కుప్పకూలిన ర్యాన్‌బాక్సీ షేరు
కుప్పకూలిన ర్యాన్‌బాక్సీ షేరు
Published Tue, Sep 17 2013 2:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
ముంబై: అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) హెచ్చరికల నేపథ్యంలో ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో ఏకంగా 30% దిగజారి రూ. 319 వద్ద ముగిసింది. ఒక దశలో బీఎస్‌ఈలో 35% వరకూ పతనమై కనిష్టంగా రూ. 297ను సైతం తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో రూ. 5,855 కోట్లు ఆవిరైంది. వెరసి ర్యాన్‌బాక్సీ మార్కెట్ క్యాప్ రూ. 13,491 కోట్లకు పరిమితమైంది. ఇప్పటికే రెండు ప్లాంట్లలో ఉత్పత్తయ్యే ఔషధాలకు సంబంధించి యూఎస్ ఎఫ్‌డీఏ ఆగ్రహానికి గురైన సంస్థ ఇప్పుడు ఇలాంటి మరో సమస్యలో చిక్కుకుంది. పంజాబ్‌లోని మొహాలీ ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ యూఎస్ ఎఫ్‌డీఏ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
ఈ ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాల దిగుమతులను నిషేధించింది. కాగా, ఈ ప్లాంట్ ద్వారా 2009 నుంచీ ర్యాన్‌బాక్సీ మొత్తం 18 దరఖాస్తులను(ఫైలింగ్స్) దాఖలు చేసింది. అయితే ఈ విషయమై యూఎస్ ఎఫ్‌డీఏ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని కంపెనీ బీఎస్‌ఈకి తెలిపింది. ఈ అంశానికి సంబంధించి తమ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారంపై యూఎస్ ఎఫ్‌డీఏను సంప్రదిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దేవాస్, పోంటా సాహిబ్ ప్లాంట్లలో తయారయ్యే ఔషధాలకు సంబంధించి తలెత్తిన కేసుల పరిష్కారానికిగాను ఈ ఏడాది మే నెలలో యూఎస్ ఎఫ్‌డీఏతో ర్యాన్‌బాక్సీ కన్‌సెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 50 కోట్ల డాలర్లను చెల్లించేందుకు అంగీకరించింది కూడా.
స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్‌కూ దెబ్బ
స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్‌కూ యూఎస్ ఎఫ్‌డీఏ దెబ్బ తగిలింది. అనుబంధ సంస్థ అగిలా స్పెషాలిటీస్‌కు చెందిన బెంగళూరు స్టెరైల్ తయారీ ప్లాంట్-2పై హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అగిలా స్పెషాలిటీస్ టేకోవర్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికా కంపెనీ మైలాన్ రూ. 5,168 కోట్లకు అగిలాను కొనుగోలు చేసేందుకు స్ట్రైడ్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, యూఎస్ ఎఫ్‌డీఏకు సహకరించడం ద్వారా సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్ట్రైడ్స్ తెలిపింది. జూన్‌లో యూఎస్ ఎఫ్‌డీఏ ప్లాంట్‌ను సందర్శించి హెచ్చరికలు జారీ చేసిందని, ఇప్పటికే వీటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నామని వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్ట్రైడ్స్ షేరు రూ. 839 వద్ద కనిష్టాన్ని తాకినప్పటికీ, చివరికి 3.5% నష్టంతో రూ. 869 వద్ద ముగిసింది.
Advertisement
Advertisement