పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి హార్ట్, క్యాన్సర్ ప్రొటెక్ట్ ప్లాన్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సంస్థ .. హార్ట్/ క్యాన్సర్ ప్రొటెక్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గుండె జబ్బు లేదా క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిన పక్షంలో బీమా కవరేజీలో కొంత భాగాన్ని ఏకమొత్తంగా కంపెనీ అందజేస్తుంది. సరైన చోట సరైన చికిత్స పొందేందుకు ఇది ఉపయోగపడగలదని కంపెనీ ఈడీ పునీత్ నందా తెలిపారు. ఇన్‌కం రిప్లేస్‌మెంట్ పేరిట ప్రత్యేక యాడ్ ఆన్ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. బీమా కవరేజీలో 1 శాతం మేర ప్రతి నెలా పాలసీదారుకు చెల్లిస్తారు.
చికిత్స చేయించుకుంటున్న సమయంలో పాలసీదారు కోల్పోయే ఆదాయాన్ని ఇది కొంత మేర భర్తీ చేయగలదని నందా చెప్పారు. అత్యంత చౌకగా నెలకు రూ. 100కే రూ. 20 లక్షల పైగా క్యాన్సర్ కవరేజీ, రూ. 10 లక్షల హార్ట్ కవరేజీ పొందవచ్చు (సిగరెట్ అలవాటు లేని 30 ఏళ్ల వ్యక్తి, 20 ఏళ్ల వ్యవధికి పాలసీ తీసుకుంటే). క్యాన్సర్ లేదా హృద్రోగం ఉందని పరీక్షల్లో తేలితే భవిష్యత్‌లో ప్రీమియంలు కట్టకపోయినా పాలసీ కొనసాగుతుంది. క్యాన్సర్ లేదా హార్ట్ లేదా రెండింటికీ కలిపి కవరేజీ తీసుకునే వెసులుబాటు ఉంది.
ఇండియాబుల్స్ ఫండ్‌లో ఇన్‌స్టంట్ యాక్సెస్ సదుపాయం
ఇండియాబుల్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తమ లిక్విడ్ ఫండ్‌లో ఇన్‌స్టంట్ యాక్సెస్ సదుపాయం ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్లు సత్వరం తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వారాంతాలైనా, బ్యాంకు సెలవుదినాలైనా, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా మూడొం దల అరవై అయిదు రోజులు, ఇరవై నాలుగ్గంటలూ రిడెంప్షన్ (యూనిట్లు విక్రయించుకోవడం) అవకాశం కల్పిస్తున్నట్లు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అక్షయ్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం దీన్ని దేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఎన్నారై, కార్పొరేట్లకు వర్తించదు. రిడెంప్షన్ అనంతరం నిమిషాల వ్యవధిలోనే సదరు మొత్తం ఐఎంపీఎస్ (ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్) విధానంలో ఇన్వెస్టరు బ్యాంకు ఖాతాలో జమవుతుందని గుప్తా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా రూ. 50,000 దాకా లేదా తమ పోర్ట్‌ఫోలియో విలువలో 90% దాకా (ఏది తక్కువైతే అది) రిడీమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
బజాజ్ అలయంజ్ లైఫ్ నుంచి ఫ్యూచర్ వెల్త్ గెయిన్ పాలసీ
ప్రైవేట్ బీమా దిగ్గజ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా బజాజ్ అలయింజ్ లైఫ్ ఫ్యూచర్ వెల్త్ గెయిన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పథకంలో ’వెల్త్ ప్లస్’, ’వెల్త్ ప్లస్ కేర్’ పేరిట రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకవైపు పాలసీదారు కుటుంబానికి బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా సంపదను మరింతగా పెంచగలిగే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. పాలసీదారు కన్నుమూసిన పక్షంలో వెల్త్ ప్లస్ వేరియంట్‌లో అత్యధిక సమ్ అష్యూర్డ్, ఫండ్ విలువ కుటుంబానికి చెల్లిస్తారు.
డెత్ బెనిఫిట్ కింద అప్పటిదాకా కట్టిన ప్రీమియంలపై 105 శాతం మేర చెల్లింపులు జరుపాతురు. ఇక వెల్త్ ప్లస్ కేర్ వేరియంట్‌లో డెత్ బెనిఫిట్‌తో పాటు పాలసీదారుకు ఇన్‌కమ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు కన్నుమూసినా లేదా ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడినట్లు తేలినా ఇన్‌కమ్ బెనిఫిట్ వర్తిస్తుంది. ఫ్యూచర్ వెల్త్ గెయిన్ ప్రీమియం ఏడాదికి కనీసం రూ.50,000గా ఉంటుంది. గరిష్టంగా 25ఏళ్లకు, కనిష్టంగా 5 ఏళ్లకు పాలసీ తీసుకోవచ్చు.