న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా–విస్తారా విలీన ప్రతిపాదనపై కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. దీనిపై సంబంధిత పార్టీలకు సీసీఐ షోకాజ్ నోటీసులు పంపినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
ఈ రెండు సంస్థల విలీన ప్రతిపాదన భారత్ విమానయాన రంగానికి ప్రతికూలంగా ఉంటుందని, ఈ రంగంపై వీటికి గుత్తాధిపత్యం లభిస్తుందని వస్తున్న విమర్శలపై ఎందుకు విచారణ చేపట్టకూడదో తెలియజేయాలని ఎయిర్ ఇండియాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఫెయిర్–ట్రేడ్ రెగ్యులేటర్ పేర్కొన్నట్లు సమాచారం.
ఒప్పందం తీరిది...
విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49 శాతం వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51 శాతంగా ఉంది. ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గత ఏడాది నవంబర్‌లో టాటా గ్రూప్ ప్రకటించింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ విమానయాన రంగంలో ఈ ఒప్పందం అతిపెద్ద ఏకీకరణ ఒప్పందంగా సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. ఈ ఒప్పందం సాకారమైతే, దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్‌గా అలాగే ఇండిగో తర్వాత రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్‌గా ఎయిర్ ఇండియా రూపాంతరం చెందుతుంది.
విలీనానికి సంబంధిత సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీసీఐ అనుమతి కోరాయి. వీటిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీస్‌పీఎల్), ఎయిర్ ఇండియా లిమిటెడ్, టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌లు ఉన్నాయి. కాగా, తాజా పరిణామంపై ఎయిర్ ఇండియా ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు.
సీసీఐ సంతృప్తి చెందకపోతే..
తాజా నోటీసులకు సంబంధిత సంస్థలు పంపిన ప్రతిస్పందనలకు సీసీఐ సంతృప్తిపడకపోతే... ఈ విషయంలో కమిషన్ రెండవ దశ చర్యలు చేపడుతుంది. దీనిలో ప్రతిపాదిత ఒప్పందం వివరాలను బహిరంగ పరచాలని పార్టీలకు సూచిస్తుంది. దీనిపై సంబంధిత వర్గాల అభిప్రాయాలనూ ఆహ్వానించి వాటిని పరిశీలిస్తుంది. ఒప్పందంపై తన తుది నిర్ణయం తీసుకునే ముందు సంస్థల నుండి సీసీఐ అదనపు సమాచారాన్ని పొందవచ్చు.
పోటీ సంబంధ ఆందోళనలను పరిష్కరించడానికి గత సందర్భాల్లో సంస్థలు సీసీఐకి స్వయంగా పరిష్కార చర్యలను సమర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని సీసీఐ ఆమోదించడం, షరతులతో కూడిన ఆమోదాలను ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment