దేశీయంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 164 పాయింట్లు పుంజుకుని 35,075కు చేరింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 35,000 పాయింట్ల మైలురాయి ఎగువన కదులుతోంది. ఇక నిఫ్టీ 55 పాయింట్లు బలపడి 10,386 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆన్‌లైన్ క్లాసిఫైడ్ సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్, బీమా రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ప్రస్తావించదగ్గ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ఇన్ఫో ఎడ్జ్ ఇండియా
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు ఆన్‌లైన్ క్లాసిఫైడ్ సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా పేర్కొంది. తద్వారా రూ. 1,875 కోట్లవరకూ సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వాటాదారుల నుంచి ఈవోటింగ్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది(2019-20) క్యూ4లో కంపెనీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 63 శాతం క్షీణించి రూ. 119 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి రూ. 327 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫో ఎడ్జ్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 2,907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2962 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 1.5 శాతం వాటాకు సమానమైన 21.5 మిలియన్ షేర్లను సోమవారం మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ విక్రయించింది. తద్వారా సమకూర్చకున్న రూ. 840 కోట్లను బ్యాలన్స్‌షీట్‌ను పటిష్టపరచుకునేందుకు వినియోగించనుంది. కాగా.. ప్రయివేట్ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో 1.14 శాతం వాటాను సింగపూర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ. 391.6 ధరలో 16.43 మిలియన్ షేర్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 419 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 424 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. వెరసి రెండు రోజుల్లో ఈ షేరు 7 శాతం బలపడింది.
Comments
Please login to add a commentAdd a comment