Milan Bavishi
-
ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాలు
ప్రపంచ మార్కెట్ల బలహీనత, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం 94 పాయింట్ల నష్టంతో మూడు వారాల కనిష్టస్థాయి 20,693 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 6,162 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 477 పాయింట్లు కోల్పోయింది. ఎఫ్ఐఐలు వరుసగా రెండురోజుల పాటు విక్రయాలు జరపడంతో సెంటిమెంట్ బలహీనపడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. హెవీవెయిట్ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తగ్గడంతో సూచీలు క్షీణించాయి. మెటల్, రియల్టీ షేర్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. టాటా స్టీల్, సేసా స్టెరిలైట్, హిందాల్కోలు 2-3% తగ్గగా, డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ షేర్లు 1-2% పడిపోయాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో (ఎఫ్ఐఐలు) ఏర్పడుతున్నాయని, ఈ కారణంగా వారు ఇటీవల వర్ధమాన మార్కెట్లలో లాభాల స్వీకరణ జరుపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఎఫ్ఐఐలు మరో రూ. 567 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. కొద్ది నెలల నుంచి అదేపనిగా అమ్మకాలు జరుపుతున్న దేశీయ సంస్థలు మాత్రం తాజాగా రూ. 59.44 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం. రిలయన్స్ కౌంటర్లో పెరిగిన ఓపెన్ ఇంట్రస్ట్: ఐదు రోజుల నుంచి వరుస నష్టాలు చవిచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) భారీగా పెరిగింది. మూడు నెలలుగా మద్దతునిస్తున్న రూ. 840 సమీపస్థాయిలోనే రిలయన్స్ ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు క్రితంరోజులానే రూ. 7 ప్రీమియంతో క్లోజయ్యింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ఓఐలో 7.12 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 1.32 కోట్ల షేర్లకు పెరిగింది. ఆర్ఐఎల్ కౌంటర్లో ఓపెన్ ఇంట్రస్ట్ ఇంతభారీగా పెరగడం అరుదు. రూ. 860 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ రైటింగ్ జరగడంతో 2.65 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.12 లక్షల షేర్లకు పెరిగింది. అలాగే రూ. 840 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్లో 83 వేల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 3.05 లక్షల షేర్లకు చేరింది. ఫ్యూచర్ కాంట్రాక్టులో గరిష్టస్థాయి ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) వున్నందున, సమీప భవిష్యత్తులో ఈ షేరు ఏదో ఒకవైపు వేగంగా కదలవచ్చు. అయితే రూ. 860 స్థాయిని అధిగమించలేకపోతే రిలయన్స్ దిగువవైపుగా ప్రయాణించవచ్చని, ఆ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే ర్యాలీ జరపవచ్చని ఆప్షన్ రైటింగ్ సూచిస్తున్నది. -
కుప్పకూలిన ర్యాన్‌బాక్సీ షేరు
ముంబై: అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) హెచ్చరికల నేపథ్యంలో ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో ఏకంగా 30% దిగజారి రూ. 319 వద్ద ముగిసింది. ఒక దశలో బీఎస్ఈలో 35% వరకూ పతనమై కనిష్టంగా రూ. 297ను సైతం తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో రూ. 5,855 కోట్లు ఆవిరైంది. వెరసి ర్యాన్‌బాక్సీ మార్కెట్ క్యాప్ రూ. 13,491 కోట్లకు పరిమితమైంది. ఇప్పటికే రెండు ప్లాంట్లలో ఉత్పత్తయ్యే ఔషధాలకు సంబంధించి యూఎస్ ఎఫ్‌డీఏ ఆగ్రహానికి గురైన సంస్థ ఇప్పుడు ఇలాంటి మరో సమస్యలో చిక్కుకుంది. పంజాబ్‌లోని మొహాలీ ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ యూఎస్ ఎఫ్‌డీఏ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాల దిగుమతులను నిషేధించింది. కాగా, ఈ ప్లాంట్ ద్వారా 2009 నుంచీ ర్యాన్‌బాక్సీ మొత్తం 18 దరఖాస్తులను(ఫైలింగ్స్) దాఖలు చేసింది. అయితే ఈ విషయమై యూఎస్ ఎఫ్‌డీఏ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని కంపెనీ బీఎస్ఈకి తెలిపింది. ఈ అంశానికి సంబంధించి తమ వెబ్సైట్లో ఉంచిన సమాచారంపై యూఎస్ ఎఫ్‌డీఏను సంప్రదిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దేవాస్, పోంటా సాహిబ్ ప్లాంట్లలో తయారయ్యే ఔషధాలకు సంబంధించి తలెత్తిన కేసుల పరిష్కారానికిగాను ఈ ఏడాది మే నెలలో యూఎస్ ఎఫ్‌డీఏతో ర్యాన్‌బాక్సీ కన్సెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 50 కోట్ల డాలర్లను చెల్లించేందుకు అంగీకరించింది కూడా. స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్కూ దెబ్బ స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్కూ యూఎస్ ఎఫ్‌డీఏ దెబ్బ తగిలింది. అనుబంధ సంస్థ అగిలా స్పెషాలిటీస్‌కు చెందిన బెంగళూరు స్టెరైల్ తయారీ ప్లాంట్-2పై హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అగిలా స్పెషాలిటీస్ టేకోవర్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికా కంపెనీ మైలాన్ రూ. 5,168 కోట్లకు అగిలాను కొనుగోలు చేసేందుకు స్ట్రైడ్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, యూఎస్ ఎఫ్‌డీఏకు సహకరించడం ద్వారా సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్ట్రైడ్స్ తెలిపింది. జూన్‌లో యూఎస్ ఎఫ్‌డీఏ ప్లాంట్‌ను సందర్శించి హెచ్చరికలు జారీ చేసిందని, ఇప్పటికే వీటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నామని వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో స్ట్రైడ్స్ షేరు రూ. 839 వద్ద కనిష్టాన్ని తాకినప్పటికీ, చివరికి 3.5% నష్టంతో రూ. 869 వద్ద ముగిసింది.