సన్, ర్యాన్‌బాక్సీల విలీనానికి తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: సన్‌ఫార్మా, ర్యాన్‌బాక్సీల విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ర్యాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు శనివారం ఎత్తివేసింది. అంతేకాక విలీన ప్రక్రియకు సంబంధించి సన్‌ఫార్మా అనుబంధ కంపెనీ సిల్వర్ స్ట్రీట్ భారీ ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందన్న పిటిషనర్ల ఆరోపణలపై చేస్తున్న విచారణను చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో చేపట్టాలని సెబీని ఆదేశించింది. న్యాయమూర్తి గుండా చంద్రయ్య శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
విలీన ప్రకటనకు ముందే సిల్వర్ స్ట్రీట్ భారీ ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ గుండా చంద్రయ్య ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విని నిర్ణయాన్ని శనివారం వెలువరిస్తానని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆయన శనివారం ఉత్తర్వులు జారీ చేస్తూ, విలీన ప్రక్రియపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సమయంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పైనే తమ ప్రధాన అభ్యంతరమని, దానిపై సెబీ విచారణ జరుపుతున్నందున, దానిని రికార్డ్ చేసి ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని కోరారు. నిర్ణీత వ్యవధిలోపు విచారణ పూర్తి చేసేలా సెబీని ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై సెబీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణను నిర్దిష్ట కాల వ్యవధిలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సెబీని ఆదేశిస్తూ, ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.