సన్ఫార్మా, రాన్బాక్సీ విలీనంపై స్టే ఎత్తివేత
హైదరాబాద్ : ఔషధ రంగంలో దిగ్గజాలైన సన్‌ఫార్మా, రాన్‌బాక్సీల విలీన ప్రక్రియపై హైకోర్టు శనివారం స్టే ఎత్తివేసింది. సుప్రీంకోర్టు సూచనతో హైకోర్టు తక్షణ చర్య తీసుకుంది. రాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రకటనకు ముందే సన్‌ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ భారీ ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దాంతో విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల నేపథ్యంలో జస్టిస్ గుండా చంద్రయ్య స్టే ఎత్తివేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు.