Sun Pharmaceuticals
-
సన్ ఫార్మా లాభం రూ.1,064 కోట్లు
న్యూఢిల్లీ: సన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ1,064 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.270 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సన్‌ఫార్మా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.6,938 కోట్ల నుంచి రూ.8,123 కోట్లకు ఎగసిందని పేర్కొంది. స్పెషాల్టీ వ్యాపారంలో పురోగతి...: వ్యయాల ఆదా, సామర్థ్యాల మెరుగుదలపై దృష్టి సారించడం కొనసాగిస్తున్నామని సన్ ఫార్మా ఎమ్డీ దిలీప్ సంఘ్వి పేర్కొన్నారు. మారుతున్న పరిశ్రమ తీరు తెన్నులకు అనుగుణంగా జనరిక్ వ్యాపారంలో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నామని వివరించారు. గ్లోబల్ స్పెషాల్టీ వ్యాపారంలో కూడా మంచి పురోగతి సాధిస్తున్నామన్నారు. 35% పెరిగిన భారత అమ్మకాలు.. భారత్ అమ్మకాలు 35% వృద్ధితో రూ.2,515 కోట్లకు చేరగా, అమెరికా విక్రయాల్లో పెద్దగా పురోగతి లేదన్నారు. వర్థమాన దేశాల్లో అమ్మకాలు 3% వృద్ధితో 20 కోట్ల డాలర్లకు, మిగిలిన దేశాల్లో విక్రయాలు 49% వృద్ధితో 16 కోట్ల డాలర్లకు పెరిగాయి. రూ.1,616 కోట్ల నిర్వహణ లాభం.... పరిశోధన, అభివృద్ధిపై ఈ క్యూ2లో రూ.488 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇది అమ్మకాల్లో 6 శాతానికి సమానం. నిర్వహణ లాభం 22 శాతం వృద్ధితో రూ.1,616 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్ మాత్రం 21 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది. నికర లాభం రూ.వెయ్యి కోట్లకు పైగా రావడంతో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 3 శాతం లాభంతో రూ.440 వద్ద ముగిసింది. -
సన్-ర్యాన్‌బాక్సీ డీల్‌పై సీసీఐ మరింత దృష్టి
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజాలు సన్-ర్యాన్‌బాక్సీల మధ్య కుదిరిన మల్టీబిలియన్ డాలర్ ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) మరింత నిశిత పరిశీలన చేయనుంది. దీనిలో భాగంగా ప్రతిపాదిత విలీన వివరాలను పది రోజుల్లోగా బహిరంగ పరచాల్సిందిగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అటు సన్ ఫార్మా, ఇటు ర్యాన్‌బాక్సీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశాయి. పది పనిదినాల్లోగా విలీన వివరాలను నిర్ధారించిన రీతిలో బహిరంగపరుస్తూ ప్రచురించాల్సిందిగా సీసీఐ ఆదేశించినట్లు తెలిపాయి. కాగా, విలీనం, కొనుగోలు(ఎంఅండ్ఏ) ఒప్పందంపై బహిరంగ పరిశీలనకు వీలుగా సీసీఐ ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం. తద్వారా సీసీఐ నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీల మధ్య 4 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలు, విలీనం ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ విలీనం వల్ల పోటీ వాతావరణంలో తలెత్తే పరిస్థితులు, దానివల్ల ప్రభావితమయ్యే వ్యక్తులు, సంస్థలకు విలీన వివరాలు తెలిసేలా చేసే యోచనతో సీసీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. వీటిపై సలహాలు, సూచనలు, వ్యాఖ్యలను సీసీఐ ఆహ్వానించనుంది. ఇప్పటికే వివరణ కోరింది...: పూర్తి స్టాక్ రూపంలో ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేసేందుకు సన్ ఫార్మా చేసిన ప్రతిపాదనపై గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి ముందే సీసీఐ రెండు కంపెనీల నుంచి వివరణ కోరింది. ఫార్మా రంగంలోని అతిపెద్ద డీల్స్‌లో ఒకటైన ఈ ఒప్పందాన్ని అనుమతించడం ద్వారా దేశీ పరిశ్రమపై భారీ ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సీసీఐ తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇది దేశీ ఫార్మా రంగంలో పోటీ వాతావరణాన్ని దెబ్బకొట్టే పక్షంలో విలీనానికి ముందు కొన్ని ఆస్తులను విడగొట్టమంటూ రెండు కంపెనీలకూ సీసీఐ సూచించే అవకాశముంది. రెండు కంపెనీల విలీనంవల్ల ప్రపంచంలోనే ఐదో పెద్ద స్పెషాలిటీ జనరిక్స్ ఫార్మా దిగ్గజంగా ఆవి ర్భవించనుంది. అంతేకాకుండా విలీన సంస్థ దేశీయ ఫార్మా రంగంలో నంబర్‌వన్ స్థానాన్ని పొందనుంది. -
తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్!
