ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాలు
ప్రపంచ మార్కెట్ల బలహీనత, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ మంగళవారం 94 పాయింట్ల నష్టంతో మూడు వారాల కనిష్టస్థాయి 20,693 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 6,162 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 477 పాయింట్లు కోల్పోయింది. ఎఫ్‌ఐఐలు వరుసగా రెండురోజుల పాటు విక్రయాలు జరపడంతో సెంటిమెంట్ బలహీనపడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. హెవీవెయిట్ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తగ్గడంతో సూచీలు క్షీణించాయి. మెటల్, రియల్టీ షేర్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. టాటా స్టీల్, సేసా స్టెరిలైట్, హిందాల్కోలు 2-3% తగ్గగా, డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్ షేర్లు 1-2% పడిపోయాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో (ఎఫ్‌ఐఐలు) ఏర్పడుతున్నాయని, ఈ కారణంగా వారు ఇటీవల వర్ధమాన మార్కెట్లలో లాభాల స్వీకరణ జరుపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఎఫ్‌ఐఐలు మరో రూ. 567 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. కొద్ది నెలల నుంచి అదేపనిగా అమ్మకాలు జరుపుతున్న దేశీయ సంస్థలు మాత్రం తాజాగా రూ. 59.44 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం.
రిలయన్స్ కౌంటర్లో పెరిగిన ఓపెన్ ఇంట్రస్ట్: ఐదు రోజుల నుంచి వరుస నష్టాలు చవిచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) భారీగా పెరిగింది. మూడు నెలలుగా మద్దతునిస్తున్న రూ. 840 సమీపస్థాయిలోనే రిలయన్స్ ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు క్రితంరోజులానే రూ. 7 ప్రీమియంతో క్లోజయ్యింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ఓఐలో 7.12 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 1.32 కోట్ల షేర్లకు పెరిగింది. ఆర్‌ఐఎల్ కౌంటర్లో ఓపెన్ ఇంట్రస్ట్ ఇంతభారీగా పెరగడం అరుదు. రూ. 860 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ రైటింగ్ జరగడంతో 2.65 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.12 లక్షల షేర్లకు పెరిగింది. అలాగే రూ. 840 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్లో 83 వేల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 3.05 లక్షల షేర్లకు చేరింది. ఫ్యూచర్ కాంట్రాక్టులో గరిష్టస్థాయి ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) వున్నందున, సమీప భవిష్యత్తులో ఈ షేరు ఏదో ఒకవైపు వేగంగా కదలవచ్చు. అయితే రూ. 860 స్థాయిని అధిగమించలేకపోతే రిలయన్స్ దిగువవైపుగా ప్రయాణించవచ్చని, ఆ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే ర్యాలీ జరపవచ్చని ఆప్షన్ రైటింగ్ సూచిస్తున్నది.