న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (సిప్)లు కొన్ని నిలిచిపోతున్నాయి. మార్కెట్లు స్థిరంగా ర్యాలీ చేస్తున్నప్పటికీ మే నెలలో సిప్ ద్వారా పెట్టుబడులను నిలిపివేసిన ఖాతాల సంఖ్య 14.19 లక్షలకు చేరింది. ఏప్రిల్ చివరికి ఉన్న 13.21 లక్షల ఖాతాలతో పోలిస్తే 7.4 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.
మరోవైపు సిప్ రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి మే నెలలో రికార్డు స్థాయిలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొత్త ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈ సాధనాన్ని ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మే నెలలో నూతన సిప్ ఖాతాల నమోదు 24.7 లక్షలుగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇది 19.56 లక్షలుగా ఉండడం గమనార్హం. నిలిచిపోయిన సిప్ ఖాతాలతో పోలిస్తే కొత్తగా నమోదైన సిప్ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఈ మార్గం పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తిని తెలియజేస్తోందని ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ డీపీ సింగ్ పేర్కొన్నారు. సిప్‌లను సులభంగా ఆన్‌లైన్‌లో రద్దు చేసుకునే సదుపాయం ఉండడం కూడా ఒక కారణమన్నారు.
సిప్ ఆస్తులు రూ.7.53 లక్షల కోట్లు
మరోవైపు మే నెలలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా రికార్డు స్థాయిలో పెట్టుబడుల పెట్టడంతో మొత్తం సిప్ ఆస్తుల విలువ ఏప్రిల్ చివరికి ఉన్న రూ.7.17 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.7.53 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 1.43 కోట్ల సిప్ ఖాతాలు నిలిచిపోవడం లేదా గడువు తీరిపోవడం జరిగింది. 2021–22లో ఇలాంటి ఖాతాలు 1.11 కోట్లుగా ఉన్నాయి. ఇక మే చివరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ 4.5 శాతం వృద్ధితో రూ.16.56 లక్షల కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment