సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ విలీనంపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఔషధ రంగంలో దిగ్గజాలైన సన్‌ఫార్మా, రాన్‌బాక్సీల విలీన ప్రక్రియపై హైకోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెలువరించనున్నది. తమ విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో శనివారం ఇచ్చే ఉత్తర్వులపై సర్వత్రా ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. రాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రకటనకు ముందే సన్‌ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ భారీ ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ గుండా చంద్రయ్య విచారణ జరిపారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై తాము ఇప్పటికే దర్యాప్తు చేపట్టామని, తాము ఏమీ చేయడం లేదన్న పిటిషనర్ల ఆరోపణల్లో అర్ధం లేదని సెబీ తరఫు న్యాయవాది వై.సూర్యనారాయణ కోర్టుకు నివేదించారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సెబీ దర్యాప్తు సాగుతోందని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని సన్‌ఫార్మా, రాన్‌బాక్సీ, దైచీ కంపెనీల తరఫు సీనియర్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు, విలీన ప్రక్రియకు సంబంధం లేదని, అందువల్ల విలీన ప్రక్రియను ఆమోదించాలని వారు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై శనివారం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని స్పష్టం చేశారు.