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు సృష్టిస్తూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. మే నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌లు గురువారం(29న) ముగియనున్న నేపథ్యంలో ప్రధాన ఇండెక్స్‌లు ఒడిదుడుకులను చవిచూడవచ్చునని అంచనా వేశారు. ఎఫ్‌అండ్‌వో విభాగంలో ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకుంటారని చెప్పారు. కాగా, నేడు(26న) దేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. మోడీ అధ్యక్షతన ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంపై ఇటీవల మార్కెట్లు దృష్టిపెట్టాయని నిపుణులు పేర్కొన్నారు. ఇకపై ఎన్డీఏ ప్రభుత్వ పాలసీ ప్రకటనలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇప్పటికే గరిష్ట స్థాయిలో కొత్త రికార్డులను నెలకొల్పిన మార్కెట్లు తదుపరి దశలో ప్రభుత్వ విధానాల ఆధారంగా కదిలే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. మార్కెట్ల జోరు గడిచిన శుక్రవారం (23న) మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు ఎగసి 24,693 వద్ద నిలవగా, నిఫ్టీ కూడా 91 పాయింట్లు పుంజుకుని 7,367 వద్ద స్థిరపడింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయి ముగింపులుకాగా, ఇన్వెస్టర్లు క్యూ4 ఫలితాలను ప్రకటించనున్న మరికొన్ని బ్లూచిప్స్‌పై దృష్టిపెడతారని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ వారం ఆటో దిగ్గజం టాటా మోటార్స్, ఔషధ దిగ్గజం సన్ ఫార్మా, ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా క్యూ4తోపాటు, 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవికాకుండా దేశీ స్టాక్ మార్కెట్ల జోరుకు కారణమవుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయగలవని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ సంకేతాలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపారు. వృద్ధికి ఊతమిచ్చే చర్యలు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ లభించినప్పటినుంచీ మార్కెట్లు నరేంద్ర మోడీ ప్రధానిగా ఏర్పడనున్న మంత్రివర్గంపై అంచనాలు మొదలుపెట్టాయని నిపుణులు చెప్పారు. ఎవరెవరికి కీలక శాఖలు దక్కనున్నాయన్న అంశంపై విభిన్న అంచనాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధానంగా ఆర్థిక, వాణిజ్య, విదేశీ శాఖలకు సంబంధించిన మంత్రి పదవులపై మార్కెట్లలో ఆశావహ అంచనాలున్నట్లు వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన వృద్ధి బాటలో పెట్టగల చర్యలను ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. కొత్త ప్రభుత్వం బిజినెస్‌కు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తుందని, ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు అనువైన విధానాలను అవలంబిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇవికాకుండా జూన్ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్షను చేపట్టనుండటంతో మంత్రివర్గ ఏర్పాటు తరువాత మార్కెట్లు వడ్డీ రేట్ల నిర్ణయాల కోసం ఎదురుచూస్తాయని వ్యాఖ్యానించారు.