ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎన్‌బీఎఫ్‌సీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్ కనిపిస్తోంది. గత వారాంతాన ఎఫ్‌పీఐలు కంపెనీలో వాటా కొనుగోలు చేసిన వార్తలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తుంటే.. బీమా అనుబంధ విభాగంలో వాటా విక్రయ వార్తలతో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం..
ఐబీ హౌసింగ్
బల్క్ డీల్ ద్వారా గత వారాంతాన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో విదేశీ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) 1.05 శాతం వాటాకు సమానమైన దాదాపు 45.23 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. షేరుకి రూ. 184.76 సగటు ధరలో వీటిని కొనుగోలు చేయగా.. యూకే సంస్థ బ్లాక్‌రాక్ అడ్వయిజర్స్‌కు చెందిన ఐషేర్స్ 1.66 శాతం వాటాను రెండు ఈటీఎఫ్‌ల ద్వారా కొనుగోలు చేసింది. ఐబీ హౌసింగ్‌లో ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ UCITS 25.69 లక్షల షేర్లు, ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ 45.59 లక్షల షేర్లను.. షేరుకి 189.51 సగటు ధరలో సొంతం చేసుకున్నాయి.
షేరు దూకుడు
విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) వాటా కొనుగోలు వార్తలతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐబీ హౌసింగ్ షేరు 21 శాతం దూసుకెళ్లి రూ. 246 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 254 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమానం 2.9 కోట్ల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.24 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఎఫ్‌పీఐల వాటా కొనుగోలు వార్తలతో శుక్రవారం సైతం ఐబీ హౌసింగ్ కౌంటర్లో భారీ ట్రేడింగ్ నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 202 ఎగువన ముగిసింది. ఈ నెల 26 నుంచీ ఐబీ హౌసింగ్ షేరు నిఫ్టీ మిడ్‌క్యాప్-100 ఇండెక్స్‌లో చోటు దక్కించుకోనుంది. గత మూడు నెలల్లో ఈ షేరు ఏకంగా 160 శాతం ర్యాలీ చేయడం విశేషం!
ఐసీఐసీఐ బ్యాంక్
బీమా అనుబంధ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో 1.5 శాతం వాటాను విక్రయించినట్లు మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. తద్వారా సుమారు రూ. 840 కోట్లను సమీకరించినట్లు తెలియజేసింది. దీంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో బ్యాంక్ వాటా 51.4 శాతానికి పరిమితమైనట్లు పేర్కొంది. ఇక మరో అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్‌లోనూ 3.96 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 2250 కోట్లను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం బలపడి రూ. 371 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 375 వరకూ పెరిగింది. వెరసి వరుసగా మూడో రోజు లాభాలతో కదులుతోంది. కాగా.. మరోపక్క ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేరు సైతం 4 శాతం జంప్‌చేసి రూ. 406 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 419 వరకూ ఎగసింది. ఐసీఐసీఐ లంబార్డ్ షేరు 0.5 శాతం పుంజుకుని రూ. 1277 వద్ద కదులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment