అవకాశం ఎక్కడ ఉన్నా అందిపుచ్చుకోవడమే..! | ICICI Prudential Multicap Fund review | Sakshi
Sakshi News home page

అవకాశం ఎక్కడ ఉన్నా అందిపుచ్చుకోవడమే..!

Published Mon, Dec 23 2019 5:26 AM | Last Updated on Mon, Dec 23 2019 5:26 AM

ICICI Prudential Multicap Fund review - Sakshi

లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో వృద్ధి, లాభాలకు అవకాశం ఉన్న స్టాక్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేవే మల్టీక్యాప్‌ ఫండ్స్‌. విడిగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌తో పోలిస్తే మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో రిస్క్‌ తక్కువ. అదే సమయంలో అచ్చమైన లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌తో పోలిస్తే మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో అస్థిరతలు ఎక్కువ. గత ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే రాబడులు ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో అధిక శాతం స్టాక్స్‌ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

త్వరలో ఈ విభాగంలోని స్టాక్స్‌ కూడా ర్యాలీ చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనుక లార్జ్‌క్యాప్‌కే పరిమితం కాకుండా, మార్కెట్‌ వ్యాప్తంగా పెట్టుబడుల అవకాశాలను గుర్తించి ఇన్వెస్ట్‌ చేసే మల్టీక్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచి ఆలోచన అవుతుంది. అందులోనూ సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ కూడా ఒకటి.  

రాబడులు..: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ పథకానికి మార్కెట్లో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1994 అక్టోబర్‌లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి నేటి వరకు వార్షికంగా 14.43 కాంపౌండెడ్‌ రాబడులను (సీఏజీఆర్‌) ఈ పథకం అందించింది. ఇదే కాలంలో నిఫ్టీ–50 వృద్ధి 10.36 శాతమే. గత 15 ఏళ్లుగా ఈ ఫండ్‌లో ప్రతీ నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేసి ఉంటే ఇన్వెస్టర్లకు రూ.51.6 లక్షలు సమకూరేది. ప్రతీ నెలా రూ.10వేల చొప్పున గత మూడేళ్లలో మొత్తం రూ.3.6 లక్షలు ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, అదిప్పుడు రూ.3.9 లక్షలుగా ఉండేది.

అంటే సీఏజీఆర్‌ రాబడులు 6.1 శాతమే. అదే గత ఐదేళ్లలో ప్రతీనెలా రూ.10వేల చొప్పున పెట్టుబడి పెడితే రూ.7.4 లక్షలు అయ్యేది. ఇక్కడ సీఏజీఆర్‌ రాబడులు 8.5 శాతం. ఇక గత పదేళ్ల కాలంలో ప్రతీ నెలా రూ.10వేల పెట్టుబడి పెట్టి ఉంటే రూ.23 లక్షలు సమకూరేవి. ఇక్కడ సీఏజీఆర్‌ రాబడులు 12.5 శాతం. అంటే దీర్ఘకాలంలో ఈ పథకం స్థిరమైన, మెరుగైన రాబడులను ఇచ్చినట్టు చెప్పుకోవాలి. కనుక మార్కెట్లలో అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని, ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం అయితే దీన్ని పరిశీలించొచ్చు.  

పెట్టుబడుల విధానం
టాప్‌ డౌన్, బోటమ్‌ అప్‌ ఈ రెండు విధానాలను రంగాల వారీ, స్టాక్‌ వారీ ఎంపికకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ మేనేజర్‌ అనుసరిస్తున్నారు. ఇందులో టాప్‌ డౌన్‌ అంటే, స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక రంగంలో పరిణామాలు, అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌ ధోరణులను పరిగణనలోకి తీసుకుని అనువైన రంగాలను పెట్టుబడులకు ఎంచుకోవడం. అదే బోటమ్‌ అప్‌ అంటే.. విడిగా కంపెనీలను, వాటి వృద్ధి అవకాశాలు, స్టాక్‌ వ్యాల్యూషన్ల ఆధారంగా పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 78 స్టాక్స్‌ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌లో 71 శాతం, మిగిలిన మేర మిడ్, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 26 శాతం పెట్టుబడులను ఈ రంగం స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement