో దేనిపైనైనా నిషేధం, చర్యలు చేపట్టేందుకు ఈ కన్సెంట్ డిక్రీ వీలు కల్పిస్తుంది. తయారీలో నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనకుగాను తోన్సా ప్లాంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ నెల మొదట్లోనే నోటీసులు జారీచేసింది. అప్పటి నుంచే తాము ఇక్కడ   ఏపీఐల తయారీ, సరఫరాలను నిలిపేసినట్లు ర్యాన్‌బాక్సీ చెబుతోంది.
 
 నిరాశపరిచింది చర్యలు చేపడతాం: ర్యాన్‌బాక్సీ
 తోన్సా ప్లాంట్‌పై నిషేధం విధింపు నిరాశపరిచిందని ర్యాన్‌బాక్సీ ప్రతి స్పందించింది. దీనివల్ల  తలెత్తే అసౌకర్యానికిగాను కంపెనీ వాటాదారులను క్షమాపణ కోరుతున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ పరిణామాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అంతర్గతంగా దర్యాప్తు పూర్తయిన తర్వాత తదనుగుణంగా యాజమాన్యపరమైన చర్యలు తీసుకుకుంటాం’ అని ర్యాన్‌బాక్సీ సీఈఓ, ఎండీ అరుణ్ సాహ్నే పేర్కొన్నారు. కాగా, యూఎస్‌ఎఫ్‌డీఏ కన్సెంట్ డిక్రీకి అనుగుణంగా తాము అన్నివిధాలా సహకరిస్తామని ర్యాన్‌బాక్సీ మాతృసంస్థ జపాన్‌కు చెందిన దైచీ శాంక్యో పేర్కొంది.
 
 షేరు... టపటపా...
 అమెరికా నిషేధం వార్తలతో ర్యాన్‌బాక్సీ షేరు విలవిల్లాడింది. శుక్రవారం బీఎస్‌ఈలో షేరు ధర 20 శాతం కుప్పకూలింది. క్రితం ముగింపు రూ.417తో పోలిస్తే... రూ.83 మేర క్షీణించి రూ.334 కనిష్టానికి పడిపోయింది. చివరకు 19.54 శాతం నష్టంతో రూ. 335.65 వద్ద ముగిసింది. ఈ కంపెనీ స్టాక్ 53 వారాల గరిష్టస్థాయి రూ. 490 (ఈ నెల 6న) కాగా, కనిష్టస్థాయి రూ.254 (గతేడాది ఆగస్టు 2న)గా నమోదైంది. కాగా, శుక్రవారం ఒక్కరోజే కంపెనీ మార్కెట్ విలువ రూ.3,416 కోట్లు ఆవిరై... రూ.14,260 కోట్లకు దిగజారింది.
 
 కంపెనీపై ప్రభావం ఏంటి..?
 

  • భారత ఔషధ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ అమెరికాయే.
  • ప్రధానంగా దేశంలో అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటైన ర్యాన్‌బాక్సీ మొత్తం వ్యాపారంలో అమెరికాకు ఎగుమతులే దాదాపు 40 శాతం దాకా ఉన్నాయి.
  • ఇప్పుడు ఈ ఎగుమతులన్నీ ఆగిపోతే కంపెనీ ఆదాయాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది.
  • కీలకమైన ముడివస్తువుల సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలూ తలెత్తకుండా చూసుకోవడం, నిషేధం తొలగింపునకు తక్షణం తగిన చర్యలు చేపట్టడం చాలా అవసరం. లేదంటే కంపెనీపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్(ఫార్మా రీసెర్చ్) సరభ్‌జిత్ కౌర్ నంగ్రా వ్యాఖ్యానించారు.
  • అమెరికాలో ర్యాన్‌బాక్సీ త్రైమాసిక(3 నెలలు) అమ్మకాలు కనీసం 12.5 కోట్ల డాలర్ల వరకూ ఉంటాయి. తాజా నిషేధం వల్ల కీలక ఉత్పత్తుల తయారీని ఇతర ప్లాంట్లకు తాజా నిషేధంతో వచ్చే 3-4 త్రైమాసికాల్లో ఈ అమ్మకాల్లో 35-40% దెబ్బతినే అవకాశం ఉందని రెలిగేర్ క్యాపిటల్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్(సంస్థాగత పరిశోధన) అరవింద్ బోత్రా చెబుతున్నారు.
  • భారత్, అమెరికా మార్కెట్లే కంపెనీకి మొత్తం ఆదాయంలో అత్యధిక శాతం సమకూరుస్తున్నాయి. యూఎస్ ఎఫ్‌డీఏ చర్యలతో వచ్చే 4-5 క్వార్టర్లలో లాభాల్లో భారీ తగ్గుదలకు దారితీయొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.
  • ఇప్పుడు ర్యాన్‌బాక్సీ తమ తోన్సా ప్లాంట్‌లో నిబంధనలకు అను    గుణంగా ఉత్పత్తి కొనసాగుతుందన్న హామీనిచ్చేలా ఒక థర్డ్ పార్టీ నిపుణులచేత తనిఖీలను నిర్వహించి యూఎస్‌ఎఫ్‌డీఏకు     తెలియజేయాల్సి ఉంటుంది.
  • ఈ నివేదికలపై, తయారీలో లోపాలను సరిదిద్దారన్న అంశంపై సంతృప్తి చెందేవరకూ ఎఫ్‌డీఏ నియంత్రిత ఔషధాల ఉత్పత్తికి ఏపీఏల తయారీ-సరఫరాలను తిరిగి ప్రారంభిచడం కుదరదు.

 
 కీలక ప్లాంట్లపై కొరడా...

  • ర్యాన్‌బాక్సీకి  కీలక ప్లాంట్‌లలో పోంటా సాహిబ్(హిమాచల్ ప్రదేశ్), దేవాస్(మధ్యప్రదేశ్), మొహాలీ(పంజాబ్)లు కూడా ఉన్నాయి.
  • 2008 నుంచే పోంటా సాహిబ్, దేవాస్ ప్లాంట్‌లపై యూఎస్‌ఎఫ్‌డీఏ నిషేధం(ఇంపోర్ట్ అలర్ట్) అమలవుతోంది. ఇక్కడ తయారయ్యే దాదాపు 30 జనరిక్ డ్రగ్స్‌ను అమెరికాలోకి దిగుమతి కాకుండా కొరడా ఝళిపించింది.
  • కాగా, పోంటా సాహిబ్, దేవాస్ ప్లాంట్లలో ఔషధాలు నాసిరకంగా ఉన్నట్లు తనిఖీల్లో తేలడంతో అమెరికా నియంత్రణ సంస్థలకు 50 కోట్ల డాలర్ల మొత్తాన్ని జరిమానాగా చెల్లించేందుకు కూడా గతేడాది మే నెలలో ర్యాన్‌బాక్సీ అంగీకరించింది.
  • మొహాలీ ప్లాంట్‌పై గతేడాది సెప్టెంబర్‌లో నిషేధం విధించింది.
  •  తాజాగా నాలుగో కీలక ప్లాంట్‌ను కూడా ఈ జాబితాలో చేర్చడంతో కంపెనీ అమెరికా వ్యాపారం తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement